What Is Bitcoin Halving : బిట్‌కాయిన్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ. శుక్రవారం నాడు బిట్‌కాయిన్ 'హావింగ్' (Halving) ప్రక్రియ పూర్తయిందనే ప్రకటన వెలువడింది. దీంతో అంతటా ఆ టాపిక్‌పై చర్చ మొదలైంది. ఇంతకీ బిట్‌కాయిన్ 'హావింగ్' ప్రక్రియ అంటే ఏమిటి ? అందులో భాగంగా ఏం చేస్తారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బిట్‌కాయిన్ 'హావింగ్' అంటే ?
బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా కొత్త బిట్కాయిన్లను క్రియేట్ చేస్తుంటారు. అయితే ఈ కొత్త బిట్‌కాయిన్ల సృష్టిని తగ్గించే ఉద్దేశంతో దాదాపు ప్రతి నాలుగేళ్లకోసారి చేపట్టే ప్రక్రియనే బిట్‌కాయిన్ 'హావింగ్' అంటారు. బిట్‌కాయిన్‌ను తొలుత క్రియేట్ చేసినప్పుడు మొత్తం 2.1 కోట్ల బిట్‌కాయిన్లే చలామణిలో ఉండాలని ఒక లిమిట్ పెట్టారు. అందుకని ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి కొత్త బిట్కాయిన్లను క్రియేట్ చేయడాన్ని తగ్గించేందుకు బిట్‌కాయిన్ 'హావింగ్' కోడ్‌ను రూపొందించారు.
బిట్ కాయిన్ క్రియేషన్ ఇలా
How To Create Bitcoin : బిట్‌కాయిన్ మైనర్లు తమ కంప్యూటింగ్ పవర్ ద్వారా కఠినమైన మ్యాథ్స్ పజిల్స్‌ను పరిష్కరించి, బ్లాక్ చెయిన్‌ను రూపొందిస్తారు. తద్వారా కొత్త బిట్‌కాయిన్ల రూపంలో రివార్డులను పొందుతుంటారు. ఇలా బ్లాక్‌చెయిన్‌కు 2.1 కోట్ల బ్లాక్స్ జత అయిన ప్రతిసారి 'హావింగ్' ప్రక్రియ జరిగేలా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని తయారు చేశారు. ఇలా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు. ప్రస్తుతం 1.9 కోట్ల బిట్‌కాయిన్‌లను మైనింగ్ ద్వారా చలామణిలోకి తెచ్చారు. ఇంకా 15 లక్షల బిట్‌కాయిన్లను మైనింగ్ చేయాల్సి ఉంది. హావింగ్ ప్రక్రియ వల్ల బిట్‌కాయిన్ల సృష్టి నెమ్మదిస్తుంది. పైగా బిట్‌కాయిన్లను మైనింగ్ చేసే వాళ్లకు బిట్‌కాయిన్ రివార్డులు కూడా తగ్గిపోతాయి. శుక్రవారం రోజున బిట్‌కాయిన్ 'హావింగ్' ప్రక్రియ పూర్తయిన అనంతరం, అది 0.47 శాతం నష్టపోయి రూ.53 లక్షల (63,747 డాలర్ల) వద్ద కదలాడింది. ఈ ఏడాది మార్చిలో బిట్‌కాయిన్ రూ.61 లక్షల (73,803.25 డాలర్ల) వద్ద జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది.
ఇంతకీ క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి?
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్వేర్ కోడ్ల ద్వారా పని చేస్తుంటాయి. సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి పూర్తిగా డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటాయి. పేరుకు తగ్గట్లుగానే క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు. ప్రస్తుతం బిట్‌కాయిన్, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్ సహా పలు ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉన్నాయి. వీటన్నింటిలో బిట్‌కాయిన్ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.
బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి?
క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉన్నాం. బ్లాక్‌చైన్ అనేది డేటా బైస్ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెంది ఉంటుంది. అదంతా ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది.
ఇలా ఒక సర్వర్‌కు మరో సర్వర్ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎంతటి హ్యాకర్లయినా తస్కరించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం కూడా జరగదు. దీనితో పాటు అవి అత్యంత సురక్షితమనే వాదన కూడా ఉంది.
బిట్‌కాయిన్ పొందడం ఎలా?
బిట్‌కాయిన్‌ను వర్ణించాలంటే డిజిటల్ గోల్డ్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే బిట్ కాయిన్, బంగారం రెండూ అంత సులభంగా దొరకవు. వాటిని వెలికి తీయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొనాలంటే భారీగా ఖర్చవుతుంది.
బంగారం భౌతికంగా భూమిలో ఉంటుంది. దీన్ని పొందేందుకు మైనింగ్ చేయాల్సి ఉంటుంది. అదే తరహాలో కొత్త బిట్‌కాయిన్ల కోసం కంప్యూటర్ల ద్వారా మైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎంతో క్లిష్టమైన క్రిప్టోగ్రఫీ సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త బిట్కాయిన్లను రివార్డుగా పొందొచ్చు. చలామణిలోకి (డిజిటల్‌గా) వచ్చే బిట్‌కాయిన్ల సంఖ్య పెరిగే కొద్ది, కొత్త సమస్యలు పరిష్కరించే వారికి రివార్డుగా వచ్చే కాయిన్లు తగ్గుతాయి. ఇదే సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలు మరింత క్లిష్టంగా మారుతుంటాయి. ఒకానొక దశ తర్వాత కొత్త బిట్కాయిన్లు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. మొత్తం మీద 2.1 కోట్ల బిట్కాయిన్లు మాత్రమే మనుగడలో ఉంటాయి.
బిట్‌కాయిన్ రూపకర్త ఎవరు?
బిట్‌కాయిన్ జపాన్‌కు చెందిన షాతోషీ నాకామోటో అనే టెకీ రూపొందించినట్లు ప్రచారంలో ఉంది. అయితే దీనిపై స్పష్టత లేదు. 2009లో బిట్‌కాయిన్ మనుగడలోకి వచ్చింది. రూపాయికి 100 పైసలు ఎలానో, ఒక బిట్‌కాయిన్‌కు 100 షాతోషీలు ఉంటాయి.
రిటైర్మెంట్ ప్లాన్ - ఈ టిప్స్ పాటిస్తే 'ఎక్స్ట్రా పెన్షన్' గ్యారెంటీ! - EPFO Pension Rules
బెస్ట్ స్పోర్ట్స్ బైక్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే? - Best Sports Bikes