Types Of Business Loans In India : ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలకంటే, సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ వ్యాపారం చేయడం అంత సులువు కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొవాలి. కొన్నిసార్లు సొంత కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే, అన్ని విషయాలు ముందుగానే ఆలోచించాల్సి ఉంటుంది. సాధారణంగా వ్యాపారం ప్రారంభించేందుకు చాలా డబ్బు అవసరం అవుతుంది. అందుకే చాలా మంది బ్యాంకు రుణాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మరి మీరు కూడా బిజినెస్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అది ఏమిటంటే, మన దేశంలో ప్రధానంగా 8 రకాల బిజినెస్ లోన్స్ అందిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1) వర్కింగ్ క్యాపిటల్ లోన్ :
వ్యక్తులు, వ్యవస్థాపకులు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు తమ రోజువారీ వ్యాపార అవసరాలను తీర్చుకునేందుకు వర్కింగ్ క్యాపిటల్ తీసుకుంటారు/యి. ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను వ్యాపార విస్తరణ చేయడం, వ్యాపార నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడం, ముడి పదార్థాల కొనుగోలు, అదనపు ఇన్వెంటరీ/స్టాక్‌లు ఏర్పరుచుకోవడం, జీతాలు చెల్లించడం, సిబ్బందిని నియమించుకోవడం మొదలైన పనుల కోసం ఉపయోగిస్తారు. వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లు ప్రధానంగా స్వల్పకాలిక రుణాలు. ఇండియాలో వర్కింగ్ క్యాపిటల్ గరిష్ఠంగా రూ.40 లక్షల వరకు ఇస్తారు. దీనిని 12 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ గడువును పొడిగించుకోవచ్చు కూడా. దీర్ఘకాలిక రుణాలతో పోల్చితే, ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్‌పై బ్యాంకులు/NBFCలు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. అయితే ఈ వర్కింగ్ క్యాపిటల్‌ను బ్యాంక్ నిర్దేశించిన అంశాలపైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2) టర్మ్ లోన్ :
టర్మ్ లోన్ అనేది నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించాల్సిన రుణం. టర్మ్ లోన్ స్వల్పకాలిక, ఇంటర్మీడియట్, దీర్ఘకాలిక రుణాలుగా వర్గీకరించారు. ఈ టర్మ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 12 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. 12 నెలల తక్కువ వ్యవధిలో ఉండే టర్మ్ లోన్‌లను షార్ట్-టర్మ్ లోన్స్ అంటారు. 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి గల లోన్‌లను దీర్ఘకాలిక రుణాలు అని పిలుస్తారు. ఎలాంటి తాకట్టు లేకుండా (కొలేటరల్-ఫ్రీ) బిజినెస్ లోన్‌లు రూ.2 కోట్ల వరకు అందిస్తారు. వ్యాపార అవసరాలను బట్టి ఈ రుణ మొత్తం పెంచే అవకాశం కూడా ఉంటుంది. రుణదాతలు ఈ టర్మ్ లోన్ రీపేమెంట్ వ్యవధిని ఖరారు చేస్తారు.
3) లెటర్ ఆఫ్ క్రెడిట్ :
లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్యాల్లో ప్రధానంగా ఉపయోగించే ఒక రకమైన క్రెడిట్ సౌకర్యం. లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను వ్యవస్థాపకులు దిగుమతి, ఎగుమతి వ్యాపారాల కోసం ఉపయోగిస్తారు. సాధారణంగా విదేశాలతో వ్యాపారం చేసే సంస్థలు, తమకు తెలియని సంస్థలు, లేదా సరఫరాదారులతో వ్యవహారాలు చేస్తుంటాయి. అందువల్ల ఏదైనా లావాదేవీని నిర్వహించే ముందు వారికి చెల్లింపు హామీ అవసరం. దీని కోసం బ్యాంకులు లేదా రుణ సంస్థలు లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను అందిస్తాయి.
