IS Barley Reducing High Cholesterol: మన శరీరంలో కొవ్వు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. అందుకే.. చాలా మంది కొవ్వును నియంత్రణలో ఉంచుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా మీ డైలీ డైట్లో బార్లీని చేర్చుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను(Cholesterol) తగ్గించడానికి చక్కటి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు. ఇంతకీ, కొలెస్ట్రాల్ తగ్గాలంటే బార్లీ గింజలను ఏ విధంగా తీసుకోవాలి? వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాలు పుష్కలం : బార్లీలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కె. అశ్విని. ముఖ్యంగా ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, పొటాషియం, కాల్షియం, సెలీనియం, జింక్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు. ఫలితంగా బార్లీ గింజలను డైలీ డైట్లో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది : మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బార్లీలోని పోషకాలు చాలా బాగా సహాయపడతాయంటున్నారు డాక్టర్ అశ్విని. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను(National Library of Medicine రిపోర్టు) తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు.
2017లో "BMC మెడిసిన్ జర్నల్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. బార్లీ వాటర్ తాగే వ్యక్తులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 9% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చైనాలోని షాంఘై జియాటాంగ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ డాంగ్ లియు ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు.
బార్లీ గింజలను ఎలా తీసుకోవాలంటే?
బార్లీ గింజలతో ప్రిపేర్ చేసుకున్న వాటర్(Barley Water) తాగడం శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు డాక్టర్ అశ్విని. లేదంటే.. బార్లీని పౌడర్లా ప్రిపేర్ చేసుకొని చపాతీ పిండిలో కలుపుకొని తీసుకోవడం, ఓట్స్‌లో మిక్స్ చేసుకొని తీసుకోవడం, సూప్‌లలో కలుపుకొని తాగినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. అయితే, బార్లీని డైలీ డైట్లో చేర్చుకోవడం ద్వారా ఒక్క కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది : బార్లీలో పుష్కలంగా ఉండే పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు డాక్టర్ అశ్విని. అలాగే.. కడుపులో మంట, అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం ఉన్నవారు బార్లీ నీటిని తీసుకోవడం ద్వారా మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
మధుమేహాలకు దివ్యౌషధం : బార్లీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా దీనిలో ఉండే బీటా-గ్లూకాన్ రక్తప్రవాహంలో చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదిస్తుంది. కాబట్టి.. మధుమేహులు బార్లీని డైలీ డైట్లో చేర్చుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు డాక్టర్ అశ్విని.
మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు : బార్లీ శరీరంలో అధిక నీటిని తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలనూ అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి బార్లీలోని పోషకాలు చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ అశ్విని. అలాగే.. బార్లీని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
బార్లీ గింజల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా?
హెచ్చరిక : చపాతీలను ఎలా కాలుస్తున్నారు? - ఇలా కాలిస్తే క్యాన్సర్ వస్తుందట!