Prathinidhi 2 Review : టాలీవుడ్ స్టార్ హీరో నారా రోహిత్ గతంలో చేసిన 'ప్రతినిధి' సినిమాకి కొనసాగింపుగా రూపొందిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2. రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే ?
స్టోరీ ఏంటంటే :
నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). చిన్నతనంలో తన జీవితంలో జరిగిన పలు ఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. దీంతో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసే చేతన్‌ని ఎన్.ఎన్.సి ఛానల్ ఏరికోరి మరీ సీఈఓగా నియమిస్తుంది. ఇక రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్రభావితం చేస్తాడు చే. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై అనుకోకుండా హత్యాయత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు ? సీబీఐ పరిశోధనలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ? చేతన్ చేసిన పోరాటం ఏంటి ? తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే !
ఎలా ఉందంటే :
వ్యవస్థని ప్రశ్నించడమే ప్రధానంగా 'ప్రతినిధి' సినిమా తెరకెక్కింది. అందులో ఓ సామాన్యమైన వ్యక్తిగా కనిపించిన నారా రోహిత్, ఈసారి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజంలో ఉంటూ ప్రశ్నించే యువకుడిగా మెరిశారు. నారా రోహిత్, మూర్తి కలయిక అనగానే సహజంగానే ఇది ఓ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ఓ అంచనాలో ఉంటారు చాలా మంది. కానీ, ఈ స్టోరీ అందుకు పూర్తి భిన్నంగా తెరకెక్కింది. ముఖ్యమంత్రి హత్య, ఆ తర్వాత ఆయన తనయుడు ఆ పదవి చేపట్టాలనుకోవడం వంటి విషయాలు గతంలో తెలుగు రాజకీయాల్లో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసినప్పటికీ, దానికంటే కూడా ఫక్తు కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు డైరెక్టర్. ఏ ఒక్క పార్టీకో ఉపయోగపడే సినిమాలా కాకుండా, జర్నలిజం, రాజకీయ వ్యవస్థల్ని తనదైన స్టైల్లో ఆవిష్కరించారు. తొలి సగ భాగంలో కలం చేతపట్టిన హీరో, సెకెండ్ పార్ట్ వచ్చే సరికి కత్తి పడతాడు. ఆ క్రమంలో జరిగే మలుపులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఇంట్రడక్షన్ సీన్స్‌లో హీరో పాత్ర స్టైల్ జర్నలిజం గొప్పతనాన్ని చాటుతాయి. హీరో ఎన్.ఎన్.సి ఛానల్‌లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మంత్రి గజేంద్ర (అజయ్ ఘోష్) అరాచకాల్ని ప్రశ్నించి అతని పదవి పోయేలా చేయడం, ఆ తర్వాత జరిగే బై ఎలక్షన్స్‌లో ప్రతిపక్షం నుంచి పోటీ చేసిన నరసింహ (పృథ్వీరాజ్) చేసిన ఆకృత్యాల్ని వెలుగులోకి తీసుకు రావడం, ఆ నేపథ్యంలో జరిగే డ్రామా సినిమాకి కీలకంగా మారింది. ఓటు విలువని చాటి చెబుతూ తీర్చిదిద్దిన సన్నివేశాలు కూడా చిత్రానికి బలంగా నిలిచాయి.
ఇక ఇంటర్వెల్ సీన్స్‌కు ముందు వచ్చే ట్విస్ట్ సెకెండాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది. అప్పటిదాకా సహజంగానే సాగుతున్నట్టుగా అనిపించిన ఈ సినిమా, ఆ తర్వాత కథ, కథనాల వల్ల మరీ నాటకీయంగా మారిపోతాయి. సీఎం క్యాంప్ ఆఫీస్‌లో బాంబు పేలుడు, ఆ తర్వాత జరిగే పరిణామాలు, కేంద్రమంత్రి స్పందిస్తే తప్ప అవి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి తెలియకపోవడం వంటి విషయాలు అసంబద్ధంగా అనిపిస్తుంటాయి. ఆ సీన్స్ ఈ సినిమా గతినే మార్చేశాయి. మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుని అటువంటి సీన్స్‌ను క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది.
