AP Elections 2024 Chiranjeevi Pawankalyan : పడి లేచిన కెరటం మాదిరిగా దూసుకెళ్లారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాల్లోనే కాదు రాజకీయ జీవితంలోనూ అదే పంథాను కొనసాగించారు. గెలుపోటముల్లో ఆయన వెన్నంటి నడిచిన అభిమానుల ఆశలకు విజయంతో బదులిచ్చారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా, తన పార్టీలో దాదాపు అందరూ మంచి విజయాన్ని అందుకునేలా చేశారు. ఈ విజయానికి సంతోషిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తంచేశారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. "డియర్ కల్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా, అది ప్రజలను గెలిపించడానికే అని నిరూపించావ్. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల సంక్షేమం కోసం, నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా" అని పోస్టు పెట్టారు.
కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు: అల్లు అర్జున్
"ప్రజలకు సేవ చేయడంలో మీరు పడే శ్రమ, మీ అంకితభావం, నిబద్ధత ఎప్పుడూ హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు. అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు" అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
ఇప్పుడే మొదలైంది: హరీష్ శంకర్
పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన హరీష్ శంకర్ ట్వీట్ చేస్తూ.. "అప్పుడే అయిపోయిందనుకోకు. ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే మొదలైంది" అంటూ గబ్బర్ సింగ్ డైలాగ్ విజువల్స్ పోస్ట్ చేశారు.
ఎప్పటికీ పవర్ స్టారే: నితిన్
పవన్ మరో అభిమాని అయిన నితిన్ పోస్టు చేస్తూ.. "ప్రియమైన పవన్ కల్యాణ్ గారు.. మీరు చరిత్రాత్మక విజయం సాధించడం, కూటమిని అగ్రగామిగా నిలపడంపై ఓ అభిమానిగానూ, ఓ సోదరుడిగానూ ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ విజయానికి మీరు అర్హులు. మీరెప్పటికీ మాకు పవర్ స్టారే" అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఇప్పుడు సేఫ్: సాయి ధరమ్ తేజ్
గతంలో పవన్ కల్యాణ్ "జగన్ గుర్తుపెట్టుకో నిన్ను అధహ్ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు. నా పార్టీ జనసేన కాదు" అని చెప్పిన వీడియోను పోస్ట్ చేస్తూ "చెప్పాడు చేశాడు. మనల్ని ఎవడ్రా ఆపేది అని క్యాప్షన్ పెడుతూ, దానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఇప్పుడు సేఫ్ గా ఉంది" అని కామెంట్ చేశారు.
పవన్ కల్యాణ్ విజయంపై స్పందించిన రేణూ దేశాయ్ - Pawankalyan Renudesai
బాక్సాఫీస్ ముందు పోలీస్ భామల పోరు - Kajal Agarwal VS Payal Rajput