What To Do If Income Tax Refund Is Not Received : ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు ఇటీవల పూర్తయింది. దీంతో ఇప్పుడు చాలా మంది రిఫండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రిటర్నులు సరైన రీతిలో దాఖలు చేసినా, కొన్నిసార్లు రిఫండ్ల ప్రక్రియ నిలిచిపోవచ్చు. ఆ సమయంలో మీరు రీఇష్యూ కోరవచ్చు. అయితే రిఫండ్లు ఎందుకు నిలిచిపోతాయి? రీ-ఇష్యూ ఎలా కోరాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐటీఆర్ దాఖలు చేసిన తరువాత ఆదాయపు పన్ను శాఖ నుంచి రిఫండ్ అందుతుంది. అయితే రిటర్నులు దాఖలు చేసిన వెంటనే రిఫండ్ రాదు. అందుకు కొంత సమయం పడుతుంది. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి పన్ను వివరాలు, మీకు చెల్లించాల్సిన బకాయిల వివరాలతో ఇంటిమేషన్‌ను పంపుతుంది. ఆ తర్వాత రిఫండ్ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సాధారణంగా రిఫండ్ రావడానికి 4-5 వారాల సమయం పడుతుంది. ఆ లోగా మీకు రిఫండ్ జమ కాకపోతే వెంటనే స్పందించాల్సి ఉంటుంది.
రిఫండ్లు ఎందుకు నిలిచిపోతాయి?
బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, పేరులో తప్పులు లాంటివి ఉంటే రిఫండ్ ఆగిపోవచ్చు. ఈ-ఫైలింగ్ సమయంలో బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ కాకపోయినా, బ్యాంక్ కేవైసీ పెండింగ్‌లో ఉన్నా నిలిచిపోయే అవకాశం ఉంది. ఐటీ శాఖకు మీరు సమర్పించిన ఖాతా కరెంట్ లేదా సేవింగ్స్ ఖాతా కాకపోయినా, అకౌంట్ డిస్క్రిప్షన్ తప్పుగా పేర్కొనడం వంటి కారణాలతో రిఫండ్ నిలిచిపోతుంది.
రీ ఇష్యూ ఎలా కోరాలి?
రిఫండ్ నిలిచిపోయిన సందర్భంలో ఇ-ఫైలింగ్ పోర్టల్ స్టేటస్‌లో రిఫండ్ ఫెయిల్యూర్ అని చూపిస్తుంది. రీ-ఇష్యూ కోసం ఐటీఆర్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లి రిఫండ్ రీ-ఇష్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో క్రియేట్ రిఫండ్ రీ-ఇష్యూ రిక్వెస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఏ బ్యాంక్ ఖాతాలో రిఫండ్ పడాలని కోరుకుంటున్నారో ఆ అకౌంట్‌ను ఎంచుకోవాలి. తర్వాత ఆధార్ ఓటీపీతో వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అంతే సింపుల్!
మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే! - Popular Sports Bikes in India 2024