35 Chinna Katha Kadu Review : స్టార్ నటి నివేదా థామస్ లీడ్ రోల్లో దగ్గుబాటి రానా సమర్పణలో వచ్చిన లేటెస్ట్ మూవీ '35 చిన్న కథ కాదు'. ట్రైలర్, టీజర్‌తో ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మదిలో అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 5)న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే :
ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. ఆయన భార్య సరస్వతి (నివేదా థామస్). తన భర్త, పిల్లలు అరుణ్, వరుణ్ ఈ ముగ్గురే ఆమెకు ప్రపంచం. తిరుపతిలో వీళ్ల నివాసం. చిన్నోడు పర్వాలేదు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం లెక్కల పాఠాలు ఒక పట్టాన అర్థం కావు. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దాని పక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందని ఎప్పుడూ అడుగుతుంటాడు.
తను అడిగే కొన్ని ప్రశ్నలకు టీచర్ల దగ్గర కూడా సమాధానాలు దొరకవు. అప్పుడు లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి) ఫండమెంటల్స్‌ను ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి లాస్ట్ బెంచ్‌కి పంపిస్తాడు. 6వ తరగతిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో అరుణ్ తన తమ్ముడు వరుణ్ క్లాస్‌లో కూర్చోవాల్సి వస్తుంది. అయితే ఈసారి మాత్రం అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే కచ్చితందా అతడు లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందే అని అంటారు. దీంతో ఆ పరిస్థితుల్లో జీరో అని పేరు తెచ్చుకున్న అరుణ్ క్లాస్‌కు హీరో ఎలా అయ్యాడు? తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలంటూ టెన్త్ ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేసింది? అరుణ్ అసలు 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా? అనేది మిగిలిన స్టోరీ.
ఎలా ఉందంటే :
ఇది లెక్కల కథ, పిల్లల కథ మాత్రమే కాదు.. అమ్మానాన్నల కథ కూడా. చదువుకోవడం అంటే నేర్చుకోవడం అని, ప్రశ్నించడం ఆగిపోతే నేర్చుకోవడమే ఆగిపోతుందని చెబుతుంది. సహజంగానే పిల్లల మదిలో ప్రశ్నలే మెదులుతుంటాయి. వాటికి కొన్నిసార్లు సమాధానాలు కూడా అంతుచిక్కవు. కానీ తర్కంతో, పిల్లలకు అర్థమయ్యేలా నివృత్తి చేసినప్పుడే వాళ్లు నేర్చుకుంటారు. అందుకు తగ్గట్టుగానే మన విద్యా విధానం సాగాలని చెప్పకనే చెప్పే విలువైన చిత్రమిది. అలాగని ఇది విద్యా బోధన చుట్టూనే సాగదు. భావోద్వేగాలతో కూడిన అమ్మానాన్నల కథ కూడా ఇందులో ఉంది. భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో ప్రథమార్ధంలో ప్రసాద్, సరస్వతి మధ్య సాగే సన్నివేశాలతో ఎంతో అందంగా చూపించారు. భర్త మనసుని గెలిస్తే చాలనుకుని టెన్త్ ఫెయిల్‌తోనే ఆగిపోయిన ఓ గృహిణి... ఏ పరిస్థితుల్లో మళ్లీ పుస్తకాలు పట్టాల్సి వచ్చిందనేది ఇందులో కీలకం. తిరుపతి నేపథ్యం, భక్తి కోణం ఈ కథలోనే ఇమిడి వుంది. అది ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని పంచుతుంది.
ప్రారంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతూ కథా ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. చాణక్య మాస్టార్‌ని అరుణ్ ప్రశ్నించడం మొదలయ్యాక కథలో కాస్త వేగం పెరుగుతుంది. లెక్కలు టీచర్లు, పిల్లలకు మధ్య వాతావరణం, పిల్లల మనస్తత్వాలు, క్లాస్ రూమ్‌లో స్నేహాలు, వాళ్లు ఒకరికొకరు దూరమైనప్పుడు పసి మనసులపై పడే ప్రభావం లాంటి సన్నివేశాల్ని హృదయాల్ని హత్తుకునేలా మలిచారు డైరెక్టర్.
