Chiranjeevi PadmaVibhushan : పద్మ విభూషణ్ పురస్కారానికి ఈ ఏడాది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆనందం వ్యక్తం చేశారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ - "ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు ధన్యవాదాలు. భారతీయ సినీ పరిశ్రమ, సమాజానికి మీరందించిన సేవలు నాతోపాటు ఎంతోమంది ఫ్యాన్స్‌ను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ గొప్ప దేశంలో మీరొక అద్భుతమైన పౌరుడు. ఆయన సేవలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. "దేశంలోనే రెండో అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఎంపికైనందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. కుటుంబం, అభిమానులతో పాటు యావత్ తెలుగు వారికి ఇది ఎంతో గర్వకారణం. ఈ విజయంపై సంతోషంగా ఉన్నాను. మేము గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు" అని బన్నీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
వారి వల్లే ఈ స్థాయికి : నేడు గణతంత్ర దినోత్సవంలో భాగంగా చిరు బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఫ్యాన్స్ వల్లే తాను ఈ స్థాయికి రాగలిగానని చెప్పారు. "45 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో కళామతల్లికి నావంతు సేవలు అందించాను. కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉందని గ్రహించి, సాయం కోరిన వాళ్లకు ఎన్నో ఏళ్లుగా అండగా నిలబడ్డాను. ఇందులో భాగంగానే చిరు బ్లడ్ బ్యాంక్ స్థాపించాను. దీని ఆధ్వర్యంలో ఎంతోమందికి సేవ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఫ్యాన్స్ వల్లే ఇది ఇంత గొప్పగా ముందుకు వెళ్తోంది. ప్రతిఒక్కరికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకం. నా సేవలను గుర్తించి 2006లో పద్మభూషణ్ అవార్డును ఇచ్చారు. అదే నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మవిభూషణ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు" అని చిరు చెప్పుకొచ్చారు.
చిరు సినిమాల్లోని ఈ ఫేమస్ డైలాగ్స్ మీకు తెలుసా ?
సినిమాలకు గ్యాప్ - 'ఖైదీ 150'తో టాప్ - అప్పటికీ ఇప్పటికీ 'మెగా'స్టారే