ఆ తర్వాత సెకెండాఫ్‌లో హీరో బ్యాక్గ్రాండ్ కుటుంబ నేపథ్యం, అతని లక్ష్యం, పాటలు, ఫైట్లు ఇవన్నీ ఓ సగటు ఫార్ములా తెలుగు సినిమా కథ లాగే సాగుతుంది. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం వెనక ఎవరున్నారనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే సన్నివేశాలు మాత్రం కాస్త ఆసక్తికరంగా సాగుతాయి. ప్రతిష్టాత్మకమైన పరిశోధన సంస్థ సీబీఐని ఇందులో మరీ సాదాసీదాగా చూపించారు. ఇది పెద్దగా మెప్పించదు. మొత్తంగా మన మార్క్ మసాలాతో రూపొందిన మరో సగటు చిత్రం ఈ ప్రతినిధి 2. అయితే అక్కడక్కడా కొన్ని మెరుపులు ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే :
గాఢతతో కూడిన చే తరహా పాత్రలు హీరో నారా రోహిత్‌కి బాగా నప్పుతాయి. ఓ జర్నలిస్ట్‌గా ఆయన కనిపించిన తీరు, ప్రశ్నించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్, ఫైట్ సీన్స్ ఇలా పలు సీన్స్‌లో ఆయన తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఫస్ట్‌హాఫ్‌లో ఆయన నటన చిత్రానికి హైలైట్. ఆరంభ సన్నివేశాల్లో గెటప్ కూడా బాగుంది. హీరోయిన్ సిరి లెల్లా సినిమా అంతా కనిపించినప్పటికీ, సెకెండాఫ్‌లోనే ఆమె హీరోయిన్ అని తెలుస్తుంది. ఇక సచిన్ ఖేడ్కర్, దినేశ్ తేజ్, జిషుసేన్ గుప్తా, అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, ఉదయ భాను లాంటి స్టార్స్ పాత్రలు ఆకట్టుకుంటాయి. దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఓ కింగ్ మేకర్‌ని గుర్తు చేసే పాత్రలో అజయ్ ఘోష్ కనిపిస్తారు.
సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం, మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి బలం. సెకెండాఫ్‌లో ఎడిటింగ్ పరంగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. స్వతహాగా జర్నలిస్ట్ అయిన మూర్తి దేవగుప్తపు ఆ నేపథ్యాన్ని కొత్తగా ఆవిష్కరించిందేమీ లేదు కానీ, మన ప్రేక్షకుల టేస్ట్‌కు తగ్గట్టుగా ఓ మంచి కమర్షియల్ సినిమాను అందించే ప్రయత్నం చేశారు. ఆయన రాసుకున్న మాటలు ప్రజలను ఆలోచింపజేస్తాయి.
'మనం పవర్‌లో ఉంటే, మనపై కేసులన్నీ కోర్టుల్లోనే ఉంటాయి', 'దేశాన్ని కాపాడటానికి సైనికుడు, కడుపు నింపడానికి రైతు ఎంత ముఖ్యమో, సమాజానికి జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం', 'నిజం వెలుగులోకి రాకపోతే సామాన్యుడు తల్లడిల్లిపోతాడు, ఓటు ఎంత ముఖ్యమో ఇలా పలు డైలాగ్స్ ప్రజలను ఆలోచింపజేస్తాయి. నిర్మాణం కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.
- బలాలు
- + నారా రోహిత్ నటన
- + కథలో మలుపులు
- + ఓటరుని చైతన్యవంతం చేసే సన్నివేశాలు
- బలహీనతలు
- - ద్వితీయార్ధంలో నాటకీయత
- చివరిగా : ప్రతినిధి 2 ప్రశ్నించే గొంతుక
- గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!