Happy Birthday Director Koratala Siva : టాలీవుడ్ డెరెక్టర్స్‌లో కొరటాల శివకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సామాజికాంశాలతో కూడిన కథలకు కమర్షియల్ హంగులద్ది చూపించడం ఆయన ప్రత్యేకత. తెరపై హీరో పాత్రను సాఫ్ట్‌గా చూపిస్తూనే అంతలోనే వయెలెన్స్‌తో పవర్ఫుల్‌గా చూపించి హీరోయిజానికే కొత్త నిర్వచనం ఇచ్చారు. అలానే పరాజయం ఎరుగని దర్శకుడిగానూ పేరొందారు. కానీ ఆచార్య సినిమా ఆ ఇమేజ్ను మార్చేసింది. దీంతో పట్టుదలతో మళ్లీ తానేంటో నిరూపించుకునేందుకు దేవరతో వస్తున్నారాయన. నేడు కొరటాల పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసుకుందాం.
సాఫ్ట్‌వేర్ వదిలేసి - ఏపీ గుంటూరు జిల్లా పెదకాకానిలో 1975 జూన్ 15న జన్మించారు కొరటాల. కమ్యూనిస్టు భావజాలాలు ఉన్న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఆయనది. చిన్నప్పటి నుంచి ఇంటినిండా పుస్తకాలు ఉండడంతో వాటిని చదువుతూనే పెరిగారట కొరటాల. కవితలు, కథలు కూడా రాస్తుండేవారట. అనంతరం బీటెక్ చదివి మొదట సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తన దగ్గరి బంధువైన పోసాని కృష్ణ మురళి ద్వారా అడుగు ముందుకేశారు.
తొలి చిత్రంతోనే నంది - మొదట పోసాని దగ్గర అసిస్టెంట్‌గా చేరిన కొరటాల ఆ తర్వాత డైలాగ్ రైటర్‌గా మారారు. ఒక్కడున్నాడు, మున్నా, భద్ర, బృందావనం, ఊసరవెల్లి చిత్రాలకు మాటలు రాశారు. ప్రభాస్ మిర్చితో దర్శకుడిగా మారారు. పగ తీర్చుకోవడం మగతనం కాదు, పగోడిని కూడా ప్రేమించడమే అసలైన మగతనం అంటూ తొలి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ హిట్ కొట్టి తన పేరు మార్మోగేలా చేశారు. మేకింగ్ స్టైల్, డైలాగ్ రైటింగ్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. నంది అవార్డును అందుకున్నారు.
మిర్చి తర్వాత మహేశ్ బాబుతో కలిసి 'శ్రీమంతుడు' చేసి మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. మహేశ్‌కు మరింత ఇమేజ్ను పెంచారు. దేశం బాగుండాలంటే పల్లెల్లో అభివృద్ధి జరిగాలని, ఊరు మనకెంతో ఇచ్చింది. కొంతైనా తిరిగిచ్చేయాలంటూ ఆలోచింపజేశారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ తీసి హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్‌గా నిలిచారు. తప్పుదారి నడిచేవాడు సొంతవాడైన శిక్ష పడాల్సిందేనంటూ చెప్పారు.
మళ్లీ మహేశ్‌తో జతకట్టి భరత్ అనే నేను అంటూ సక్సెస్ అందుకున్నారు. నాయకుడు సరిగ్గా పనిచేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారంటూ చాటి చెప్పారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో ఆచార్య తెరకెక్కించి తొలిసారి ఫ్లాప్ అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో కూడా పాపాలు చేస్తే గుణపాఠం చెప్పడానికి దేవుడే రానక్కర్లేదు అంటూ చూపించారు. ఇలా తన చిత్రాలతో ఏదో ఒక సామాజిక సందేశం ఇస్తూనే ఉన్నారు.
మళ్లీ తానేంటో నిరూపించుకునేందుకు - సినిమాల్లో ఏదోక మెసేజ్ ఇచ్చే కొరటాల వ్యక్తిగతంగానూ ఎంతో మంచివారని, సాయం చేయడంతో ముందుంటారని చాలా మంది అంటుంటారు. ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్‌తో 'దేవర' అనే భారీ సినిమా చేస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ సమయంలో తనను విమర్శించిన వారికి ఈ చిత్రంతో గట్టి సమాధానం చెప్పాలని పట్టుదలతో ఉన్నారు.
'మహారాజ'గా విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే? - Maharaja Movie Review