Ayurvedic Treatment for Dry Cough: వాతావరణంలో కాస్త మార్పు వచ్చిందంటే చాలు.. చాలా మందిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చేస్తాయి. అలాగే.. కొందరిలో వెదర్ ఛేంజ్ వల్ల మాత్రమే కాకుండా కాస్త చల్లని ఆహారం తీసుకున్నా, చల్లని గాలి తగిలినా బాడీలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ఇంకొందరిలో తాగే నీటిలో మార్పులు వచ్చినా దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఎటాక్ చేస్తుంటాయి. అయితే.. కొన్నిసార్లు విపరీతమైన పొడిదగ్గు వేధిస్తూ ఉంటుంది. పొడి దగ్గు వల్ల ఎంతో ఇబ్బంది పడాల్సివస్తుంది. అయితే ఇలాంటి వారికోసం ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని చెబుతున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ గాయత్రీ దేవి.
కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు బియ్యం
- ఒక కప్పు నువ్వులు
- 8 కప్పుల పాలు
- సైంధవ లవణం
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో పాలు పోసుకుని వేడి చేసుకోవాలి.
- పాలు మరిగాక అందులో బియ్యం, నువ్వులు వేసి కలిపి లో ఫ్లేమ్‌పై మెత్తగా ఉడికించుకోవాలి. (దీనిని జావాలగా నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఎక్కువ మంటపై కాకుండా.. లో ఫ్లేమ్‌పై నెమ్మదిగా ఉడికిస్తే అందులోని సారమంతా మిగిలిపోతుంది)
- ఇప్పుడు ఇందులో రుచి కోసం సైంధవ లవణం వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి.
ఈ ఔషధాన్ని ఎప్పుడు తీసుకోవాలి?: పొడి దగ్గు సమస్య ఉన్నవారు రోజూ అన్నం తినే సమయంలో దీనిని ఓ పదార్థంగా తీసుకుంటే సరిపోతుందని గాయత్రీ దేవి సూచిస్తున్నారు. ఒక చిన్న కప్పులో ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు సమస్యకు మంచి ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు.
పాలు: పాలల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయని గాయత్రీ దేవీ చెబుతున్నారు. పొడి దగ్గు సమస్యకు పాలు చక్కటి ఔషధంగా పని చేస్తాయని వివరించారు.
బియ్యం: మనం ఆహారంగా తీసుకునే బియ్యంలో శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. ఇంకా దీనిలో పొడి దగ్గుకు కారణమయ్యే వాత దోషాన్ని తగ్గించే గుణం ఉంటుందని వివరిస్తున్నారు.
నువ్వులు: వాతాన్ని తగ్గించడంలో నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని గాయత్రీ దేవి తెలిపారు. నువ్వుల లోపల ఉండే నూనె వల్ల వాత దోషం తగ్గి దగ్గు సమస్య త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బీపీ ఎక్కువవుతోందా? - ఈ డైట్ పాటిస్తే ఆల్ సెట్ అంటున్న నిపుణులు!
కంటి నిండా చక్కటి నిద్ర కావాలా నాయనా? - రోజూ ఇలా చేయాల్సిందే అంటున్న వైద్యులు!