Samantha Criticised by Grammy Award Winner Ricky Kej : టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇస్తున్న హెల్త్ టిప్స్ వివాదానికి దారి తీస్తున్నాయి. ఆరోగ్యం గురించి సామ్ ఇచ్చిన సలహా ప్రమాదకరమైనదంటూ ప్రముఖులు, వైద్యులు కొందరు మండిపడుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత మరొకరు ఆమెను విమర్శిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ఇప్పుడు గ్రామీ అవార్డు గ్రహీత, మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ కూడా ఆమెపై మండిపడ్డారు.
ఇటీవల ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రికీ కేజ్ ఇలా అన్నారు. "ఒక సెలబ్రిటీ సూచించిన మెడికల్ ప్రొసీజర్ చాలా మందిపై ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రమాదకరమైన సూచనలు ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే అవకాశం ఉంది. ఇది మర్చిపోయి ఆమె పూర్తిగా బాధ్యత లేకుండా మాట్లాడి చాలా ప్రాణాలను రిస్క్‌లోకి నెడుతోంది. రెగ్యూలర్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రభావవంతంగా పనిచేయదనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారంతా ఇలాంటి మాటలు వింటే పెడదారిన పడే ప్రమాదముంది. నన్ను అడిగితే ఆమె ఇలాంటి కామెంట్లు చేయడం తప్పు. పైగా ఆమె చేసిన కామెంట్లను వెనకేసుకురావడం ఇంకా పెద్ద తప్పు. వీటి వల్ల కేవలం ఆమె మాత్రమే కాదు ఆమె ఆరోగ్య సమస్యలను నయం చేసిన డాక్టర్లను కూడా కించపరచాల్సిన పరిస్థితి వచ్చింది " అంటూ సమంతపై రిక్కీ తీవ్రంగా మండిపడ్డారు.
ప్రత్యామ్నాయ మెడిసిన్ వాడమని సూచిస్తున్న సమంతను తిట్టిపోసిన రికీ కేజ్ - ఆమె షుగరీ డ్రింక్స్‌ను, పెట్ డాగ్స్ కోసం ప్రోసెస్‌డ్ ఫుడ్‌ను ప్రమోట్ చేస్తుందని గుర్తు చేశారు. ఒకవేళ ఆ ప్రొడక్ట్స్ వాడేందుకు పనికి వచ్చేవే అని ఆమె వాదించినా, హెల్త్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.
అంతకంటే ముందు సమంత డాక్టర్లు ఫిలిప్స్, లివర్ డాక్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. లివర్ డాక్ అయితే ఏకంగా ఆమెను "వైద్యం గురించి తెలియని నిరక్షరాసి" అంటూ తిట్టిపోశారు. దానికి సమంత స్పందిస్తూ "నేను సదుద్దేశంతో చేసిన పోస్టుపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను జైలులో వేయాలని కూడా అంటున్నారు. సెలబ్రెటీల విషయంలో ఇలాంటివి సాధారణమే.. పరవాలేదులే" అంటూ రిప్లై ఇచ్చారు. కానీ తర్వాత సమంతకు క్షమాపణలు చెప్పారు. కాగా, 2022లో సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చికిత్సను అందుకుంటోంది.
Samantha Upcoming Movies : ఇక సమంత సినిమాల విషయానికొస్తే త్వరలోనే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ వెబ్‌సిరీస్‌తో పలకరించనుంది. రీసెంట్గా తన సొంత బ్యానర్లో "బంగారం" అనే సినిమాను అనౌన్స్ చేసింది. దీనికి స్వయంగా తానే ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. అలానే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.