Eagle Movie Review: సంక్రాంతి కానుకగా వస్తుందనుకున్న 'ఈగల్' పలు కారణాలతో కాస్త ఆలస్యంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీలేని సమయంలో మంచి టైమ్ చూసుకొని ఆడియెన్స్ ముందుకొచ్చారు మాస్మహారాజా రవితేజ. మాస్ హీరోల్లో ఒకరైన ఆయన 'ధమాకా', 'వాల్తేర్ వీరయ్య' చిత్రాలతో అలరించారు. ఆ తర్వాత వచ్చిన 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. దీంతో 'ఈగల్'పై మాస్ మహారాజ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కాగా, ఫిబ్రవరి 9న రిలీజైన చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా? రవితేజ ఖాతాలో ఇంకో హిట్ పడిందా? అసలు సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: ఈగల్, నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, కావ్యథాపర్, మధు, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్ తదితరులు, సంగీతం : డేవ్ జాండ్, సినిమాటోగ్రఫీ : కమ్లీ ప్లాకీ, కరమ్ చావ్లా, ఎడిటింగ్ : కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత : టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, స్క్రీన్‌ప్లే : మణిబాబు కరణం, రచన, దర్శకత్వం : కార్తిక్ ఘట్టమనేని, బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
కథేంటంటే?: జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఓ కథనంతో మొదలవుతుందీ 'ఈగల్' కథ. చిన్న కథనమే అయినా అది ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈగల్కి సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు, నక్సలైట్లు, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకి చెందిన వ్యక్తులకీ టార్గెట్‌గా ఉంటుంది ఈగల్. సహదేవ్ వర్మ (రవితేజ) ఒక్కడే ఈగల్ని ఓ నెట్వర్క్లా నడుపుతుంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లోని ఓ పత్తి మిల్లుతోపాటు, పోలెండ్లోనూ ఆ నెట్వర్క్ మూలాలు బహిర్గతం అవుతాయి. ఇంతకీ ఈగల్‌కీ, తలకోన అడవులకీ సంబంధం ఏమిటి? సహదేవ్ వర్మ ఎవరు? అతని గతమేమిటి, ఈగల్ నెట్వర్క్ లక్ష్యమేమిటి? ఈ విషయాలన్నీ జర్నలిస్ట్ నళిని పరిశోధనలో ఎలా బయటికొచ్చాయనేది మూవీ.
ఎలా ఉందంటే? : స్టైలిష్ యాక్షన్ చిత్రాల హవా కొనసాగుతున్న ఈ దశలో పక్కాగా ఆ కొలతలతో రూపుదిద్దుకున్న మరో చిత్రమే ఈగల్. నిర్ణయం, నియంత, నివారణ అంటూ ఆయుధం ఎవరి చేతుల్లో ఉండాలో ఈ కథతో చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఈగల్, దాని నెట్వర్క్ పరిశోధనలతో కథ ప్రారంభమవుతుంది. ఆ పరిశోధనలో అసలు విషయాలు, అసలు పాత్రలు వెలుగులోకి వచ్చే వరకూ కథ అంతగా రక్తి కట్టదు. ఈగల్ ప్రస్తావన రాగానే భయపడే వ్యక్తులు, అసలు కథని తెలుసుకునేందుకు కథానాయిక అనుపమ చేసే రకరకాల ప్రయత్నాలతోనే ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందే ముందే అసలు కథలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. విరామం తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాల తర్వాత సినిమా మరింత రసవత్తరంగా మారుతుంది.
దర్శకుడు ఈ సినిమాని కథలు కథలుగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, కొన్నిచోట్ల కథనం గందరగోళంగా అనిపిస్తుంది. అత్యున్నతమైన నిర్మాణ హంగులు, నాణ్యమైన విజువల్స్‌తో సినిమా మరో స్థాయికి వెళ్లింది. సెకెండ్ హాఫ్‌లో పోలెండ్‌లో జరిగే కథ, పతాక సన్నివేశాల్లో సెంటిమెంట్, కొనసాగింపునకు కావల్సిన లీడ్‌ని ఇవ్వడం వంటి అంశాలన్నీ కూడా ఆకట్టుకుంటాయి. అమ్మవారి విగ్రహం నేపథ్యంలో యాక్షన్ ఘట్టం సినిమాకే హైలైట్. ఆయుధాలు, పత్తి పంట నేపథ్యాల్ని ప్రేమకథతో కనెక్ట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్ ప్రియుల్ని అలరించే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ బలమైన పాత్రలో కనిపించారు. ఆయన తెరపై రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. రెండు గెటప్పులూ ఆయనకి బాగా సూట్ అయ్యాయి.
ఎవరెలా చేశారంటే? : రవితేజ యాక్షన్ అవతారం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆయన సహదేవ్ వర్మ పాత్రలో ఒదిగిపోయారు. ద్వితీయార్ధంలో యంగ్ లుక్‌లోనూ ఆకట్టుకున్నారు. ఆయన నటన ఇందులో సహజంగా ఉంది. అనుపమ, కావ్య థాపర్ పాత్రలకీ ప్రాధాన్యం ఉంది. అనుపమ సినిమా మొత్తం కనిపిస్తే, కావ్య థాపర్ ద్వితీయార్ధంలో చిన్న పాత్రలోనే అయినా ఆకట్టుకున్నారు. నవదీప్ కీలకమైన పాత్రలో కనిపిస్తారు. వినయ్‌రాయ్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల తదితరుల పాత్రలూ ఆకట్టుకుంటాయి. అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, మిర్చి కిరణ్ నవ్వులు పూయించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యున్నత నిర్మాణ విలువలతో ఖర్చు విషయంలో వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించింది. మణిబాబు కరణం మాటలు బాగున్నాయి. సంగీతం చిత్రానికి ప్రధాన బలం. డేవ్ జాండ్ నేపథ్య సంగీతం ప్రభావం చూపిస్తుంది. రవితేజ, కావ్య థాపర్లపై ప్రేమ పాట, చిత్రీకరణ బాగుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాల్నీ చూసుకున్న దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాని స్టైలిష్‌గా తీయడంలో విజయవంతమయ్యారు. రచనలోనూ బలం ఉంది.
- ఈగల్ బలాలు
రవితేజ నటన, స్టైలిష్ మేకింగ్, ద్వితీయార్ధం(సెకెండ్ హాఫ్) - బలహీనతలు
స్టార్టింగ్ సీన్స్ - గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
OTTలోకి 'గుంటూరు కారం'- రమణగాడి సందడే సందడి
టాలీవుడ్ టూ కోలీవుడ్- తమిళ్లోనూ మృణాల్ మార్క్- మురుగదాస్ సినిమాలో ఛాన్స్!