Voluntary Provident Fund Benefits : ఉద్యోగులు అందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి తెలిసే ఉంటుంది. ఉద్యోగి బేసిక్ సాలరీ నుంచి 12 శాతాన్ని 'ఉద్యోగి భవిష్య నిధి ఖాతా' (ఈపీఎఫ్)లో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని సదరు యాజమాన్యం లేదా సంస్థ కూడా జోడిస్తుంది. దీని వల్ల ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత భారీ నిధి అతని చేతికి అందుతుంది.
ఈపీఎఫ్‌లో జమ చేసిన డబ్బులపై 2023-24 సంవత్సరానికి 8.25% శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీల కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.
వీపీఎఫ్ అంటే ఏమిటి?
ఈపీఎఫ్‌లో డబ్బులు జమ చేస్తున్న ఉద్యోగులకు మరో ఆప్షన్ కూడా ఉంది. అదే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్). దీని వల్ల అధిక వడ్డీతోపాటు, పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఈ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. పేరుకు తగ్గట్టుగానే ఇందులో డబ్బులు జమ చేయాలా? వద్దా? అనేది ఉద్యోగి ఇష్టం. ఒక వేళ ఉద్యోగి వీపీఎఫ్‌లో డబ్బులు జమ చేయాలని అనుకుంటే, సదరు డబ్బులు అతని ఈపీఎఫ్ ఖాతాలోనే జమ అవుతాయి. అంటే నెలనెలా ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే 12 శాతం డబ్బులకు, అదనపు సొమ్మును జోడించడానికి వీలు పడుతుంది. ఈపీఎఫ్ నిధికి వర్తించే వడ్డీయే దీనికీ కూడా లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే గరిష్ఠంగా మూల వేతనం+ డీఏకు సమానమైన మొత్తాన్నే వీపీఎఫ్‌నకు జమ చేసేందుకు వీలవుతుంది. ఈపీఎఫ్ తరహాలోనే ఈ వీపీఎఫ్‌నకు కూడా 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. పదవీ విరమణ, వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం లాంటి అవసరాలు ఏర్పడినప్పుడు ఈ వీపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Voluntary Provident Fund Benefits :
- ఎక్కువ వడ్డీ : వీపీఎఫ్‌లో జమ చేసిన డబ్బుపై అధిక వడ్డీ వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఖరారైంది. ఇంతకు ముందు ఏడాది ఈ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కానీ ఈ వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోయే అవకాశం తక్కువ. గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతం కంటే తగ్గలేదు. అంటే బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో (7.1%) పోల్చి చూస్తే, ఈపీఎఫ్ వడ్డీ రేట్లు ఎక్కువే అని చెప్పవచ్చు.
- ట్యాక్స్ బెనిఫిట్స్ : ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక ఏడాదిలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఈ పన్ను మినహాయింపు పొందవచ్చు.
- మెచ్యూరిటీపైనా పన్నులు లేవు : సాధారణ పెట్టుబడి మార్గాల్లో మూలధన లాభాలపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. కానీ వీపీఎఫ్‌లో చేసే మదుపు పూర్తిగా పన్ను రహితం. అంటే మెచ్యూరిటీ డబ్బుపై కూడా పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.
- సెక్యూరిటీ : ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ & రివార్డ్ రెండూ ఉంటాయి. కానీ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుంది. కనుక ఉద్యోగుల సొమ్ముకు, రాబడికి ఎలాంటి ఢోకా ఉండదు.
- పొదుపు అలవాటు : చాలా మందికి పొదుపు చేయడం తెలియదు. చేతికి సొమ్ము వచ్చిన వెంటనే ఖర్చులు చేసేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ వీపీఎఫ్ బాగా ఉపయోగపడుతుంది.
వీపీఎఫ్‌లో ఎలా జమ చేయాలి?
వీపీఎఫ్‌లో అదనపు డబ్బులు జమ చేయడం చాలా సులువు. ఇందుకోసం ముందుగా మీ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌ను కలవాలి. మీ వీపీఎఫ్‌నకు ఎంత సొమ్ము జమ చేయాలనుకుంటున్నారో తెలుపుతూ ఓ దరఖాస్తు ఇవ్వాలి. అంతే సింపుల్. ఇక అక్కడ నుంచి ప్రతి నెలా సదరు మొత్తాన్ని మినహాయించుకుని, మిగిలిన వేతనాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు.
ఈ విషయాలు గుర్తించుకోండి!
వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేయడం వల్ల మీ చేతికి వచ్చే నెలవారీ జీతం తగ్గుతుంది. అందువల్ల ఇంటి అవసరాలకు ఎంత డబ్బు అవసరం అవుతుందో లెక్కవేసుకోవాలి. అత్యవసర నిధికి కూడా కొంత మొత్తం కేటాయించాలి. ఆ తరువాతనే వీపీఎఫ్‌లో ఎంత మొత్తం జమ చేయాలో నిర్ణయించుకోవాలి.
ఇన్స్టాంట్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలా? ఈ టాప్-9 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!