Mr Bachchan Review: సినిమా: మిస్టర్ బచ్చన్; నటీనటులు: రవితేజ, భాగ్య శ్రీ బోర్సే, జగపతిబాబు; దర్శకత్వం: హరీశ్ శంకర్; సంగీతం: మిక్కే జే మేయర్; ఎడిటింగ్: ఉజ్వల్ కుల్‌కర్ణి; సినిమాటోగ్రఫీ: అయాంకా బోస్; నిర్మాత: టీజీ విశ్వప్రసాద్; విడుదల తేదీ: 15-08-2024.
స్వాతంత్య్ర దినోత్సవం బాక్సాఫీస్ బరిలో నిలిచిన చిత్రాల్లో 'మిస్టర్ బచ్చన్' ఒకటి. ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ రావడం, టీజర్, ట్రైలర్లో రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ పుష్కలంగా కనిపించడం వల్ల ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ 'మిస్టర్ బచ్చన్' హంగామా తెరపై ఎలా సాగింది?
కథేంటంటే: దమ్ము, ధైర్యం, నిజాయితీ కలిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ బచ్చన్ (రవితేజ). నమ్మిన విలువల కోసం అవసరమైతే దేశ ప్రధాని మాటకైనా ఎదురు చెప్పేందుకు వెనకాడడు. అతడు ఓసారి అవినీతి పరుడైన ఓ పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి పెద్ద మొత్తంలో నల్లధనాన్ని పట్టుకుంటాడు. కానీ, పై అధికారులు బచ్చన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. దీంతో అతను సొంతూరు కోటిపల్లికి వెళ్లి ఆర్కెస్టా ట్రూప్ పెట్టుకుంటాడు. అక్కడే జిక్కీ (భాగ్యశ్రీ)ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. మొదట్లో అతని ప్రేమకు జిక్కీ అడ్డు చెప్పినా తర్వాత తన మంచితనం చూసి ఆమె కూడా మనసిచ్చేస్తుంది.
ఇంతలోనే బచ్చన్‌కు మళ్లీ ఉద్యోగంలో చేరమని ఆదాయపన్ను శాఖ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఓవైపు పెళ్లి సెట్టయినా తన డ్యూటీలో భాగంగా ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది. మరి ఆ జగ్గయ్య ఎవరు? తన అరాచకాలతో మొత్తం వ్యవస్థనే భయపెట్టి తన గుప్పిట్లో పెట్టుకున్న అతడిని బచ్చన్ ఎలా ఎదుర్కొన్నాడు? అతడి ఇంటిపై తనెలా రైడ్ చేశాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? బచ్చన్, జిక్కీల పెళ్లి సుఖాంతమైందా లేదా? అన్నది తెరపై చూడాల్సిందే.
ఎలా సాగిందంటే: మిస్టర్ బచ్చన్ హిందీ సినిమా రైడ్ రీమేక్. డైరెక్టర్ హరీష్ అదే కథను తనదైన శైలి మార్పులు - చేర్పులు, రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఒరిజినల్ రైడ్‌లో లవ్ ట్రాక్ లేదు. ఇక్కడ స్టోరీలో హరీష్ లవ్ ట్రాక్ జోడించారు. అది కథకు ప్లస్ పాయింట్. ఓ మాస్ యాక్షన్ సీన్లో హీరో ఎంట్రీ ఉంటుంది. తొలి రైడ్‌లోనే హీరో తెలివి తేటల్ని పరిచయం చేశారు. బచ్చన్ సస్పెండ్ అయ్యి కోటిపల్లికి చేరడంతో కథ రొమాంటిక్ కోణంలోకి మలుపు తిరుగుతుంది. అక్కడే కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఇక ప్రథమార్ధంతో పోలిస్తే, సెకండ్ హాఫ్ కాస్త సన్నగిల్లింది. ఇది ఒక్క ఐటీ రైడ్ నేపథ్యంగానే అల్లుకున్న కథ. దీనపైనే సెకండ్ హాఫ్ నడిచింది. అందులో సీరియస్‌నెస్ కనిపించలేదు. ఆరంభంలో జగ్గయ్య పాత్రను కరుడుగట్టిన విలన్‌లా చూపించినప్పటికీ తన నుంచి బచ్చన్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవవు. దీంతో కథలో సంఘర్షణ తగ్గింది. మధ్యలో సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ సీక్వెన్స్ కథకు కాస్త ఊపు తీసుకొచ్చినా, ఒక సాధారణ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది.
ఎవరెలా చేశారంటే: సినిలో రవితేజ మార్క్ కనిపిస్తుంది. హుషారైన నటనతో ఆద్యంతం అలరించారు. రవితేజ ఫ్యాన్స్ ఆయనను తెరపై ఎలా చూడాలనుకుంటారో హరీష్ అలాగే చూపించారు. హీరోయిజం, స్టైలింగ్, డైలాగ్ డెలివరీ మరో లెవెల్ అంతే. ఇక హీరోయిన్ భాగ్య శ్రీ జిక్కీ పాత్రలో తెరపై అందంగా కనిపించింది. పాటల్లో గ్లామర్‌గా కనిపించడంతో పాటు డ్యాన్స్‌లు కూడా అదరగొట్టింది. రవితేజతో తెరపై కెమిస్ట్రీ కూడా కుదిరింది. ఇక తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
బలాలు
- రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎనర్జీ
- భాగ్య శ్రీ గ్లామర్, డ్యాన్స్‌లు
- పాటలు, యాక్షన్ సీక్వెన్స్
బలహీనతలు
- ఊహించగలిగే కథ
- సెకండ్ హాఫ్
చివరగా: మాస్ ప్రేక్షకులు మెచ్చే 'మిస్టర్ బచ్చన్'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'మిస్టర్ బచ్చన్' రిలీజ్ కూడా అదే రోజు- బాక్సాఫీస్ క్లాష్ - Mr Bachchan Release