Ramoji Rao Demise : ఈనాడు గ్రూప్ సం స్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై సినీ, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు.
తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటం లేని మహారాజు : నందమూరి బాలకృష్ణ
"తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటం లేని మహారాజు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. చిత్రసీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింపజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. మా తండ్రి నందమూరి తారక రామారావుతో ఆయన అనుబంధం ప్రత్యేకమైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను".
ఆయన జీవితం స్ఫూర్తి పాఠం : బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
"రామోజీ మరణం తెలుగువారికి తీరని లోటు.ఆయన జీవితాన్ని మించిన స్ఫూర్తి పాఠం మరొకటి లేదుఎంతో మంది క్రీడాకారులకు గుప్త సాయం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"
రామోజీ మరణం తెలుగు జాతికి తీరని లోటు : సినీ నిర్మాత అశ్వనీదత్
"ఏ రంగంలో అయినా, ఎలాంటి నేపథ్యం లేకపోయినా కష్టపడితే చాలు విజయం దక్కుతుంది అనే స్ఫూర్తిని నాలాంటి ఎంతోమందికి పంచిపెట్టిన రామోజీరావు జన్మ ధన్యం. తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన మరణం ఈ దేశానికి, ముఖ్యంగా తెలుగు జాతికి తీరని లోటు".
రామోజీ నుంచి జీవిత పాఠాన్ని నేర్చుకున్నా: మంచు విష్ణు
రామోజీరావు గారి మృతి చాలా బాధాకరం. ఆయన్ని కలిసిన ప్రతిసారి ఎంతో లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నాను. ఆయన తెలివి, ధైర్యం, నాపై చెరగని ముద్ర వేశాయి. సినీ పరిశ్రమకు కూడా ఆయన ఎప్పుడూ అండగా నిలిచారు. జర్నలిజం, వినోద రంగంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియచేస్తున్నా.
'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ నివాళి - సెట్స్ నుంచే
పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరమని రామ్ చరణ్ అన్నారు. రాజమండ్రిలో ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్ జరుగోతంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే రామ్ చరణ్ రామోజీకి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మూవీ టీమ్ మొత్తం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు అస్తమయం నన్ను బాధించింది : రజినీకాంత్
"జర్నలిజం, సినీ రంగాల్లో రామోజీరావు చరిత్ర సృష్టించారు.రాజకీయాల్లో రామోజీరావు కింగ్ మేకర్.రామోజీరావు నా జీవితంలో గొప్ప ప్రేరణ, మార్గదర్శకులు నా గురువు, శ్రేయోభిలాషి రామోజీరావు అస్తమయం నన్ను బాధించింది"