4) బిల్ డిస్కౌంటింగ్ :
బిల్లు లేదా ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అనేది ఒక ప్రత్యేకమైన రుణ సదుపాయం. ఉదాహరణకు మీరు బ్యాంక్ నుంచి 45 రోజుల కోసం రూ.10 లక్షల రుణం తీసుకోవాలని అనుకున్నారు. అప్పుడు బ్యాంక్ ముందుగానే రూ.50,000 మినహాయించుకుని, మీకు రూ.9,50,000 అందిస్తుంది. అంటే ముందుగానే తమకు రావాల్సిన వడ్డీని మినహాయించుకుంటుంది. మీరు 45 రోజుల గడువు ముగిసిన తరువాత బ్యాంక్‌కు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
5) ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ :
బ్యాంకులు తమ ఖాతాదారులకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తుంటాయి. దీనిని ఉపయోగించుకుని తమ ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా, పరిమితి మేరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఓవర్‌డ్రాఫ్ట్‌పై రోజువారీగా వడ్డీ వసూలు చేస్తారు. సాధారణంగా బ్యాంక్‌తో ఖాతాదారునికి ఉన్న సంబంధం, క్రెడిట్ చరిత్ర, మనీ ట్రాన్సాక్షన్, తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా ఈ ఓవర్‌డ్రాఫ్ట్ ఎంత ఇవ్వాలనేది నిర్ణయమవుతుంది. ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని ప్రతి సంవత్సరం సవరిస్తుంటారు. సకాలంలో వడ్డీ చెల్లిస్తూ ఉంటే, ఓవర్‌డ్రాఫ్ట్ మనీని మీకు నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు.
6) ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్/ మెషినరీ లోన్ :
బ్యాంకులు లేదా రుణ సంస్థలు - రుణగ్రహీతలకు కొత్త పరికరాలు/మెషినరీని కొనుగోలు చేయడానికి ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లేదా మెషినరీ లోన్ అందిస్తూ ఉంటాయి. ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ ప్రధానంగా పెద్దపెద్ద సంస్థలు, తయారీ రంగ సంస్థలు వాడుకుంటూ ఉంటాయి. దీని వల్ల వాటికి పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే ఆయా రుణదాతలు, రుణగ్రహీతలను బట్టి వీటిపై విధించే వడ్డీ రేట్లు, లోన్ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధి మారుతూ ఉంటాయి.
7) లోన్స్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్ :
భారత ప్రభుత్వం వ్యక్తులు, MSMEలు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం; వాణిజ్యం, సేవలు, తయారీ రంగాలలో నిమగ్నమైన సంస్థల కోసం వివిధ రుణ పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, NBFCలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBలు), మైక్రో ఫైనాన్స్ సంస్థలు (MFIలు), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBలు) ప్రభుత్వ పథకాల కింద రుణాలను అందిస్తున్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ముద్రా స్కీమ్ (PMMY) , PMEGP , CGTMSE , స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, PSB లోన్స్ ఇన్ 59 మినిస్ట్ , PMRY మొదలైనవి ఉన్నాయి.
8) పాయింట్ ఆఫ్ సేల్ (POS) లోన్స్ : రిటైల్ షాపులు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ నడిపేవారికి రోజువారీ అవసరాల కోసం, లేదా స్వల్ప కాల అవసరాల కోసం రుణాలు కావాల్సి ఉంటుంది. ఇలాంటివారి అవసరాలు తీర్చడం కోసమే బ్యాంకులు 'పాయింట్ ఆఫ్ సేల్ లోన్స్' అందిస్తూ ఉంటాయి. అయితే మిగతా రుణాలతో పోలిస్తే వీటిపై విధించే వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. సాధారణంగా రిటైల్ షాపులు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌లో ఇన్‌స్టాల్ చేసిన డెబిట్/ క్రెడిట్ లావాదేవీల పాయింట్ ఆఫ్ సేల్స్ (POS) మెషీన్‌లతో రీపేమెంట్ సదుపాయం లింక్ చేసి ఉంటుంది.
గవర్నమెంట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి! - RBI Retail Direct Scheme
రూ.100 ఉంటే చాలు - రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు - ఎలా అంటే? - How To Invest In REITs