Life Insurance Policy Surrender : సంపాదన మొదలయ్యాక చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ఆలోచిస్తారు. ఇన్సూరెన్స్ అనుకోని ఆపదల్లో కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి కాపాడుతుంది. అంతేకాదు ఇది పన్ను ఆదా మార్గంగా కూడా పని చేస్తుంది. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు టెన్యూర్ ఎక్కువగా ఉంటుంది. కనుక దీర్ఘకాలం ప్రీమియంలు చెల్లించాలి. అయితే చాలా మంది వివిధ కారణాలతో మెచ్యూర్ కాకముందే పాలసీని సరెండర్ చేస్తుంటారు. పాలసీని ముందే సరెండర్ చేసి స్వల్పకాలిక ఉపశమనం పొందుతారు. కానీ విలువైన దీర్ఘకాలిక ప్రయోజనాలు కోల్పోతున్నామని గుర్తించరు.
పాలసీ సరెండర్ అంటే ఏంటి?
మెచ్యూరిటీకి ముందే పాలసీ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నట్లు, ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీదారు చేసే అభ్యర్థనని పాలసీ సరెండర్ అంటారు. ఈ సమయంలో పాలసీదారు అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంల ఆధారంగా కొంత డబ్బు పొందుతారు. ఈ సరెండర్ వ్యాల్యూ ప్రీమియంల సంఖ్య, ప్రీమియం మొత్తం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాలసీ నుంచి నిర్దిష్ట ఛార్జీలు తీసేసి మిగిలిన మొత్తం పాలసీదారుకు చెల్లిస్తారు. పాలసీ నిబంధనలు, షరతులకు లోబడి ఈ మొత్తం లెక్కిస్తారు.
సరెండర్ చేయడానికి కారణాలు
ఇన్సూరెన్స్ కంపెనీ సేవలు నచ్చకపోవడం, లేదా కోరుకున్న కవరేజీ లభించడం లేదనే ఉద్దేశంతో కొందరు సరెండర్ చేస్తుంటారు. ప్రీమియం చెల్లించలేక, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా మరికొందరు బీమా పాలసీని సరెండర్ చేసేస్తూ ఉంటారు.
ముందే సరెండర్ చేస్తే
పాలసీని గడువుకు ముందే సరెండర్ చేసినప్పుడు పెనాల్టీ భరించాల్సి వస్తుంది. కనీస సమయం కన్నా ముందే పాలసీని సరెండర్ చేస్తే, అప్పటిదాకా చెల్లించిన ప్రీమియంలు కూడా పూర్తిగా తిరిగిరావు. సాధారణంగా ఎండోమెంట్ పాలసీలు మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తాయి. లాక్-ఇన్ పీరియడ్ పూర్తయ్యేలోపునే, ముందస్తుగా సరెండర్ చేస్తే, చెల్లించిన మొత్తం విలువ తగ్గిస్తారు. ప్రీమియంలను 3-4 ఏళ్లలోపు క్రమం తప్పకుండా చెల్లించుంటే మెచ్యూరిటీ హామీ మొత్తంలో 80 శాతం లభిస్తుంది. ప్రీమియంలను నాలుగేళ్లకు పైగా చెల్లించి ఉంటే అప్పటి మెచ్యూరిటీ హామీ మొత్తంలో 90 శాతాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఐదేళ్లకుపైగా క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తే మాత్రం హామీ మొత్తాన్ని 100 శాతం చెల్లిస్తారు.
సరెండర్ వ్యాల్యూ ఎలా లెక్కిస్తారు?
