Body Language In A Job Interview : శరీర భాష (బాడీ లాంగ్వేజ్) చాలా విషయాలను చెప్పకనే చెబుతుంది. కళ్లు, చేతులు, నడక, కూర్చునే తీరు - ఇలా ప్రతి కదలికా బాడీ లాంగ్వేజ్ కిందకే వస్తుంది. వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకోవడం ద్వారా ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన ఇవ్వగలుగుతాం. సందర్భానికి తగిన విధంగా హుందాగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాం. దీని వల్ల మీ ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో బాడీ లాంగ్వేజ్ గురించి వివరంగా తెలుసుకుందాం.
వినేటప్పుడు
మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా ఒక కళే. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని, దానిని అర్థం చేసుకోవాలి. ఆ తరువాతే తిరిగి జవాబు ఇవ్వాలి. దీనిని తప్పక సాధన చేయాలి. ఎందుకంటే చాలా మంది ఎదుటివాళ్లు చెప్పేది పూర్తిగా వినకుండానే, సమాధానాలు ఇచ్చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు.
మన గురించి మనం చెప్పుకోవాలి అనుకోవడం, తెలిసిన సబ్జెక్ట్ మాట్లాడేయాలి అనుకోవడం, ఆ కంగారులో సరిగా వినకపోవడం అనేది సాధారణంగా జరుగుతుంటాయి. కానీ వీలైనంత వరకు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటం కోసం సాధన చేయాలి. ఇంటర్వ్యూ చేసేవాళ్లు - అభ్యర్థి అర్హత, అనుభవంతోపాటు ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ను కూడా అంచనా వేస్తారు. అందులో భాగంగా మీరు సరిగ్గా వింటున్నారా? లేదా? అనేది కూడా పరిశీలిస్తారు.
ఇంటర్వ్యూకు సిద్ధమయ్యేవాళ్లు అప్రమత్తంగా ఉండటం, అవసరమైనప్పుడు తక్షణం స్పందించడం చాలా ముఖ్యం. జవాబులు ఇచ్చేటప్పుడు చిన్నగా ముందుకు వంగి మాట్లాడటం కూడా మంచిది. దీని ద్వారా మనం ఆసక్తిగా, సంభాషణలో మిళితమై ఉన్నట్లుగా ఇంటర్వ్యూ చేసేవారికి తెలుస్తుంది. సందర్భాన్ని బట్టి చిన్నగా తల ఆడించడం కూడా ఇందులో భాగమే.
కూర్చునే తీరు
మనం కూర్చునే తీరు కూడా జాబ్ రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల నిటారుగా కూర్చోవడం, భుజాలను రిలాక్స్‌డ్‌గా ఉంచడం, కాళ్లను దగ్గరగా ఉంచుకోవడం లాంటివన్నీ కచ్చితంగా పాటించాలి. అభ్యర్థి అందరితోనూ సులభంగా కలిసిపోతాడా? నలుగురిలోనూ మాట్లాడేందుకు ఇబ్బంది పడతాడా? చెప్పే జవాబుల్లో ఎంత వరకూ నిజం ఉంది? వ్యక్తిత్వం ఎటువంటిది? వంటివన్నీ కూర్చునే తీరుతోనే అంచనా వేయొచ్చు.
చేతులు
మనమే కాదు, మన చేతులు కూడా మాట్లాడతాయని మీకు తెలుసా? చెబుతున్న అంశానికి తగిన విధంగా చేతులను కదిలించడం ద్వారా మన సమాధానాలను మరింత స్థిరంగా తెలియజేయవచ్చు. అలాగే మనం మాట్లాడటం ఆపినప్పుడు చేతులను న్యూట్రల్ పొజిషన్‌లో ఉంచాలి. దీని ద్వారా వినడంపై ఏకాగ్రత పెంచుకోవచ్చు. ఎదురుగా ఉన్న టేబుల్ లేదా డెస్క్‌పై మన చేతులను రెస్ట్ పొజిషన్‌లో ఉంచుకోవచ్చు. అంతేకాని డేబుల్పై చేతులు వేసి, అపసవ్యంగా వాటిని తిప్పకూడదు. ఇలా చేస్తే ఎదుటి వారి ఏకాగ్రత మనం మాట్లాడే అంశం మీద నుంచి పక్కకు వెళ్లే పరిస్థితి తలెత్తుతుంది.
