Modi Biopic Sathyaraj: ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి మరో బయోపిక్ రానున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ (బాహుబలి కట్టప్ప) నటిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలోనే మోదీ బయోపిక్‌లు వచ్చినప్పటికీ ఈ సారి సత్యరాజ్ నటిస్తున్నారనడం వల్ల ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెరిగింది.
అయితే తాజాగా ఈ వార్తలపై స్వయంగా సత్యరాజే స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడారు. 'నేను నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. అందులో ఎలాంటి నిజం లేదు. అవి చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ అవాస్త వార్తలను నమ్మకండి. ఆ చిత్రం కోసం నన్నెవరూ ఇప్పటివరకు కాంటాక్ట్ అవ్వలేదు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు. ఒకవేళ మోదీ బయోపిక్ కోసం ఎవరైనా సంప్రదించినా నేను చేయను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ ఉంటుంది' అని క్లారిటీ ఇచ్చారు. గతంలోనూ ఓ సారి ఈ విషయంపై సత్యరాజ్ మాట్లాడారు. అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. మోదీ బయోపిక్‌లో తాను నటించను అని క్లారిటీ ఇచ్చారు.
కాగా, మోదీ జీవితంపై బయోపిక్ కోసం సన్నాహాలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనే పీఎం నరేంద్ర మోదీ పేరుతో ఓ హిందీ చిత్రం కూడా తెరకెక్కింది. దీనికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషించారు. అందులో మోదీ బాల్యం నుంచి ప్రధాని అయ్యేవరకు చాలా అంశాలు చూపించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.
ఇకపోతే సత్యరాజ్ ఈ మధ్య కాలంలో చాలా చిత్రాల్లో నటించారు. లవ్ టుడే, కనెక్ట్, థీర్కాదర్శి, అంగారగన్, సింగపూర్ సెలూన్ వంటి సినిమాల్లో కనిపించారు. తెలుగులో చివరిగా వాల్తేరు వీరయ్యలో సందడి చేశారు. ప్రస్తుతం ఆయన చేతిల్లో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.