Karthik Aryan Remuneration : బ్లాక్ అండ్ వైట్ జమానాలో స్టార్ హీరోలు ఒక్క సినిమాకు వందల్లో పారితోషికం తీసుకున్నారని మనం చాలా సార్లు విన్నాం. అలాంటి స్టార్స్ లక్షల్లో, కోట్లలోనూ పారితోషకం అందుకుని దుసుకెళ్లడం కూడా చూశాం. కానీ ఈ జనరేషన్‌కు చెందిన ఓ హీరో కేవలం రూ.1500 అందుకుని యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్‌కు ఏకంగా రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే రేంజ్‌కు వెళ్లిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
తొలి సినిమాతో నిరాశ - రూ.1500 రెమ్యూనరేషన్
సొట్ట బుగ్గలతో ఖతర్నాక్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తారు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. తొలిసారిగా తాను నటించిన ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కోసం రూ.1500 చెక్ అందుకున్నారు. అయితే సినిమాల్లోకి మాత్రం 'ప్యార్ కా పంచనామా'తో ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇద్దరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆ సినిమా అంత సక్సెస్ సాధించలేకపోయింది. అయితే తన నటనకు మాత్రం మంచి మార్క్ అందుకున్నారు కార్తిక్. దీంతో వరుసపెట్టి ఆఫర్లు తన వద్దకు వచ్చాయి. 'సోనూ కే టీటూ కి స్వీటీ', 'భూల్ భులయ్యా 2', 'సత్య ప్రేమ్ కి కథ' లాంటి చిత్రాలతో అనతికాలంలోనే సూపర్ హిట్లతో పాటు స్టార్డమ్ అందుకున్నారు.
ఇప్పటి వరకూ ఈ యంగ్ హీరో సంపాదించిన ఆస్తి విలువ రూ.39 కోట్ల నుంచి రూ.46 కోట్ల మధ్యలో ఉంటుందని ట్రేడ్ వర్గాల టాక్.ప్రస్తుతం కార్తీక్ అర్మానీ ఎక్స్‌ఛేంజ్ , సూపర్‌డ్రై , బోట్, మెక్‌డొనాల్డ్స్ లాంటి పలు ఫేమస్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దాని ద్వారా సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లు వసూలు చేస్తున్నారట. దీంతో పాటుగా తన తర్వాతి సినిమా అయిన భూల్ భూలయ్యా 3లో నటించేందుకు ఆయన రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో చేసిన 'భూల్ భూలయ్యా 2'కు ఈయన రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. 'సోనీ కే టీటూ కి స్వీటీ' హిట్ తర్వాత కార్తీక్ తన రేట్ పెంచేసుకున్నారంటూ సినీ వర్గాలు చెబుతున్నాయి.