తిరిగి వెళ్లేటప్పుడు
ఇంటర్వ్యూ జరిగే గదిలోకి ఎలా అయితే ఆత్మవిశ్వాసంతో వేళ్లాలో, వచ్చేటప్పుడు కూడా అలానే హుందాగా బయటకు రావాలి. అప్పుడే మీపై మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. చక్కని చిరునవ్వుతో, కరచాలనం చేసి ‘థాంక్యూ’ చెప్పి బయటకు రావాలి. గది తలుపు మూసేటప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి.
సాధనతో
ఇంటర్వ్యూలకు సమాధానాలు ఎలా అయితే సాధన చేస్తామో, బాడీ లాంగ్వేజ్‌ను కూడా అదే విధంగా సాధన చేయడం చాలా ముఖ్యం. అప్పుడే మెరుగైన ప్రదర్శన కనబరచగలుగుతాం. నిజానికి మనసులో భయం ఉన్నా, నిరంతరం సాధన చేయడం ద్వారా దీన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో కనిపించవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లో వివిధ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
చిరునవ్వు
ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లినప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించాలి. ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వాలి. సమాధానం తెలియకపోతే, అది విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పాలి. చిరునవ్వు మాత్రం చెదిరిపోనీయకూడదు. ఒక మంచి సానుకూల వాతావరణంలో సంభాషణ జరిగితే వచ్చే ఫలితాలు కూడా ఆశావహంగా ఉంటాయనేది నిపుణుల మాట. అదే సమయంలో సాంకేతిక అంశాలు, సీరియస్ అంశం మాట్లాడేటప్పుడు ఆ సందర్భానికి తగిన విధంగా ముఖకవళికలు మార్చుకోవాలి.
కళ్లలోకి చూసి మాట్లాడాలి
ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ఎందరు ఉన్నా, అందరితోనూ కళ్లలోకి నేరుగా చూస్తూ మాట్లాడాలి. దీని ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని, మనమిచ్చే జవాబులపై మనకున్న నమ్మకాన్ని తెలియజేసినట్లు అవుతుంది. గది పైకప్పు వైపు, మూలలవైపు చూడటం, పదే పదే ఫోన్ లేదా వాచ్ చూసుకోవడం, మాట్లాడేటప్పుడు తరచూ కళ్లు మూసుకోవడం, ఎదుటి వారి కళ్లలోకి చూడలేకపోవడం అనేది మనసులోని ఆందోళనలను, ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తుంది. అలా అని చూపు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోతే ఎదుటి వారిని కొంత ఇబ్బందికి గురిచేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల సందర్భానికి తగిన విధంగా, వారిని ఇబ్బంది పెట్టకుండా చూడటం అవసరం.
ఐ కాంటాక్ట్‌కు ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ మాట్లాడినప్పుడే, వారు నిజంగా మనతో సంభాషణలో మమేకం కాగలరు. ఎంత ఇంటర్వ్యూ అయినా అది చివరికొచ్చేసరికి ఒక సంభాషణగానే మిగులుతుంది. అందుకే మన ఆసక్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ వ్యక్తపరిచే ఐ కాంటాక్ట్ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించకూడదు. ఈ విధంగా సరైన బాడీ లాంగ్వేజ్‌ను మీరు అలవర్చుకుంటే, పక్కాగా కోరుకున్న ఉద్యోగం సంపాదించడానికి వీలవుతుంది.
ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - How To Success In Interview
ఇంటర్వ్యూల్లో పదేపదే ఫెయిల్ అవుతున్నారా? ఈ 3 విషయాలు అస్సలు చెప్పకండి! - Interview Tips For New Job