Side Effects of Drinking Alcohol With Cold Drinks : 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని.. సినిమాలు, టీవీల నుంచి మనకు కావాల్సిన వాళ్ల దాకా అందరూ చెప్తుంటారు. అయినా దానిని పట్టించుకోరు.. పైగా సోడా కలుపుకుని మరీ తాగుతుంటారు. ఇంకొందరు అయితే ఏకంగా మందులో కూల్‌డ్రింక్స్ మిక్స్ చేసి లాగించేస్తుంటారు. అయితే ఆల్కహాల్లో కూల్‌డ్రింక్ కలిపి తాగితే చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మందులో కూల్‌డ్రింక్ మిక్స్ చేసుకొని తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. చాలా కూల్ డ్రింక్స్‌లో కెఫెన్, కేలరీలు, చక్కెర వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. వాటిని మద్యంతో కలిపి తీసుకోవడం ద్వారా అనేక వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతుందంటున్నారు. అంతేకాదు.. కూల్‌డ్రింక్స్‌తో ఆల్కహాల్‌ను కలిపినప్పుడు పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకుంటారని.. ఎందుకంటే.. దానిలో ఉండే కెఫెన్ మీకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా మరింత తాగేలా ప్రోత్సహిస్తుందని.. దాంతో మీరు మద్యానికి బానిసగా మారవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం : కూల్‌డ్రింక్స్‌లో అధిక కేలరీలు, చక్కెర స్థాయిలు ఉంటాయి. క్రమం తప్పకుండా ఆల్కహాల్లో ఏదైనా కూల్‌డ్రింక్ కలుపుకోవడం వల్ల కెలరీల సంఖ్య మరింత పెరిగి ఊబకాయం రావడానికి దారితీస్తుందంటున్నారు నిపుణులు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. శీతల పానీయాలలోని అధిక చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని.. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు ఎప్పుడూ ఆల్కహాల్, కూల్ డ్రింక్స్‌ని మిక్స్ చేసి తాగకూడదని సూచిస్తున్నారు.
మందు బాబులకు అలర్ట్ - లివర్ దెబ్బతినొద్దంటే ఆల్కహాల్ ఆ లిమిట్ దాటొద్దంట!
గుండె జబ్బుల ప్రమాదం : ఆల్కహాల్‌తో కూడిన కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం గుండె ఆరోగ్యానికి చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కెఫెన్, ఆల్కహాల్ రెండూ రక్తపోటుపై వేర్వేరు ప్రభావాలను చూపుతాయంటున్నారు. ముఖ్యంగా ఈ రెండింటినీ కలిపి తాగితే బ్లడ్ ప్రెజర్లో హెచ్చుతగ్గుతులు ఏర్పడి గుండెపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాదు.. వీటిని మిక్స్ చేసి తాగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ఇతర గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు.
2009లో 'హైపర్ టెన్షన్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆల్కహాల్లో కూల్ డ్రింక్ కలుపుకుని తాగే వారిలో రక్తపోటు సమస్యలు తలెత్తే ఛాన్స్ ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ జె. లీ పాల్గొన్నారు.
లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది : మద్యం, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర రెండూ కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి, దీర్ఘకాలికంగా ఈ రెండింటినీ మిక్స్ చేసుకొని తాగడం వల్ల కాలేయం దెబ్బతినడం, కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మానసిక సమస్యలు : మందు, కూల్‌డ్రింక్స్ కాంబినేషన్ కేవలం శారీరక సమస్యలకే కాకుండా మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందని అంటున్నారు నిపుణులు. ఆల్కహాల్, శీతలపానీయాలలోని కెఫెన్ ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.