Second Hand Luxury Cars Pros And Cons : చాలా మందికి లగ్జరీ కారు కొనుగోలు చేయాలనే కల ఉంటుంది. కానీ భారీ మొత్తంలో ధర చెల్లించి కొత్త కారు కొనుగోలు చేసే శక్తి వారికి ఉండదు. అందుకే కనీసం సెకెండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇలా సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనడం లాభదాయకంగా ఉంటుందా? లేదా?
ఈ మధ్యకాలంలో సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల మార్కెట్ భారత్‌లో ఏటా 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతోంది. సగటున ఏడాదికి 60వేలకు పైగా యూజ్డ్ లగ్జరీ కార్ల విక్రయాలు జరుగుతున్నాయి. వివిధ కార్ల కంపెనీలు కూడా సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల అమ్మకాల కోసం, అనేక షోరూంలను తెరుస్తున్నాయి. అంతేకాదు బ్యాంకు లోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. అయితే ఈ సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల కొనుగోలు వల్ల లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తరుగుదల :
లగ్జరీ కారు ధర ఎక్కువగానే ఉంటుంది. అయితే కొత్త కారు షోరూం నుంచి బయటకు వచ్చిన వెంటనే, దాని విలువ మార్కెట్లో తగ్గుతుంది. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో కారు ధర 15 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గిపోతుంది. 5 ఏళ్ల తర్వాత అది సగం విలువను కోల్పోతుంది. అదే విధంగా తరుగుదల రేటు కూడా టైమ్ గడుస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇది కొత్త కార్లను కొనుగోలు చేసిన యజమానులకు నష్టమే. కానీ వారి నుంచి సదరు లగ్జరీ కారును కొనుగోలు చేసేవారికి మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుంది. అందుకే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొత్త కారు కొనలేనివారికి సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు మంచి ఆప్షన్ అవుతుంది.
తక్కువ ధరతోనే లగ్జరీ కారు :
సాధారణ కారు కొనుగోలుకు అయ్యే బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ డబ్బులు పెడితే, సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు లభిస్తుంది. ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడీస్ బెంజ్, ల్యాండ్ రోవర్ లాంటి బ్రాండ్ల సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు సగటు ధర రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుంది. ఇవే కొత్తవి అయితే రూ.50 లక్షల నుంచి రూ.65 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి. ఉదాహరణకు కొత్త బీఎండబ్ల్యూ 3 సిరీస్ 320డి లగ్జరీ ఎడిషన్ ధర రూ.60.50 లక్షలు ఉంటుంది. కానీ అదే 2015 మోడల్ కారును కేవలం రూ.21 లక్షల నుంచి రూ.22 లక్షలతో కొనుగోలు చేయవచ్చు. ఇది కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా, హ్యుందాయ్ వెర్నా ఎస్ఎక్స్ ధరతో దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి ప్రీ-ఓన్డ్ లగ్జరీ కారు కొనుగోలు కచ్చితంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు.
లేటెస్ట్ ఫీచర్స్ :
కారు కొనుగోలు చేసేవారు అందులో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని ఆశిస్తారు. అందుకే ఎక్కువగా లగ్జరీ కార్లవైపు మొగ్గుచూపుతారు. సాధారణ కార్లతో పోలిస్తే లగ్జరీ కార్లు చాలా సురక్షితమని చెప్పవచ్చు. లగ్జరీ కార్లలో 6/7ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీ కెమెరా, యాంటీ థెఫ్ట్ ఫీచర్లు ఉంటాయి. అలాగే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఎనేబుల్ చేయడానికి కార్లు ఆటోమెటిక్ అండ్ లేటెస్ట్ సెన్సార్లను కలిగి ఉంటాయి. నాన్ లగ్జరీ కార్లలో లేని ఫీచర్లు సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్లలో ఉంటాయి. కనుక వీటిని కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉంటుంది.
ఇన్సూరెన్స్ :
సెకెండ్ హ్యాండ్ కార్లకు ఇన్సూరెన్స్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కారు ఏజ్‌ను పరిగణనలోనికి తీసుకుంటే, బీమా ప్రీమియం స్థిరంగా తగ్గుతూనే ఉంటుంది. బీమా కోసం చెల్లించాల్సిన మొత్తం కూడా కారు ప్రస్తుత విలువపై ఆధారపడుతుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరమ్మతులకు అయ్యే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే బీమా కంపెనీలు కొత్త వాహనాలకు అధిక ప్రీమియం వసూలు చేస్తుంటాయి. ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్ల ధరలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి బీమా ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. కారుపై మీరు ఎలాంటి క్లెయిమ్స్ చేయకపోతే ఎన్సీబీ బెనిఫిట్ కూడా పొందవచ్చు.
మెయింటెనెన్స్ :
లగ్జరీ కార్ల యాజమానులు తమ సొంత పనులకు మాత్రమే వాటిని ఉపయోగిస్తుంటారు. సాధారణంగా వాటిని ఇతరులకు ఇవ్వరు. అందువల్ల సదరు లగ్జరీ కార్లు పాడయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కార్లను మార్కెట్లో కొనుగోలు చేసిన వారికి, భవిష్యత్తులో పెద్దగా మెయింటెనెన్స్ ఖర్చలు ఉండకపోవచ్చు. అయితే ఇది అన్ని కార్లకు వర్తించదని గుర్తుంచుకోవాలి.
వెయిటింగ్ పీరియడ్:
కొత్త లగ్జరీ కారు కొనాలంటే, దానికి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. పైగా పన్నులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అదే సెకెండ్ హ్యాండ్ కారు అయితే ఆయా కంపెనీల షోరూంల నుంచి వెంటనే తీసుకోవచ్చు. అక్కడే నచ్చిన మోడళ్లను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రీ-ఓన్డ్ కారు షోరూంలు కూడా పాత లగ్జరీ కారు కొనుగోలుపై బ్యాంకు లోన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని ప్రీ-ఓన్డ్ కార్ల ఏజెన్సీలు సెకెండ్ హ్యాండ్ కార్ల క్వాలిటీని వీలైనంత వరకు కొత్త కారుతో సమానంగా ఉండే విధంగా చూస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక ఏడాది నుంచి రెండేళ్లపాటు వారంటీని కూడా అందిస్తున్నాయి.
ఈ సమస్యలు కూడా ఉంటాయ్!
లగ్జరీ కార్లలో ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ కార్లు చాలా ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. కనుక తక్కువ ధరలో సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారును కొనుగోలు చేసినా, ఇంధనం, మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. లగ్జరీ కారు లోపల, వెలుపల అందంగా ఉంటాయి. అయితే అందులో అనేక సంక్లిష్టమైన ఫీచర్లు ఉంటాయి. సెన్సార్లు, కంట్రోలర్స్, డ్రైవింగ్ మోడ్స్ లాంటి పలు హైటెక్ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిని కూడా సరిగ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిలో ఏవైనా సమస్యలుంటే వస్తే, వాటిని రిపేర్ చేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. లగ్జరీ కార్ల నిర్వహణ ఖర్చు ఏడాదికి రూ.80 వేలు నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. కనుక లగ్జరీ కారును కొనుగోలు చేసేముందు, కచ్చితంగా నిపుణులతో చెక్ చేయించాలి. ముఖ్యంగా బ్యాటరీలు, సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్, హైటెక్ ఫీచర్లను చెక్ చేసుకోవాలి.
ముకేశ్ అంబానీ కార్ కలెక్షన్ చూశారా? చూస్తే మతిపోవాల్సిందే! - Mukesh Ambani Car Collection