Why Your Credit Score Is Not Improving Despite Timely Payments : మనలో చాలా మంది క్రెడిట్ కార్డులు తీసుకుని, సకాలంలోనే బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. కానీ వారి క్రెడిట్ స్కోర్ మాత్రం పెరగదు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- మీ క్రెడిట్ స్కోరు పెరగడం, తగ్గడం అనేది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్)పై ఆధారపడి ఉంటుంది. కనుక క్రెడిట్ కార్డు వాడేవారు దీన్ని కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు మీ కార్డు పరిమితి రూ.1 లక్ష అనుకుంటే, అందులో మీ వినియోగం రూ.30 వేల లోపునే ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా అధికంగా మీ కార్డును వినియోగిస్తే, మీ క్రెడిట్ స్కోరు పెరగకపోగా, తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
- రుణాల్లో వైవిధ్యత ఉన్నప్పుడే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అది కూడా మీ ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి. అంటే మీ పేరు మీద క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణం, హోమ్‌లోన్ లేదా ఇతర తనఖా రుణాలు ఉంటే క్రెడిట్ స్కోరు బాగానే ఉంటుంది. అలాగని వైవిధ్యం పేరిట రుణాలు పెంచుకుని, చెల్లింపులు చేయడంలో విఫలమైతే మొదటికే మోసం వస్తుంది.
- మార్కెట్‌లోకి మంచి రివార్డు బెనిఫిట్స్‌తో కొత్త క్రెడిట్ కార్డు వచ్చిందనో, లేదంటే తనకు ఎంత రుణం రావొచ్చో చెక్ చేద్దామనో కొందరు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేస్తుంటారు. స్వల్ప వ్యవధిలో ఇలా ఎక్కువ దరఖాస్తులు పెడితే, అది మీ క్రెడిట్ స్కోరుపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది.
- బ్యాంక్ లోన్స్ విషయంలో సహదరఖాస్తుదారునిగా ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే, లోన్ చెల్లించాల్సిన వ్యక్తి సకాలంలో బిల్ పేమెంట్ చేయడంలో విఫలమైతే ఆ రుణ భారం మీపై పడుతుంది. దీని వల్ల మీ ఆదాయంలో రుణ నిష్పత్తి పెరిగి క్రెడిట్ స్కోరు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
- కొందరు ఎప్పుడోగాని తమ క్రెడిట్ రిపోర్టులను తనిఖీ చేసుకోరు. ఒకవేళ చూసుకున్నా కేవలం స్కోర్ మాత్రమే చూసి ఆగిపోతుంటారు. ఇది సరైన విధానం కాదు. క్రెడిట్ స్కోరును క్షుణ్ణంగా తనిఖీ చేస్తేనే జరిగిన పొరపాట్లు, చేసిన తప్పులు బయటపడతాయి. అప్పుడే వాటిని సరిచేసుకునే అవకాశం వస్తుంది.
- మీ క్రెడిట్ స్కోరు పెరగడం లేదంటే, దానికి గల కారణాలను నిపుణులను అడిగి తెలుసుకోవాలి. వారి సలహాతో మీరు చేస్తున్న పొరపాట్లను సరిద్దుకోవాలి. అలాగే సకాలంలో చెల్లింపులు చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది.