Ayushmann Khurrana Latest Interview : ఇప్పటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగంపై పిల్లలకు అవగాహన కల్పించాలంటూ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఇంటర్నెట్ వినియోగంపైన మాట్లాడారు.
"ఇంటర్నెట్ ఒక శక్తివంతమైన సాధనం. ఎడ్యుకేషన్, జాబ్స్, ఎంటర్టైన్మెంట్, స్కిల్స్ ఇలా పలు ఫీల్డ్స్‌కు సంబంధించిన విషయాలను దానిద్వారా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా ఉంది. ఎక్కువమంది స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యం, ఆత్మగౌరవంపైనా ఇది ఎఫెక్ట్ చూపుతోంది. ట్రోలింగ్, బెదిరింపులపై వారికి మనం అవగాహన కల్పించాలి. ఏదైనా సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, టీచర్లను సంప్రదించాలని వారికి అర్థమయ్యేలా మనం తెలియజేయాలి. పిల్లలు స్కూల్ డేస్ నుంచే ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. వారిపై బాధ్యతగా వ్యవహరిస్తూ ఆన్‌లైన్ ట్రోలింగ్ నుంచి సురక్షితంగా ఎలా బయటపడాలో వివరించాలి. వారిలో ఆ భయాన్ని పోగొట్టేందుకు తగినంత సహాయాన్ని అందించాలి" అని ఆయుష్మాన్ ఖురానా తెలిపారు.
'విక్కీ డోనార్' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయుష్మాన్ ఆ తర్వాత పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. 'అంధాధున్' సినిమాలోని తన నటనకుగాను ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. గతేడాది 'డ్రీమ్‌గర్ల్-2' సినిమాతో ఆయన అలరించారు. మరోవైపు ఆయన దిగ్గజ క్రికెటర్ గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలోనూ నటించనున్నారని సమాచారం.