How To Correct Defective ITR : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినవారు ఇప్పుడు రీఫండు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరికి ఈ మొత్తం చేతికి అందింది కూడా. అయితే మరికొందరికి మాత్రం ఆదాయపు పన్ను శాఖ నుంచి 'డిఫెక్టివ్ రిటర్న్' నోటీసులు వస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తాయి? దీన్ని ఎలా సరిచేయాలి? అనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు ఎందుకు వస్తాయి?
మీకు వచ్చిన ఆదాయానికి ఆధారం ఫారం-26 ఏఎస్. కనుక దీనిలో ఉన్న మొత్తానికి, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఉన్న మొత్తానికి, అలాగే ఐటీ రిటర్నుల్లో నమోదు చేసిన ఆదాయానికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉంటే, డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు వస్తాయి. అంటే మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌లో తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని కోరుతూ, ఆదాయ పన్ను విభాగం మీకు నోటీసులు పంపిస్తుంది.
నోట్ : మీకు ఆదాయం వచ్చిన తీరును బట్టి, ఐటీ రిటర్నుల ఫారాలు మారిపోతుంటాయి. వ్యాపారం లేదా కమీషన్ల ద్వారా వచ్చిన మొత్తాలను ఇతర ఆదాయాలుగా చూపించడం; షేర్ల విక్రయం, ఇతర మార్గాల్లో వచ్చిన మూలధన లాభాలను తెలియజేయకపోవడం; ఐటీఆర్ ఫారం-2కు బదులు ఐటీఆర్-1ని ఎంచుకోవడం, అంటే తప్పుడు ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం లాంటివి చేసినప్పుడు, మీకు డిఫెక్టివ్ రిటర్ను నోటీసు పంపుతారు.
ఇలాంటి సందర్భాల్లో ఐటీ రిటర్నులను సరిచేసేందుకు, రివైజ్డ్ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. కనుక ఫారం-26 ఏఎస్, ఏఐఎస్‌లో ఉన్న మొత్తాల్లో ఏమైనా తేడా ఉందో, లేదో చూసుకొని, వాటిని సరిచేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాత సరిదిద్దిన రిటర్నులు దాఖలు చేయాలి.
ఏం చేయాలి?
డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీస్ రాగానే కంగారు పడిపోకూడదు. ముందుగా నోటీసు ఎందుకు వచ్చిందో నిశితంగా పరిశీలించాలి. తరువాత మీ ఆదాయాలను సరిగ్గా నమోదు చేయాలి. ఫారం ఎంపికలో పొరపాటు ఉంటే, సరైన పత్రాన్ని ఎంచుకోవాలి. తగిన ఆధారాలతో తిరిగి రిటర్నులు దాఖలు చేయాలి. కొన్నిసార్లు సమాధానం ఇస్తే సరిపోతుంది. కనుక ఈ మీకు వచ్చిన నోటీసులో, మిమ్మల్ని ఏది చేయాలని కోరారో అది చేస్తే సరిపోతుంది.
పన్ను చెల్లింపు
మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించి ఫారం-26ఏఎస్‌లో తెలియజేసిన మొత్తానికీ, ఐటీ రిటర్నులలో మీరు నమోదు చేసిన వివరాలకు మధ్య తేడా ఉంటే, రిటర్నుల ప్రాసెసింగ్‌లో ఇబ్బందులు వస్తాయి. అందుకే సరైన వివరాలతో రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయాలి. ఫారం-26 ఏఎస్‌లో పూర్తి వివరాలు లేకపోతే, టీడీఎస్ చేసిన వారిని సంప్రదించాలి.
ఎన్ని రోజుల్లో సమాధానం ఇవ్వాలి?
డిఫెక్టివ్ రిటర్న్ నోటీస్ వచ్చిన తర్వాత, సాధారణంగా 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. నోటీసుకు సరైన సమయంలో స్పందించకపోతే రిటర్ను చెల్లకుండా పోతుంది. పైగా పెనాల్టీలు కూడా కట్టాల్సి వస్తుంది.