Amazing Health Benefits of Yellow Watermelon: పుచ్చకాయ లోపల రంగును లైకోపీన్ అనే రసాయనం నిర్ణయిస్తుంది. దాని సమృద్ధి కారణంగా, పుచ్చకాయ ఎరుపు రంగులో ఉంటుంది. అయితే.. పసుపు పుచ్చకాయలో లైకోపీన్ తక్కువ ఉండటం వల్ల.. అది ఎల్లో కలర్లో ఉంటుంది. అయితే.. ఎరుపు పుచ్చకాయ కంటే పసుపు రంగుదే తియ్యగా ఉంటుంది. ఇవి ఎడారి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. గుజరాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే వీటిని ఎక్కువగా పండిస్తారు. నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి పెరగవు.
పోషకాలు చూస్తే: ఎర్రటి పుచ్చకాయతో పోలిస్తే పసుపులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఎ, పొటాషియం, మెగ్నీషియం, లైకోపిన్, బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.
కంటి ఆరోగ్యానికి మంచిది: పసుపు పుచ్చకాయలో బీటా కెరోటిన్, ల్యూటిన్, జియాక్సంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో సాయపడతాయి. అలాగే మాక్యులర్ క్షీణత వంటి వయసు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది: పసుపు పుచ్చకాయలోని పొటాషియం వాసోడైలేటింగ్ లక్షణాలు మన రక్త నాళాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా అధిక రక్తపోటు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
2006లో "American Journal of Clinical Nutrition" ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పసుపు పుచ్చకాయ తిన్న వారిలో సిస్టోలిక్ రక్తపోటు 5% తగ్గిందని, డయాస్టోలిక్ రక్తపోటు 3% తగ్గిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ జె. ఆల్డెర్మాన్ పాల్గొన్నారు. పసుపు పుచ్చకాయలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: పసుపు పుచ్చకాయలోని డైటరీ ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే లైకోపిన్ కూడా చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో సాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పసుపు పుచ్చకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, జలుబు, ఫ్లూ వంటి సాధారణ అంటు వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పసుపు పుచ్చకాయలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఫైబర్ కూడా కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఎక్కువ తినొద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని ఏది అధికంగా తిన్నా ప్రమాదమే. కాబట్టి మితంగా తినాలి. పసుపు పుచ్చకాయను కూడా మితంగా తినాలి. లేకుంటే అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. తద్వార మైకం, అధిక చెమట, అధిక ఆకలి, వేగవంతమైన హృదయ స్పందన రేటు, గందరగోళం, చిరాకు లేదా మానసిక కల్లోలం వంటి సమస్యలను కలిగిస్తుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పీసీఓఎస్‌తో బాధపడుతున్నారా? - ఇలా చేశారంటే అంతా సెట్! - Food Guide for Pcos Women