Turmeric Overdose Side Effects: పసుపు యాంటీ బయాటిక్ అని.. ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇలా అతిగా వాడడం వల్ల అనేక అనర్థాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. పసుపును మోతాదుకు మించి వాడడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి, దీన్ని అతిగా వాడితే ఏమవుతుంది? ఎంత మోతాదులో వాడడం మంచిది? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Journal of Medicinal Food అధ్యయనం ప్రకారం.. పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో తలనొప్పి, మగతగా అనిపించడం, విరేచనాలు, మలబద్ధకం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్క్యుమిన్ స్థాయులు పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. Curcumin: A Review of Its’ Effects on Human Health అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో అమెరికాలోని Central Michigan University ప్రొఫెసర్ Susan J Hewlings పాల్గొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జీర్ణ సమస్యలు: మనం రోజువారీ ఆహారంలో ఉపయోగించే పసుపు పైత్య రసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని నిపుణులు వెల్లడించారు. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహకరిస్తుందని వివరించారు. అయితే పసుపును మోతాదుకు మించి తీసుకుంటే పైత్య రసం ఎక్కువగా ఉత్పత్తవుతుందని తెలిపారు. ఫలితంగా ఆమ్లాల మోతాదు కూడా పెరిగి జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పరిస్థితి కొన్నిసార్లు పేగుల్లో అల్సర్లకూ కారణమవుతుందని పేర్కొన్నారు.
కిడ్నీలో రాళ్లు: పసుపులో ఉండే ఆక్సలేట్ సమ్మేళనాలు శరీరంలోని క్యాల్షియం సమ్మేళనాల మధ్య బంధాన్ని దృఢం చేయడంలో సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాల్షియం విచ్ఛిత్తి జరగక.. అవి క్యాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్‌గా మారతాయని వీటినే కిడ్నీ స్టోన్స్‌గా పిలుస్తారన్నారు. కూరల్లో మోతాదుకు మించి పసుపు వాడే వారిలో దీర్ఘకాలంలో ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
రక్తహీనత సమస్యలు: సాధారణంగా పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం.. మనం తీసుకునే ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించేలా చేస్తుందని వివరించారు. అదే పసుపు ఎక్కువైతే శరీరం ఐరన్ను గ్రహించే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఫలితంగా ఇది దీర్ఘకాలంలో రక్తహీనత సమస్య తలెత్తేందుకు కారణమవుతుందని హచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంకా కొంతమందిలో ఇది రక్తపోటు పడిపోవడానికీ కారణమవుందని పేర్కొన్నారు. ఇంకా మరికొంతమందిలో రక్తం పల్చబడే సమస్య ఉంటుంది. ఇలాంటి వారు పసుపు మోతాదు మించకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసుపులో రక్తం పల్చబడేలా చేసే గుణాలు ఉంటాయని.. అందుకే ఈ సమస్య ఉన్న వారు డాక్టర్ సలహా మేరకే పసుపు వాడాల్సి ఉంటుందని సలహా ఇస్తున్నారు.
మరి ఎంత పసుపు వాడాలి?
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయని వివరించారు. ఇక ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్లు ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని కాపాడతాయని అంటున్నారు. ఇవే కాకుండా క్యాన్సర్, గుండె సంబంధిత లాంటి సమస్యలూ రాకుండా చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ ఫలితాలన్నీ పొందాలంటే మాత్రం పసుపును తగిన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజువారీ కూరల్లో అర టీస్పూన్ మించి వేసుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బీర్ ఆరోగ్యానికి మంచిదా? ఈ 6 విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!
మీరు షుగర్ పేషెంట్సా? - రాత్రిపూట ఇలా చేస్తే చక్కెర స్థాయులు పెరుగుతాయట! - ఇవి తప్పక తెలుసుకోండి!!