Special Skills To Have For A Job : కాలం మారుతోంది. కాలంతో పాటు ఉద్యోగాలకు సరైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రమాణాలు కూడా మారుతున్నాయి. విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలతో పాటు అభ్యర్థుల్లోని కొన్ని స్వాభావిక లక్షణాలను కూడా కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కీలకమైన ఆ స్కిల్స్ గురించి తెలుసుకుంటేనే ఉద్యోగ పోటీలో అభ్యర్థులు ఇతరుల కంటే ముందంజలో నిలువగలుగుతారు. అవేంటంటే?
తామరాకుపై నీటిబొట్టులా!
ఇది పోటీ ప్రపంచం. ప్రత్యేకించి ఉద్యోగాలకు ఇటీవల కాలంలో పోటీ బాగా పెరిగింది. పదుల సంఖ్యలో పోస్టులు ఉంటే అప్లై చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ఇంతమంది అభ్యర్థుల నుంచి తమ సంస్థాగత అవసరాలను తీర్చగలిగే వారినే కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలతో పాటు మనం చేయబోయే ఉద్యోగంలో నిర్వర్తించాల్సిన విధులపై కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలి. ఇది మనల్ని ఎంతోమంది నడుమ డిఫరెంట్‌గా, పర్ఫెక్టుగా హైలైట్ చేయడానికి దోహదం చేస్తుంది. ఇలాంటి అభ్యర్థులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి. ఉద్యోగ విధులపై కనీస అవగాహన కలిగి ఉన్నవారు, తామరాకుపై నీటిబొట్టులా వారికి కేటాయించిన బాధ్యతల్లో త్వరగా ఇమిడిపోగలరని కంపెనీలు భావిస్తున్నాయి.
నిత్య విద్యార్థికి జై!
నిత్య విద్యార్థిలా ఉండే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడానికి కంపెనీలు ప్రయారిటీ ఇస్తుంటాయి. ఎందుకంటే అలాంటి వారిలో కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొత్తవి నేర్చుకుంటూ అప్‌డేట్ అయ్యే అలవాటు ఉన్న వారు ఏ రంగంలోనైనా అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకోగలరు.
స్కిల్స్ ప్లస్ అది కూడా!
స్కిల్స్ ఉండటం ఒక ఎత్తు. వారిని చాకచక్యంగా, సమయోచితంగా వినియోగించడం మరో ఎత్తు. జాబ్ ఇంటర్వ్యూస్‌కు వెళ్లే వారు టెక్నికల్ స్కిల్స్ గురించి చెప్పే సమయంలో వాటిని సమయోచితంగా వినియోగించే విషయంలో తమకున్న నేర్పును వివరించాలి. ఆయా టెక్నికల్ స్కిల్స్‌లో జరిగిన కొత్త పరిణామాలను విశ్లేషించాలి. దీనివల్ల మీలోని ఉత్సుకత బయటికి కనిపిస్తుంది. ఇది మీపై ఇంటర్వ్యూయర్‌కు మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది.
కెరీర్‌లో ఎదగాలనే సంకల్పం
ఏ రంగంలోనైనా కెరీర్‌లో రాణించాలంటే ఉన్నతస్థాయికి ఎదగాలనే బలమైన కోరిక ఉండాలి. అయితే ఈ కోరికకు జీవం పోసేందుకు శ్రమించాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. మనం ఎంతగా శ్రమిస్తామో ఎంతగా అప్‌డేట్ అవుతామో కెరీర్‌లో అంతటి గ్రోత్ లభిస్తుంది. కెరీర్ లక్ష్యాన్ని ఒకేసారి చేరుకోవడం ఎవరికైనా అసాధ్యమే. అందుకే మన లక్ష్యాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని దాన్ని సాధిస్తూ ముందుకు సాగాలి. ఈ క్రమంలో మనకు పట్టుదల, ఓపిక, పోటీతత్వం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే గుణం ఉండాలి.
ఇది లేకుంటే అసలుకే ఎసరు!
మనకు ఎన్ని స్కిల్స్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా టీం వర్క్ చేసే తత్వం లేకుంటే అసలుకే ఎసరు వస్తుంది. కొత్తగా ఉద్యోగం వచ్చే అవకాశాలు భారీగా తగ్గిపోతాయి. ఇలాంటి వారిని ఉద్యోగంలో నియమించుకునేందుకు కంపెనీలు అస్సలు మొగ్గుచూపవు. టీం సభ్యుడిగా లేదా టీం లీడర్‌గా పనిచేసేందుకు సంసిద్ధతను కలిగి ఉండాలి. టీమ్ లీడర్‌గా ఉండాలనుకుంటే అందరినీ కలుపుకొని ముందుకు నడిచే స్వభావం అవసరం. ఈక్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొనే సహనం అత్యవసరం. టీం సభ్యుడిగా మనకు అందే ఆదేశాలను పాటించడంతో పాటు ఇంకొంత యాక్టివ్‌గా వర్క్‌లో భాగస్వామ్యం కావాలి. ఇలాంటి ప్రవర్తన భవిష్యత్‌లో మనకు మెరుగైన అవకాశాలను క్రియేట్ చేస్తుంది.
క్రిటికల్, క్రియేటివ్
క్రిటికల్‌గా, క్రియేటివ్‌గా ఆలోచించే వారికి ఉద్యోగ అవకాశాలు ఎప్పటికీ ఉంటాయి. ఇలాంటి వారికి ఉద్యోగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ఎదుటి వారి కోణంలోనూ పరిశీలించే నేర్పరితనం, సమయస్ఫూర్తి ఉన్నవాళ్లకు ఉద్యోగాలు ఈజీగా వస్తాయి. మొండిగా వ్యవహరించే తత్వం కలిగిన వారికి ఉద్యోగ వెతుకులాటలో ఎదురుదెబ్బలు తప్పవు. సమస్యకు పరిష్కారాన్ని సాధ్యమైనంత వేగంగా వెతకగలిగే చురుకైన మెదళ్లకు ఉద్యోగ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది.