Tata Group Successors : దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుముశారు. ఆయన వ్యక్తిగత సంపద విలువ రూ.3600 కోట్లు. అయితే ఆయనకు వారసులు లేనందున, భవిష్యత్‌లో టాటా గ్రూప్ సామ్రాజ్యాని టాటా కుటుంబం తరఫున ఎవరు సారథ్యం వహిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రతన్ టాటా వారసుల రేసులో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
నోయెల్ టాటా
రతన్ టాటా తండ్రి నావల్ టాటా. ఆయన రెండో భార్య సిమోన్ కుమారుడే నోయెల్ టాటా. ప్రస్తుత పరిస్థితుల్లో నోయెల్ టాటాను ఈ వారసత్వాన్ని అందుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరుగా చెప్పొచ్చు. నోయెల్ టాటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు - మాయ, నెవిల్లే, లేహ్ టాటా. వీరిలో ఒకరు టాటా గ్రూపునకు వారసులు అయ్యే అవకాశాలున్నాయి.
నెవిల్లే టాటా
కుటుంబ వ్యాపారంలో చురుకుగా ఉన్నవారిలో నెవిల్లే టాటా ఒకరు. ట్రెంట్ లిమిటెడ్ కింద ఉన్న స్టార్ బజార్ అనే రిటైల్ స్టోర్ చెయిన్ కంపెనీకి ఆయనకు సారథ్యం వహిస్తున్నారు. కిర్లోస్కర్ కుటుంబానికి చెందిన మాన్సీ కిర్లోస్కర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు.
లేహ్ టాటా
స్పెయిన్‌లోని ఐఈ బిజినెస్ స్కూల్‌లో చదివిన లేహ్ టాటా ఇండియన్ హోటల్, తాజ్ హోటల్స్‌ను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మాయా టాటా
టాటా గ్రూప్‌లో కీలక పదవిలో మాయా కొనసాగుతున్నారు. బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో విద్యాభ్యాసం చేశారు. టాటా ఆపర్చూనిటీస్ ఫండ్ అండ్ టాటా డిజిటల్‌లో ఆమె కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా, తన బలమైన వ్యూహాత్మక నాయకత్వంతో టాటా కొత్త యాప్ Tata Neu App ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు.
21 లక్షల కోట్ల విలువైన కంపెనీ!
Tata Group Net Worth : టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ రూ.20,71,467 కోట్లు. 2023 మార్చి 31న వెలువరించిన వార్షిక నివేదిక ప్రకారం, వీటిలో టాటా సన్స్ కంపెనీ మాత్రమే రూ.11,20,575.24 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉంది.