Diwali Release Movies Lucky Bhaskar Movie Review : దీపావళి సందర్భంగా పలు చిత్రాలు బాక్సాఫీస్ ముందు సందడి చేశాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఒకటి. వెంకీ అట్లూరి తెరకెక్కించారు. మహానటి తర్వాత పూర్తి స్థాయిలో దుల్కర్ చేసిన రెండో తెలుగు చిత్రమిది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందంటే?
కథేంటంటే (Lucky Bhaskar Story) - ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి. చాలీచాలని జీతం, దానికి తోడు కుటుంబ భారమంతా తనపైనే ఉండడంతో బ్యాంకు సహా దొరికిన చోటంతా అప్పులు చేస్తాడు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు.
అయితే ఉత్తమ ఉద్యోగి అనే పేరొస్తుంది తప్ప ప్రమోషన్ మాత్రం రాదు. దీంతో ఎంత రిస్క్ చేసినా తప్పు లేదని భావించినా భాస్కర్ భారీ రిస్క్ చేస్తాడు. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి? దీంతో అతడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడా? లేదా కష్టాల్ని దూరం చేసుకున్నాడా? అనేదే కథ.
ఎలా ఉందంటే? - బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, భారతీయ మధ్య తరగతి మనస్తత్వాలు.. మేళవిస్తూ ఓ వ్యక్తి జీవిత ప్రయాణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 90ల్లో భారతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన హర్షద్ మెహతా కుంభకోణం కూడా ఈ కథలో కీలకం. సినిమాలో హీరో చేసే పనులన్నీ ప్రేక్షకులకు కిక్కునిస్తుంటాయి. రిస్క్ చేసి ఆంటోనీ (రాంకీ)కి అనే వ్యక్తికి సాయం చేయడం, ఆ తర్వాత అతనితోనే మరో డీల్ కుదుర్చుకోవడం, ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురవ్వడం, వాటిని తెలివిగా అధిగమించే తీరు ఇలా ప్రతి మలుపూ బాగుంది. ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను ఇచ్చింది. ఇంటర్వెల్ ముందు సీన్స్ మరింతగా ఆకట్టుకున్నాయి.
సెకండాఫ్‌లో చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని లోలైన అంశాల్ని చూపించాడు దర్శకుడు. అవి సామాన్య ప్రేక్షకుడికి అంత సులభంగా అర్థం కావనే చెప్పాలి. అయినా కూడా బానే ఉంటుంది. భాస్కర్‌లో డబ్బు తీసుకొచ్చిన మార్పు, ఆ నేపథ్యంలో సాగే కుటుంబ డ్రామా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయి. సాదాసీదాగా ముగిస్తారనుకుంటే ఊహించని మలుపు చోటు చేసుకోవడం మెప్పిస్తుంది. భాస్కర్ తెలివితేటలు, అతడి చాకచక్యం సినిమాకే హైలైట్.
ఎవరెలా చేశారంటే? - దుల్కర్ సల్మాన్ తన భుజాలపై కథను మోశాడు. మధ్య తరగతి ఫ్యామిలీ మేన్‌గా ఒదిగిపోయాడు. మీనాక్షి చౌదరికీ అందంగా కనిపిస్తూనే భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలపై మంచి ప్రభావం చూపించింది. రాంకీ, సచిన్ ఖేడేకర్, టినూ ఆనంద్, సాయికుమార్ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాష్‌కుమార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానబలం. తన సంగీతంతో సన్నివేశాల్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. సాంగ్స్ సందర్భోచితంగా సాగుతూ, కథలో ఇమిడిపోయాయి. కెమెరా, ప్రొడక్షన్ డిజైన్, కూర్పు విభాగాలు కూడా మంచి పనితీరుని కనబరిచాయి. వెంకీ అట్లూరి రచన బాగుంది.
'ఒక రోజులో అరగంట నాకు నచ్చినట్టుగా సాగలేదని, జీవితమంతా ఏడుస్తూ కూర్చోవాలా' అన్న సంభాషణతో మొదలై క్లైమాక్స్‌లో గెలుపు తర్వాత ఓటమి, ఓటమి తర్వాత గెలుపు గురించి వచ్చే సంభాషణల వరకు అన్నీ ఆలోచింపజేస్తాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
చివరిగా : భాస్కర్, గేమ్ అదరగొట్టాడు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'జై హనుమాన్' దీపావళి సర్ప్రైజ్- ఆంజనేయుడి పాత్రలో రిషభ్ శెట్టి కన్ఫార్మ్
'నన్ను క్షమించండి - NBK 109 టైటిల్ అప్డేట్ అందుకే ఇవ్వలేకపోయాం' : నాగవంశీ