How To Improve Leadership Skills : ప్రస్తుత కాలంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టంగా ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఉన్నత చదువులు, ర్యాంకులు, గోల్డ్ మెడల్స్ సంపాదించినవారు సైతం, ఉద్యోగం లేక నానాఅవస్థలు పడుతున్నారు. మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉద్యోగం సంపాదించాలంటే, మనకు కచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన స్కిల్స్ ఉండాలి. వాటిలో అత్యంత ప్రధానమైనది 'లీడర్షిప్ క్వాలిటీ'.
లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవచ్చు!
కొంత మందికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. కనుక వారు కోరుకున్న రంగాల్లో దూసుకుపోతూ ఉంటారు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవారినే నియమించుకోవడానికి ఇష్టపడతాయి. మరి ఇలాంటి నాయకత్వ లక్షణాలు లేని మాలాంటి వారి పరిస్థితి ఏమిటి అని అనుకుంటున్నారా? డోంట్ వర్రీ. సాధన చేసి కూడా నాయకత్వ లక్షణాలను పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Ways To Improve Leadership Skills :
- విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను మెరుగు పరుచుకోవాలి. అప్పుడే వృత్తి, ఉద్యోగాల్లోనూ సమర్థంగా రాణించడానికి వీలవుతుంది.
- ఏదో కాలేజీకి వెళుతున్నాం, వస్తున్నాం, అన్నట్టుగా కాకుండా తరగతి గదిలో చురుగ్గా ఉండాలి. సహవిద్యార్థులతో కలిసిమెలిసి మాట్లాడుతూ ఉండాలి. గ్రూప్‌లుగా ఏర్పడి వివిధ అంశాలపై చర్చించడాన్ని అలవాటు చేసుకోవాలి.
- పాఠ్యాంశాలు, కాలేజీ విషయాలు, వర్తమానాంశాలు, వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు - ఇలా అన్ని టాపిక్లపైనా స్వేచ్ఛగా చర్చించాలి. దీంతో మన అభిప్రాయాలను, ఆలోచనలను అందరి ముందు ధైర్యంగా చెప్పడం అలవాటు అవుతుంది.
- చాలా మంది బయట బాగా మాట్లాడుతారు. కానీ స్టేజ్‌పై ఎక్కి మాట్లాడాలంటే మాత్రం విపరీతంగా భయపడిపోతుంటారు. ఈ స్టేజ్ ఫియర్ పోవాలంటే ఒకటే మార్గం ఉంది. ఎదుటివారు నవ్వుతున్నా పట్టించుకోకుండా వేదికపైకి ఎక్కి మీకు తోచిన విషయాలు మాట్లాడాలి. ఇందుకోసం అవసరమైతే ఇంట్లోనే సాధన చేయాలి.
- ఎందుకంటే నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటం వల్ల బహిరంగంగా మాట్లాడాలంటే భయమేస్తుంది. అందుకే దీనిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. సహవిద్యార్థుల ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం, బృంద చర్చల్లో భాగంగా వివిధ అంశాలపై మాట్లాడటం వల్ల మీలోని భయం పోయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- విద్యార్థిగా ఉన్నప్పుడే వివిధ సంస్థల్లో సభ్యులుగా చేరాలి. దీని వల్ల నాయకులుగా ఎదగడానికి మీకొక మార్గం ఏర్పడుతుంది.
- కాలేజీలో ప్రత్యేక దినోత్సవాలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించాలి. మీ గ్రూప్‌లోకి లేదా సంఘంలోకి సభ్యులను చేర్పించాలి. బడ్జెట్ నిర్వహణ చేయాలి. ఇలాంటి పనులు చేయడం వల్ల బాధ్యతల నిర్వహణ తెలుస్తుంది. జవాబుదారీతనం కూడా అలవడుతుంది.
- నాయకత్వ లక్షణాలను పెంచే వర్క్‌షాప్‌లకు, కాన్ఫిరెన్స్‌లకు హాజరు కావాలి. దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. దీంట్లో పాల్గొనే నిపుణుల సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు మీరు నాయకులుగా ఎదగడానికి దోహదపడతాయి. దీంతో మీ సంకోచం, తడబాటు తగ్గిపోతాయి.
- భావవ్యక్తీకరణ, సమయ పాలన, నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం - ఇవన్నీ నాయకుడికి అవసరమైన నైపుణ్యాలు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే పార్ట్‌టైమ్ జాబ్స్, ఇంటర్న్‌షిప్‌లు చేస్తే ఈ లక్షణాలను మెరుగుపరుచుకోవచ్చు.
- మీరు పది మందికి మార్గదర్శిగా ఉంటే, మంచి నాయకుడుగా ఉన్నట్టే. అందుకే మీరు కింది తరగతిలోని విద్యార్థులకు ట్యూషన్లు చెప్పాలి. వారి సమస్యలను శ్రద్ధగా విని తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. దీనివల్ల కూడా మీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి.
- ఈ విధంగా విద్యార్థి దశలోనే మీరు నాయకత్వ లక్షణాలు అలవరుచుకుంటే, ఉద్యోగంలోనూ, జీవితంలోనూ అద్భుతంగా రాణించగలుగుతారు.