Independence Day Special Movies: స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జెండా పండుగకు భారతవాని సిద్ధమవుతోంది. బానిసత్వంలో మగ్గిన జాతికి స్వేచ్ఛా వాయువులను అందించేందుకు తమ ఊపిరిని త్యాగం చేసిన వీరుల స్మరణకు సన్నద్ధమవుతోంది. దేశం కోసం జరిపిన పోరాటంలో ఎందరో తమ ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారు. వారి జీవిత చరిత్రలను కొన్నింటిని వెండితెరపై ఆవిష్కరించగా అవి అందరి ప్రశంసలు అందుకున్నాయి. అలా చిత్ర రూపంలో తెరకెక్కిన కొన్ని వీరగాథలివే!
బోర్డర్ (1997)
సన్నీ దేవోల్ హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం 'బోర్డర్' స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున తప్పనిసరిగా చూడదగిన చిత్రం. 1971లో లోంగేవాలా యుద్ధంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అక్షయ్ ఖన్నా, సుధేష్ బెర్రీ, పునీత్ ఇస్సార్ వంటి స్టార్ తారాగణం నటించారు.
ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ (2019)
పాకిస్థానీ ఉగ్రవాదులు మన భారత్‌లోకి చొరబడి దాడులు జరిపి ఎంతో మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. దాంతో ప్రతీకార చర్యగా భారత్ దాయాదిపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కథ ఆధారంగా 'ఉరి-ది సర్జికల్ స్ట్రయిక్స్' సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. RSVP మూవీస్ పతాకంపై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ తో పాటూ యామీ గౌతమ్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించారు.
షేర్షా (2021)
కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది సైనికులు దేశం కోసం ప్రాణాలర్పించారు. అందులో పాక్ సేనలను మట్టుపెట్టే క్రమంలో అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తీసిన చిత్రం 'షేర్షా'. 2021లో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ డైరెక్ట్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో విక్రమ్ భాత్రాగా, అతడి ట్విన్ బ్రదర్ విశాల్గా ద్విపాత్రాభినయం చేశాడు సిద్ధార్థ్. విక్రమ్ ప్రేయసిగా కియారా అడ్వాణీ నటించింది. విక్రమ్ బాత్రా దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ఎలాంటి త్యాగం చేశాడనే విషయాన్ని షేర్షా చిత్రంలో చూపించారు.
సర్దార్ ఉద్దం (2021)
భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా వీక్షించాల్సిన మరో ముఖ్యమైన చిత్రం 'సర్దార్ ఉదం'. షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ చారిత్రక సినిమాను కినో వర్క్స్ సహకారంతో రైజింగ్ సన్ ఫిల్మ్స్ నిర్మించింది. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఉద్దమ్‌సింగ్ అనే దేశభక్తుడు లండన్ వెళ్లి మరీ డయ్యర్‌ను హతమార్చి ప్రతీకారం తీర్చుకున్న అంశంనుంచి ప్రేరణ పొందింది. ఈ చిత్రంలో విక్కీ విశాల్ నటన అతని కెరీర్‌లో మైలురాయిగా నిలచిపోతుంది
సామ్ బహదూర్ (2023)
భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా జీవిత కథ ఆధారంగా 'సామ్ బహదూర్' రూపొందింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే భవాని అయ్యర్, శంతను శ్రీవాస్తవతో కలిసి గుల్జర్ స్వయంగా రాశారు. విక్కీ కౌశల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి ఈ సైనిక నాయకుడి కథకు జీవం పోశాడు. ఈ చిత్రం ద్వారా నవ భారత చరిత్ర గతిని మలుపుతిప్పిన ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు.