Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాలను చవిచూశాయి. దీనితో మదుపరులు ఏకంగా రూ.14 లక్షల కోట్లు మేర నష్టపోయారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాలు ఉండడం, పశ్చిమాసియాలో నానాటికీ ఉద్రిక్తతలు పెరుగుతుండడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, వివిధ కంపెనీలు విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు ఏ మాత్రం ఉత్సాహభరితంగా లేకపోవడం వల్ల మదుపరులు కూడా డీలా పడ్డారు. ఇవన్నీ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేశాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2222 పాయింట్లు నష్టపోయి 78,759 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 662 పాయింట్లు కోల్పోయి 24,055 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : హిందూస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా
- నష్టపోయిన షేర్లు : టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్
1.10 PM : దేశీయ స్టాక్ మార్కెట్లు బేర్ గుప్పిట్లో చిక్కుకున్నాయి. దీనితో ఇప్పటికే మదుపరుల సంపద ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2434 పాయింట్లు నష్టపోయి 78,547 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 724 పాయింట్లు కోల్పోయి 23,992 వద్ద ట్రేడవుతోంది.
12.50 PM : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి. దీనితో మదుపరుల సంపద ఆవిరవుతోంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2543 పాయింట్లు నష్టపోయి 78,439 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 765 పాయింట్లు కోల్పోయి 23,952 వద్ద ట్రేడవుతోంది.
Stock Market Today August 5, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మాంద్యం భయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు మన స్టాక్ మార్కెట్ సూచీలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2,401 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 489 పాయింట్లు కోల్పోయింది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1418 పాయింట్లు నష్టపోయి 79,563 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 427 పాయింట్లు కోల్పోయి 24,290 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు
- సెన్సెక్స్-30 సూచీలో సన్ ఫార్మా, హెచ్‌యూఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉండడం గమనార్హం.
- టాటా మోటార్స్, మారుతీ, టైటన్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
మాంద్యం భయాలు అలుముకుంటున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గతవారం భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 7 శాతానికి పైగా నష్టపోవడం గమనార్హం. ఈ ప్రాంతంలోని ఇతర ప్రధాన సూచీల పరిస్థితి సైతం అలాగే ఉంది.
విదేశీ పెట్టుబడులు : విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.3,310 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.2,966 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
Rupee Open August 5, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.80 వద్ద ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
ముడి చమురు ధర
Crude Oil Prices August 5, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.35 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 77.08 డాలర్లుగా ఉంది.