పాలసీదారుడు పాలసీని మూడేళ్ల తర్వాత మాత్రమే సరెండర్ చేయొచ్చు. సరెండర్ వ్యాల్యూ కూడా పాలసీ రకాన్ని బట్టి ఉంటుంది. సాధారణ ఇన్సూరెన్స్ పాలసీ అయితే, సంబంధిత వ్యవధిలో వచ్చే బోనస్‌ల ఆధారంగా సరెండర్ వ్యాల్యూ లెక్కిస్తారు. యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్(యులిప్స్)లో పాలసీదారుడు కలిగి ఉన్న యూనిట్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా సరెండర్ వ్యాల్యూ కాలిక్యులేట్ చేస్తారు. ఈ పాలసీల విషయంలో ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మూడేళ్ల తర్వాత పాలసీ సరెండర్ చేస్తే, బీమా రక్షణ వెంటనే ఆగిపోతుంది. లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు పూర్తయ్యాక మాత్రమే సరెండర్ వ్యాల్యూని కంపెనీ చెల్లిస్తుంది. ఆ తర్వాత పాలసీ రద్దు అవుతుంది. సరెండర్ చేయడానికి ముందు పాలసీదారులు తమ పాలసీకి సంబంధించిన నిబంధనలు, షరతులను, పాలసీ సరెండర్ వ్యాల్యూ గురించి తెలుసుకోవడం మేలు.
టర్మ్ ఇన్సూరెన్స్ సరెండర్ చేస్తే?
టర్మ్ ఇన్సూరెన్స్‌లో యాన్యువల్ ప్రీమియం పేమెంట్ ఎంచుకుంటే సరెండర్ వ్యాల్యూ రాదు. మరుసటి సంవత్సరం ప్రీమియంను చెల్లించకుంటే, పాలసీని గడువు తర్వాత రద్దు చేస్తారు. లైఫ్ కవర్ ఆగిపోతుంది. అయితే, పరిమిత చెల్లింపుల టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియంలలో కొంత భాగం తిరిగి చెల్లిస్తారు. పాలసీదారుడు తమ ప్రీమియంలను ముందుగానే చెల్లిస్తే, సరెండర్ సమయంలో నిర్ణీత మొత్తాన్ని పొందుతారు.
ఉదాహరణకు రాబోయే 30 ఏళ్లలో చెల్లించాల్సిన మొత్తాన్ని 3-5 ఏళ్లలో చెల్లిస్తే, పాలసీదారుడు చెల్లించిన నిర్ణీత మొత్తాన్ని వాపసు చేస్తారు. సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ సరెండర్ చేయకపోవడం మంచిదిన ఇన్సూరెన్స్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కవరేజ్ ఆగిపోవడమే కాకుండా కొత్త కవర్ పొందడానికి, అధిక వయసు కారణంగా ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
పాలసీని సరెండర్ చేయడం అంటే తమపై ఆధారపడిన వారి ఆర్థిక భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నట్లు భావించాలి. పాలసీ తీసుకుని క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తే, అనుకోకుండా కుటుంబ పెద్ద దూరమైనప్పుడు, ఆధారపడిన వాళ్లకు డెత్ బెనిఫిట్ లభిస్తుంది. అప్పులు, అవసరాలు తీర్చుకోవడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది.
ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాలసీని సరెండర్ చేయడమే పరిష్కారం కాదు. పాలసీని సరెండర్ చేయడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. కోల్పోతున్న పన్ను ప్రయోజనాలు, కవరేజీ గురించి ఆలోచించాలి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఇన్సూరెన్స్ ప్రీమియంలపై డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు.
పాలసీ నిబంధనలు
ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆయా కంపెనీలు, పాలసీల ఆధారంగా నిబంధనలు, షరతులు ఉంటాయి. పాలసీని సరెండర్ చేసే వ్యవధి, పాలసీ కొనుగోలు సమయం, ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు వేరుగా ఉండవచ్చు. ఉదాహరణకు సింగిల్ ప్రీమియం ప్లాన్ కింద కొనుగోలు చేసిన పాలసీని రెండో సంవత్సరంలో మాత్రమే సరెండర్ చేయొచ్చు. పాలసీ టెన్యూర్ పదేళ్లు లేదా అంతకంటే తక్కువ ఉంటే మినిమం సరెండర్ పీరియడ్ రెండేళ్లు. పాలసీ టెన్యూర్ పదేళ్లు దాటితే, దాని సరెండర్ వ్యవధి మూడేళ్లు. పాలసీ తీసుకునే ముందు ఈ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.
2024 ఆగస్టు నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In August 2024