Ooru Peru Bhairavakona Movie Review : చిత్రం: ఊరు పేరు భైరవకోన; నటీనటులు: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, హర్ష, పి.రవిశంకర్ తదితరులు; సంగీతం: శేఖర్ చంద్ర; సినిమాటోగ్రఫీ: రాజ్ తోట; ఎడిటింగ్: చోటా కె ప్రసాద్; సంభాషణలు: నందు సవిరిగణ; కథ: భాను భోగవరపు; నిర్మాత: రాజేష్ దండ, బాలాజీ గుట్ట, అనిల్ సుంకర; స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : వి.ఐ.ఆనంద్;
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఊరి పేరు భైరవకోన' అనే సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ట్రైలర్, సాంగ్స్‌తో అభిమానులను ఆకట్టుకున్న ఈ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?
కథేంటంటే :
భైరవకోన ఓ మార్మిక ప్రపంచం. ఏడాదిలో వచ్చే కార్తీక మాసంలో రాత్రి సమయంలో మాత్రమే ఆ ఊరి తలుపులు తెరచుకుంటుంటాయి. అందులోకి వెళ్లినవారే తప్ప ప్రాణాలతో బయటకొచ్చిన వాళ్లు ఎవరూ ఉండరు. ఓ రోజు రాత్రి పెళ్లిలో దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బసవ అలియాస్ బసవ లింగం (సందీప్ కిషన్), తన ఫ్రెండ్ జాన్ (వైవా హర్ష), అగ్రహారం గీత (కావ్య థాపర్)తో పాటుగా ఆ ఊరిలోకి వెళ్తారు. మరి ఆ తర్వాత ఏమైంది ? భైరవకోనలో బసవకు ఎలాంటి పరిస్థితులెదురయ్యాయి ? అసలు ఆ కోన కథేంటి? దానికి గరుడపురాణంలో కనిపించకుండా పోయిన నాలుగు పేజీలకు ఉన్న సంబంధం ఏంటి ? స్టంట్‌మ్యాన్‌గా ఉన్న బసవ తనకు అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ) కోసం దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది? భైరవకోన నుంచి బసవ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడిందా? లేదా? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
ఎలా సాగిందంటే :
తను ప్రేమించిన అమ్మాయి లక్ష్యాన్ని నేరవేర్చడం కోసం హీరో చేసిన ఓ సాహసోపేతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు. భైరవకోన అనే ఓ ఊహా ప్రపంచంలో సెట్ చేసి, దానికి గరుడ పురాణంతో లింక్ చేసి స్టోరీని మరింత ఆసక్తిరేకెత్తించేలా చేశారు డైరెక్టర్ వి.ఐ.ఆనంద్. అయితే తెరపై చూస్తున్నప్పుడు ఆ ప్రపంచం అందులోని పాత్రలు ఏవీ ఆసక్తికరంగా నేచురల్‌గా కనిపించవు. అయితే ఈ కథలో పలు కోణాలు కనిపిస్తాయి. అలాగే చాలా మలుపులు కూడా ఉంటాయి. కానీ, అవేవీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా కనిపించవు. భైరవకోన గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్న సీన్స్‌తోనే ఈ సినిమా ఆసక్తికరంగానే ఆరంభమవుతుంది. బసవ ఓ పెళ్లి ఇంట్లో నగలు దొంగతనం చేసి ఒంటికి నిప్పంటించుకొని ఆ ఇంటి నుంచి బయటపడటం, ఈ క్రమంలో పోలీసులు అతన్ని వెంబడించడం ఇలా కథ కాస్త వేగంగానే ముందుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే ఆ వేగానికి బ్రేకులు వేసినట్లుగా అకస్మాత్తుగా బసవ గతం తెరపైకి వస్తుంది.
