Interview Tips For Beginners : ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. ఇది ఎంతో వాస్తవం. ఎలా అంటే, ఒక సర్వే ప్రకారం, రిక్రూటర్లు తాము చేసే ఇంటర్వ్యూల్లో అభ్యర్థులను చూసిన తొలి నిమిషంలోనే, వారిపట్ల ఒక అభిప్రాయానికి వచ్చేస్తారట! అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఎంతగా అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే రిక్రూటర్లపై మీదైన ముద్ర వేయడానికి, సరైన ఇంప్రెషన్ కలిగించడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏం చేయాలి?
- ఇంటర్వ్యూ కోసం తగిన విధంగా దుస్తులు ధరించాలి. ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నామనే దాన్ని బట్టి మీ వేషధారణ ఉండాలి.
- మీరు మాట్లాడేటప్పుడు ఏ విషయాన్ని అయినా చాలా స్పష్టంగా, అర్థం అయ్యేలా చెప్పాలి. మాటల్లో తడబాటు ఉండకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం బాగా ప్రిపేర్ కావాలి.
- కొంత మంది మొదటి ఇంప్రెషన్‌లోనే మంచి మార్కులు కొట్టేయాలన్న ఆలోచనతో, అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. ఏది ఎంత వరకూ అవసరమో, అంతవరకు మాత్రమే మాట్లాడాలి.
- అభ్యర్థులకు టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. మీ ప్రొఫైల్ ఎంత బాగున్నా, ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళ్తే మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే, క్రమశిక్షణ లేని అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకోవడానికి సంస్థలు ఇష్టపడవు.
ఇలాంటివి అస్సలు చేయకూడదు?
మీకు ఇప్పటికే ఉద్యోగ అనుభవం ఉంటే, పాత కంపెనీ గురించి కానీ, అక్కడి ఉన్నతాధికారుల గురించి కానీ చెడుగా మాట్లాడకూడదు. నిజంగా అక్కడి పరిస్థితులు బాలేకపోయినా సరే, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పకూడదు. ఒకవేళ చెబితే మీపై చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది.
కొందరు మాత్రమే విజేత అవుతారు - ఎందుకు?
ఇంటర్వ్యూ కోసం అందరూ ప్రిపర్ అయ్యే వస్తారు. కానీ కేవలం అతికొద్ది మంది మాత్రమే విజయం సాధిస్తారు. దీనికి కారణం ఏమిటి? దీనికి సరైన సమాధానం ఏమిటంటే, మిగతావారిలా కాకుండా, విజయం సాధించిన అభ్యర్థులు రిక్రూటర్లకు తమపై బెస్ట్ ఇంప్రెషన్ కలిగేలా చేయడమే.
ఎవరినైనా మొదటిసారి చూసినప్పుడు వారి ఆహార్యం, ప్రవర్తన, మాటతీరును బట్టి ఒక అంచనాకు వస్తుంటాం. అది మానవ సహజం. ఇంటర్వ్యూలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. తొలిసారి అభ్యర్థిని చూసినప్పుడు కలిగే ఇంప్రెషన్, రిక్రూటర్లు అడిగే ప్రశ్నల తీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఇంటర్వ్యూ మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగేందుకు ఇది చాలా తోడ్పడుతుంది.
అభ్యర్థులు వీలైనంత వేగంగా ఇంటర్వ్యూయర్ ఆసక్తిని, ఏకాగ్రతను మీపై నిలుపుకొనేలా చేయగలిగాలి. సాధారణంగా రిక్రూటర్లు, తోటి ఉద్యోగులతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడే, నలుగురితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన నిపుణులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అభ్యర్థిలో అటువంటి లక్షణాలు ఉన్నాయా, లేదా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అభ్యర్థి అందుకు తగిన వారు అనిపిస్తే ప్రొఫైల్ పట్ల మరింత ఆసక్తి కనబరుస్తారు.
సన్నద్ధత
అభ్యర్థులు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీని వల్ల సంస్థ మీ నుంచి ఏం కోరుకుంటుందో తెలిసే అవకాశం ఉంటుంది. ఏం చేస్తే మీపై మంచి ఇంప్రెషన్ కలుగుతుందో అర్థం అవుతుంది. పూర్తిగా తెలుసుకోకుండా వెళితే, మీ ఆత్మవిశ్వాసం సడలే అవకాశం ఉంటుంది.
కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి!
ఇంటర్వ్యూ సమయంలో 'ఐ కాంటాక్ట్' అనేది చాలా ముఖ్యం. దిక్కులు చూడడం ఏమాత్రం మంచిది కాదు. ప్రశ్నలకు కళ్లలోకి చూస్తూ సమాధానం ఇవ్వాలి. దీని వల్ల మనం వారి సమయాన్ని గౌరవిస్తున్నామని, చాలా ఫోకస్‌తో ఉన్నామని వారికి అర్థమవుతుంది. మన బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి. ఇవన్నీ మనపై మంచి ఇంప్రెషన్ కలిగించేలా చేస్తాయి.
ప్రశ్నలు అడగాలి!
ఇంటర్వ్యూ సమయంలో మీకు వచ్చిన సందేహాల గురించి ప్రశ్నలు వేయవచ్చు. అప్పుడే మీకు ఆ ఉద్యోగం పట్ల ఉన్న ఆసక్తి రిక్రూటర్లకు అర్థమవుతుంది. పని పట్ల గౌరవం, పని చేయాలనే ఉత్సాహం ఉన్న అభ్యర్థులను ఎవరూ వదులుకోరనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
జాగ్రత్తగా వినాలి!
ఇంటర్వ్యూ సమయంలో మీరు మాట్లాడటం ఎంత ముఖ్యమో, అవతలి వాళ్లు చెప్పే విషయాలను జాగ్రత్తగా వినడం కూడా అంతే ముఖ్యం. అందుకే వెర్బల్, నాన్‌వెర్బల్ సంభాషణలను చాలా జాగ్రత్తగా గమనించాలి.
మాటల ద్వారా
రిక్రూటర్లు అడిగే ప్రశ్నలకు చాలా చక్కగా, నెమ్మదిగా, అర్థమయ్యేలా, స్పష్టంగా సమాధానాలు చెప్పాలి. మాట్లాడుతూనే ఆత్మవిశ్వాసాన్ని కనబరచాలి. ఇది మీరు పూర్తిగా సన్నద్ధమై వచ్చారనే విషయాన్ని తెలియజేస్తుంది.
ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసం అనేది మీకు విజయాన్ని చేకూర్చి పెడుతుంది. అందుకే ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా, కచ్చితంగా మాట్లాడాలి. చిరునవ్వు మాత్రం వదలకూడదు. మీరు ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే, ఇంటర్వ్యూలో సులువుగా విజయం సాధించవచ్చు. ఆల్ ది బెస్ట్!
పరీక్షలు అంటేనే భయంగా ఉందా? ఈ 9-టిప్స్ పాటిస్తే విజయం మీదే! - Exam Anxiety