SJ Suryah Saripoda Sanivaram : ఎస్ జే సూర్య ఇప్పుడీ పేరు కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ బాగా వినిపిస్తోంది. వాస్తవానికి చాలా మంది సినీ ప్రియులకు ఈయన సుపరిచితమే. ఎందుకంటే ఈయన నటుడు కాకముందు దర్శకుడు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి 'ఖుషి' అనే చిత్రాన్ని అప్పట్లోనే తెరకెక్కించి కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తమిళంలో అజిత్‌తో 'వాలి' చేసి భారీ హిట్‌ను అందుకున్నారు. అలా ఇక్కడ, తమిళంలో దర్శకుడిగా తనదైన మార్క్‌ను వేసుకున్నారు.
అయితే గత కొన్నేళ్లుగా ఎస్ జే సూర్యలోని దర్శకుడు కనపడట్లేదు. ఆయనలోని నటుడే బాగా హైలైట్ అవుతున్నాడు. అప్పట్లో తెలుగులో మహేశ్‌తో 'నాని' చిత్రాన్ని చేసిన సూర్య, అదే సినిమాను కోలీవుడ్‌లో అజిత్‌తో చేయాలనుకున్నారు. కానీ అది కుదరక తానే అందులో నటించారు. మహేశ్ సినిమా ఇక్కడ డిజాస్టర్ అయినప్పటికీ తమిళంలో ఎస్ జే సూర్య నటించిన నాని హిట్ అయింది. నటుడిగా సూర్యకు మంచి పేరు కూడా వచ్చింది.
అలా ఆయన నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని సెన్సేషనల్ పెర్ఫామెన్స్‌గా సూర్యకు పేరు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా 'ఇరైవి'లో చేసిన దర్శకుడి పాత్ర బాగా హిట్ అయింది. ఆ తర్వాత విలన్ పాత్రలతో ఆయన ముందుకెళ్లారు. మహేశ్ 'స్పైడర్' డిజాస్టర్ అయినప్పటికీ అందులో సూర్య పోషించిన సైకో విలన్ పాత్ర ఫుల్ పాపులర్ అయింది. ఈ పాత్రతో తెలుగువాళ్లకు బాగా గుర్తుండిపోయారు.
అనంతరం తమిళంలో సూర్యకు సైకో పాత్రలు బాగా వచ్చాయి. 'నెంజం మరప్పదిల్లై', 'మానాడు' లాంటి సినిమాల్లో అయితే సూర్య నటనే హైలైట్. ముఖ్యంగా సైకో పాత్రలు సూర్యకు బాగా సెట్ అయ్యాయి. అలానే ఇప్పుడు 'సరిపోదా శనివారం' చిత్రంలోనూ సైకో తరహా పాత్రే చేశారు సూర్య. తన పైశాచికత్వం చూపించే ప్రతి సన్నివేశంలో రెచ్చిపోయారు. తాను కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు అలెర్ట్‌గా చూసేలా నటించారు సూర్య. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు అదిరే పెర్ఫామెన్స్‌తో ఇతర నటుల్ని డామినేట్ చేసేలా కనిపించారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలో ఎస్ జే సూర్యను తప్ప మరొకరిని ఊహించుకోలేం అనేంతగా చేశారని బయట కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 'వస్తాడు, సైకోయిజంతో అలరిస్తాడు, రిపీట్' అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.