Best Indoor Plants For Home : పచ్చగా కనిపిస్తూ ప్రశాంతత కలిగించే మొక్కలను పెంచుకోవడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. కానీ ఉద్యోగాల రీత్యా నగరానికి వచ్చి అద్దె గదుల్లో ఉండటం వల్ల కొందరు, సొంత ఇళ్లైనా ఆరుబయట అనువైన స్థలం లేక కొందరు మొక్కలను పెంచుకోలేక బాధపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చక్కగా పెంచుకోగలిగే మొక్కలు కొన్ని ఉన్నాయి. ఇవి మీ ఇంటిని అందంగా మార్చడమే కాకుండా గదుల్లో పాజిటివిటీని నింపి సంతోషంగా ఉండేలా చేస్తాయట. అంతేకాదు ఇంట్లో పీల్చుకునే గాలిని కూడా శుద్ధి చేస్తాయి. ఇంతకీ ఆ మొక్కల పేర్లేంటీ తెలుసుకుందామా మరి.
పాథోస్ (మనీ ప్లాంట్)
మనీ ప్లాంట్‌గా పిలుచుకునే ఈ మొక్క ఇప్పుడు దాదాపు చాలా ఇళ్లలో కనిపిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో గాలి శుద్ధి అవుతుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మనీ ప్లాంట్ అదృష్టాన్ని, ఆర్థిక వృద్ధిని కలిగిస్తుందట.
స్పైడర్ ప్లాంట్
ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ఈ మొక్కను ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇది గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇంటిని అందంగా మార్చడమే గాక ప్రశాంతమైన వాతావరణానికి దోహదపడుతుంది.
స్నేక్ ప్లాంట్
ముదురు ఆకుపచ్చ రంగులో పాములా మెలికెలు తిరిగే ఆకులు కలిగి ఉండే స్నేక్ ప్లాంట్ ఇంట్లో పెంచుకునేందుకు మంచి మొక్క అని చెప్పవచ్చు. ఇది గాలిలోని హానికరమైన టాక్సిన్లను గ్రహించి నాణ్యమైన గాలిని అందిస్తుంది. ఇంటి లోపల ఉండే ఈ మొక్క ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు తగ్గుతాయని శాస్త్రీయంగా నిరూపణ అయ్యింది.
కలబంద
అందరికీ తెలుసు! ఎన్నో ఆయుర్వేద గుణాలున్న గొప్ప మూలిక కలబంద. దీన్ని బయట మాత్రమే కాదు ఇంట్లోనూ చక్కగా పెంచుకోవచ్చు. దీని పెంపకానికి సూర్య కిరణాలు అవసరం లేదు.
పీస్ లిల్లీ
తెల్లటి పువ్వులతో ఉండే ఈ మొక్క ఇంట్లోని దుర్గంధాన్ని పీల్చుకుని గదంతా మంచి సువాసన నింపుతుంది. ఈ మొక్క దాని చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. అలాగే దీన్ని ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు.
రబ్బర్ ప్లాంట్
దీని ఆకులు రబ్బరుగా ఉంటాయి కనుక దీన్ని రబ్బర్ ప్లాంట్ అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని పెంచుకుంటే ఇంట్లో వాళ్లకి ఎప్పుడూ విజయం వరిస్తుందట.
లావెండర్
ఆకుపచ్చ కాడలతో లావెండర్ రంగు పూలతో ఇంటికే అందాన్ని తీసుకొస్తుంది లావెండర్ మొక్క. దీని పువ్వులు కనులకు విందు చేయడమే గాక మానవ నాడీ వ్యవస్థను శాంతపరిచే సువాసనను వెదజల్లుతాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇల్లంతా సువాసన భరితంగా మారడమే గాక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా పడక గదిలో దీన్ని పెంచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య స్పర్థలు రాకుండా ఉంటాయట.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మెరిసే చర్మం కోసం వేపాకు ఫేస్ ప్యాక్- మొటిమలకు చెక్! ట్రై చేయండిలా - Neem Face Pack Benefits