Kalki 2898 AD Pre Release Event : దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడి సినిమా విడుదలకు సిద్ధమైంది. సైన్స్‌కు మైథాలజీని జోడించి చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. హాలీవుడ్‌ను తలదన్నేలా అద్భుతమైన విజువల్స్‌తో వస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. విడుదల తేదీ దగ్గర పడడంతో ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో మూవీటీమ్ అంతా పాల్గొని తమ సరదా సంభాషణలతో సందడి చేశారు.
అమితాబ్ అలా చేయొదన్నారు - అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించడం గురించి చెప్పాలని ప్రభాస్‍ను రానా అడగగా ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. అక్కడే ఉన్న అమితాబ్ మైక్ అందుకుని 'మేం ఒకరి పాదాలను మరొకరు తాకాము' అని సరదాగా టీజ్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్ మైక్ అందుకుని అసలు విషయం చెప్పారు.
తాను గతంలో అమితాబ్‍కు పాదాభివందనం చేసినట్లు గుర్తుచేసుకున్నారు. కానీ ఆ సమయంలో ఇంకోసారి అలా చేయోద్దని అమితాబ్ తనకు చెప్పినట్లు తెలిపారు. "నేను మొదటిసారి కలిసినప్పుడు అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కరించాను. అప్పుడు అలా చేయెద్దని అమితాబ్ అన్నారు. ఇంకోసారి అలా చేస్తే తాను కూడా అలానే చేస్తానని అన్నారు. నేను అలా ఆలోచన కూడా చేయలేను" అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. "సౌత్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న మొదటి హిందీ యాక్టర్ అమితాబ్ బచ్చన్. కమల్ హాసన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయనలా కనిపించేందుకు ఇష్టపడేవాడిని. వీరిద్దరితో కలిసి నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్‍కు కృతజ్ఞతలు." అని పేర్కొన్నారు.
దీపికను మరిచిన ప్రభాస్ - అయితే దీపికా పదుకొణె గురించి ఏమీ మాట్లాడకుండానే ప్రభాస్ మైక్ పక్కనపెట్టబోయారు. దీంతో పక్కనే ఉన్న లవ్లీ లేడీ గురించి చెప్పాలంటూ అన్నారు రానా. దీంతో సారీ అంటూ ప్రభాస్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. వెంటనే దీపిక కల్పించుకుని 'ప్రభాస్ రెండు మాటలు మాట్లాడడాన్ని మనం సెలెబ్రేట్ చేసుకోవాలి. ఇంట్రోవర్ట్‌గా ఉండే ప్రభాస్ ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప' అని సరదాగా అన్నారు. అప్పుడు దీపిక సూపర్ స్టార్, గొప్ప నటి అని ప్రభాస్ ప్రశంసించారు. తన బేబీ బంప్‍ను చూపిస్తూ ప్రభాస్ తినిపించిన తిండి వల్లే ఇలా అంటూ సరదాగా మళ్లీ జోక్ చేశారు దీపిక.