భూమి బ్యాగ్‌ను ఓ బ్యాచ్ కొట్టేయడం వాళ్లను వెంబడిస్తున్న క్రమంలో ఆమెకు బసవ తారసపడటం ఆమెతో కలిసి తను ఆ దొంగల వెనకపడటం అదే సమయంలో ఓ పాట ఇలా సినిమా నెమ్మదిగా సాగుతుంది. ఈ ఎపిసోడ్ తర్వాత కథ మళ్లీ వర్తమానంలోకి వచ్చాకే సినిమాలో కదలిక కనిపిస్తుంది. బసవ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తన కారుతో పాటుగా భైరవకోనలోకి ప్రవేేశించడం. ఈ క్రమంలో అక్కడ తనకు ఎదురయ్యే అనుభవాలను మొదట్లో కాస్త ఉత్సుకతను కలిగించేలాగే అనిపిస్తాయి. కానీ, కథలో ముందుకెళ్లే కొద్దీ ఏదో థ్రిల్‌ను రుచి చూడనున్నామని అనుకున్న ప్రతిసారీ ఆశాభంగమే కలుగుతుంది. ఇక విరామానికి ముందు రాజప్ప కోటలో బసవకు ఎదురయ్యే భయానక అనుభవం అదే సమయంలో భైరవకోన వెనకున్న ట్విస్ట్‌ను బయటపెట్టిన తీరు ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తాయి.
గరుడ పురాణంలో కనిపించకుండా పోయిన ఆ నాలుగు పేజీలకు భైరవకోనకు ఉన్న లింకేంటన్నది చూపిస్తూ సెకెండాఫ్ మొదలవుతుంది. కానీ, అది ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోదు. బసవ - భూమిల లవ్ స్టోరీలో పెద్దగా బలం కనిపించదు. ఇక దెయ్యాల దగ్గరున్న తన నగల్ని తిరిగి కొట్టేయడాని కోసం బసవ ఆడే డ్రామా మరీ ఆసక్తిరేకెత్తించకున్నా కాసేపు నవ్వులు పంచుతుంది. ఇక భూమి చావుకు వెనకున్న కారణం దాన్ని బయట పెట్టిన తీరు బాగున్నాయి. పతాక సన్నివేశాలు కాస్త పర్వాలేదనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే :
బసవ పాత్రలో సందీప్ బాగా ఒదిగిపోయారు. ఓ నటుడిగా తనలోని కొత్త కోణాన్ని చూపించేంత స్కోప్ దీంట్లో అయితే ఏమీ లేదు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌ను తనదైన అనుభవంతో తేలికగా చేసుకెళ్లిపోయాడు. భూమి పాత్రలో వర్షను చూపించిన తీరు.. ఆమె కనబరిచిన నటన ఆకట్టుకుంటాయి. కావ్య పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. రాజప్ప పాత్రలో రవిశంకర్ కనిపించిన తీరు ఆయన నటన ఆకట్టుకుంటాయి. కానీ, దీంట్లో ఆ పాత్ర బలవంతంగా ఇరికించినట్లే అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష పాత్రలు కనిపించిన ప్రతిసారీ నవ్వులు పంచే ప్రయత్నాలు చేశాయి.
పెద్దమ్మగా వడివుక్కరసు అనే పాత్రను ఓ రేంజ్లో పరిచయం చేశారు. కానీ అదే టెంపోను ఆద్యంతం కొనసాగించలేకపోయారు. డైరెక్టర్ ఆనంద్ ఎంచుకున్న కథలో సరైన బలం లేదు. భైరవకోన ప్రపంచం, అలాగే దాంట్లోని పాత్రలు దాని చుట్టూ అల్లుకున్న కథ చాలా ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తుంది. ఇక హీరో హీరోయిన్ల లవ్ స్టోరీలోనూ పెద్దగా ఫీల్ కనిపించలేదు. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.
- బలాలు
- + సందీప్ నటన
- + కథలోని కొన్ని ట్విస్ట్‌లు
- + విరామ సన్నివేశాలు
- బలహీనతలు
- - బలహీనమైన కథ
- - బలమైన సంఘర్షణ లేకపోవడం
- చివరిగా: 'భైరవకోన' అక్కడక్కడా థ్రిల్ పంచే ప్రయాణం.
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!