How To Study For Long Hours : నేటి పోటీ ప్రపంచంలో నెట్టుకురావాలంటే, కచ్చితంగా బాగా శ్రమించాల్సిందే. ఇందుకోసం చాలా మంది పుస్తకాలు ముందేసుకుని చదువుతూ ఉంటారు. కానీ ఎక్కువ సేపు చదవలేక ఇబ్బందిపడుతూ ఉంటారు.
పుస్తకం పట్టుకొని కాసేపు చదవగానే నిద్ర రావడమో లేదా మానసికంగా ఆలసిపోవడమో జరుగుతుంది. మరికొందరికి చదువు తప్ప మిగతా అన్ని విషయాలపైకి మనస్సు మళ్లుతుంటుంది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్, టీవీల వంటి వాటిని చూడాలనిపిస్తుంది. దీనితో ఏకాగ్రతతో చదవడం వారికొక పెద్ద సవాలుగా నిలుస్తుంది. అందుకే చదివే సమయంలో ఎదురయ్యే ఆటంకాల్ని అధిగమించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పాటించాల్సిన మంచి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. షెడ్యూల్ వేసుకోవాలి!
మీరు చదువుకోవడానికి ఒక మంచి షెడ్యూల్ రూపొందించుకోవాలి. రోజుకు ఎన్ని గంటలపాటు చదవాలి? ఏ సబ్జెక్ట్‌కు ఎంత సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోవాలి. మీరు తయారు చేసుకున్న టైమ్ టేబుల్ మీకు ఎల్లవేళలా కనబడేలా పెట్టుకోవాలి.
2. ప్రశాంత వాతావరణంలో చదవాలి!
రణగొణ ధ్వనులు లేని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని చదువుకోవాలి. వెలుతురు బాగా వచ్చే స్థలంలో కూర్చోవడం మంచిది. మీకు దగ్గరలోనే కావాల్సిన పుస్తకాలతోపాటు, తాగడానికి మంచి నీళ్లు ఉంచుకోవాలి. దీని వల్ల మీరు ప్రతిసారీ లేచివెళ్లే శ్రమ తగ్గుతుంది. ఏకాగ్రత నిలుస్తుంది.
3. బెస్ట్ టెక్నిక్స్ వాడాలి!
పొమోడోరో టెక్నిక్ లాంటి మీకు అనువైన టెక్నిక్లను ఉపయోగించాలి. మరీ గంటలు తరబడి చదవకుండా, మధ్య మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, 25 నిమిషాల పాటు చదివి, ఆ తరువాత 5 నిమిషాల పాటు విరామం తీసుకోవాలి. దీనివల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. చదివింది గుర్తుంటుంది. కొత్త అంశాలు చదవడానికి ఉత్సాహం వస్తుంది. ఈ విధంగా మీరు ఎక్కువ సేపు ఏకాగ్రతతో చదవడానికి వీలవుతుంది.
4. ప్రణాళిక ప్రకారం చదవాలి!
సబ్జెక్ట్‌ను చిన్నచిన్న భాగాలుగా విభజించుకుని, ప్రణాళిక ప్రకారం చదవాలి. అనుకున్న సమయంలోనే సబ్జెక్ట్ మొత్తాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. చదవడమే కాదు, దానిని రివిజన్ కూడా చేస్తుండాలి. మీకు వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి క్లారిఫై చేసుకోవాలి. లేదా స్నేహితుల సహకారం కూడా తీసుకోవాలి. ఇందులో మొహమాటం పడడానికి వీళ్లేదు.
5. ఆహారం కూడా ముఖ్యమే!
చదివేటప్పుడు మధ్య మధ్యలో కచ్చితంగా నీళ్లు తాగుతూ ఉండాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్స్‌కు, నూనె ఎక్కువగా వాడే వేపుళ్లు లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన చిరుతిళ్లు, పళ్లు తీసుకోవాలి.
6. ఫోన్ వెడిచిపెట్టాల్సిందే!
నేటి కాలంలో చాలా మంది యువతీ, యువకులు ఫోన్ అడిక్షన్‌కు లోనవుతున్నారు. ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నారు. కానీ పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే, కచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టాల్సిందే. లేకుంటే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.
7. లక్ష్య సాధన మీదే దృష్టి పెట్టాలి!
నేటి ప్రపంచంలో ఉద్యోగాల కోసం ఎంతగా పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత పోటీని తట్టుకుని విజయం సాధించాలంటే, క్రమశిక్షణతో, ఏకాగ్రతతో, లక్ష్యం సాధించాలనే దృఢమైన సంకల్పంతో చదవితీరాలి. అప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆల్ ది బెస్ట్!
ఈ జాబ్స్‌కు అప్లై చేశారంటే అంతే సంగతులు- నిరుద్యోగులూ బీ కేర్ ఫుల్! - Care Ful With These Jobs