Krishna Teja From Karimnagar Did PHD on Volcano : ఈ భూమిపై జరిగే ప్రతి చర్యకు ఓ కారణం ఉంటుందని నమ్మిన ఈ యువకుడు వాటి వెనుక ఆంతర్యం కనిపెట్టాలని కూతూహలంగా ఉండేవాడు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పించాలనుకున్నాడు. అగ్ని పర్వతాలు, వాటిలో జరిగే మార్పుల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. కానీ వాటిపై అవగాహన రావాలంటే లోతైన అధ్యయనం చేయాలి. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నానని చెప్తున్నాడు. రాబోయే తరాలకు తన వంతు బాధ్యతగా సమాచారం అందిస్తానంటున్నాడు.
కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన ఈ యువకుడి పేరు గౌతం కృష్ణ తేజ. తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి చదువులో ముందుడే ఈ యువకుడు తనను తాను కొత్తగా నిరూపించుకోవాలని తాపత్రయ పడేవాడు. కూమారుడి ఆసక్తి గమనించి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోర్సు తీసుకోవాలని తండ్రి సూచించాడు. ఆ దిశగా తన ప్రయాణం మొదలుపెట్టిన గౌతం పుదుచ్చేరిలో ఎమ్మెస్సీ డిజాస్టర్ మెనేజ్‌మెంట్ కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు.
ఆరేళ్ల శోధన : ప్రపంచవ్యాప్తంగా సుమారు 1400 క్రీయాశీల అగ్నిపర్వతాలు ఉండగా మన దేశంలో అలాంటి అగ్నిపర్వతం ఒకటే ఉందని చెప్తున్నాడు గౌతం. అదే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ద్వీపం. దేశంలో అగ్ని పర్వతాలు ఎక్కువ లేనందున వీటిపై అధ్యయనానికి ఎవరు అంత ఆసక్తి కనబరచడం లేదని గమనించాడు. పట్టుదలతో బారెన్ ద్వీపం అంశాలపై 6 ఏళ్లు పరిశోధనలు చేసి తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నాడు.
సముద్రగర్భ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, అగ్నిపర్వతాలపై పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్న గౌతం జియో డైనమిక్స్ ఆఫ్ బారెన్ ఐలాండ్ వాల్కనిజం, ఇన్‌సైడ్స్ ఫ్రమ్ జియో స్పెషల్ టెక్నాలజీ అనే అంశంలో పరిశోధన చేశాడు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మాటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించాడు గౌతం కృష్ణ.
అండమాన్ దీవుల్లో పరిశోధన : విపత్తుల నిర్వహణపై గౌతం కృష్ణ రాసిన 15వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజీన్స్‌లో ప్రచురితమయ్యాయి. అండమాన్ దీవుల్లో పరిశోధన పూర్తి చేసిన కృష్ణ మరింత పరిశోధన కోసం ఐరోపా, ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు అధ్యయనం చేసి వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి నివేదిక రూపొందించనున్నట్లు చెబుతున్నాడు. భవిష్యత్తులో అగ్నిప్రమాదాల వల్ల ముంచుకొచ్చే ప్రమాదాల బారి నుంచి ఈ అధ్యయనం ద్వారా బయటపడే అవకాశముందని చెబుతున్నాడు.
సాహసోపైతమైన నిర్ణయం తీసుకొని విజయాన్ని సాధించిన గౌతం కృష్ణను చూస్తుంటే గర్వంగా ఉందంటున్నారు కుటుంబ సభ్యులు. చిన్నప్పటి నుంచి ఏ రంగంలో రాణించాలని ఆసక్తి ఉన్నా అందులోనే తోడ్పాటు అందిచామని చెప్తున్నారు. యావత్ ప్రజానీకం ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెబుతున్నాడు గౌతం కృష్ణ. ప్రభుత్వ సహాయం లభిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.