ప్రశ్నలతో కథని మొదలుపెట్టిన డైరెక్టర్, సెకెండాఫ్‌లో అమ్మ పాత్ర నుంచి వాటికి సమాధానాల్ని చెప్పించిన విధానం సినిమాకి హైలైట్‌గా నిలిచింది. పిల్లలకు పాఠాలు ఎలా చెబితే బోధపడతాయో ఆ సన్నివేశాలు చాటి చెబుతాయి. పతాక సన్నివేశాల్లో తండ్రి మార్కులు చదివినప్పుడు అరుణ్ అద్దంపై నీళ్లు చల్లే సీన్స్ ఎన్నో ఎమోషన్స్ పంచుతాయి.
అయితే సినిమాలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని సీన్స్ కాస్త నెమ్మదిగా సాగుతాయి. కథనంలో మెరుపులు కూడా లేవు. హాస్యం, భావోద్వేగాలు ఉన్నప్పటికీ వాటి మోతాదు కూడా అంతగా సరిపోలేదు. సాంకేతికంగానూ కొన్ని లోపాలు కనిపిస్తాయి. కొన్ని పాత్రలు పలికే సంభాషణలు కూడా స్పష్టంగా వినిపించవు. కొత్త యాసని ఎంచుకున్నప్పుడు అవి ప్రేక్షకులకు స్పష్టంగా వినిపించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఎవరెలా చేశారంటే :
నటనపరంగా ఈ సినిమాలోని అందరూ చాలా బాగా చేశారు. తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల తల్లిగా, భార్యగా, గురువుగా హీరోయిన్ నివేదా అభినయం అందరినీ ఆకట్టుకుంది. చాలా చోట్ల ఆమె కళ్లతోనే తన భావాల్ని పలికించింది. చాణక్య టీచర్‌తో తన పిల్లలకు ఆ పేర్లు ఎందుకు పెట్టిందో చెప్పే సీన్స్, భర్తతో గొడవైనప్పుడు ఆమె నటించిన తీరు చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.
ఇక పిల్లలతో నేను బాగుండకపోయినా, పిల్లలు బాగుండాలని కోరుకునే చాణక్య మాస్టార్ పాత్రని మలిచిన విధానం, అందులో నటుడు ప్రియదర్శి ఒదిగిపోయిన తీరు చాలా బాగుంది. ఓ భర్తగా, అలాగే తండ్రిగా విశ్వదేవ్ కూడా చాలా బాగా నటించారు. భాగ్యా రాజా, కృష్ణ తేజ తదితరులు కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషించారు. ఇక చిన్నారులంతా కూడా వాళ్ల పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.
సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. డైరెక్టర్ పనితనం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఓ కొత్త కోణాన్ని స్పృశించిన తీరు, కథని నడిపించిన విధానం చక్కగా అనిపిస్తుంది. మాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఎన్నున్నా సరే, ఓడిపోతామనే భయం ఉంటే ఏమీ లేకుండా చేస్తుంది, గెలుపు అనే ప్లస్ వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఓ మజిలీ జీరో, ఎదగాలనుకున్నప్పుడు తుంచాలి కొమ్మనైనా, కొడుకునైనా లాంటి డైలాగ్స్ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. ఓ మంచి సినిమాగా దర్శక నిర్మాతలకి, నటులకు, సాంకేతిక బృందానికీ గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రం ఇది.
బలాలు
+కథ, నేపథ్యం
+నటీనటులు, సంభాషణలు
+భావోద్వేగాలు
బలహీనతలు
-నెమ్మదిగా సాగే సన్నివేశాలు
చివరిగా : చిన్న కథ కాదు ఓ మంచి కథ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!