SBI Digital MSME Loan In 45 Minutes : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిజిటల్ బిజినెస్ లోన్స్ ప్రారంభించింది. దీని ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)కు కేవలం 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. రానున్న 5 ఏళ్లలో ఈ ఎంఎస్ఎంఈ విభాగం బాగా అభివృద్ధి చెందుతుందని, కనుక లాభాలు కూడా భారీ స్థాయిలో వస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఈ)లకు ఏకంగా రూ.4.33 లక్షల కోట్ల వరకు రుణాలు మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన మొత్తంతో పోల్చితే ఇది దాదాపు 20 శాతం అధికం కావడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఎంఎస్ఈ విభాగంలో స్థూల నిరర్థక ఆస్తులు 2019-20లో 9.43 శాతం ఉండగా, అవి 2023-24 నాటికి 3.75 శాతానికి తగ్గాయని ఎస్‌బీఐ వెల్లడించింది.
వేగంగా రుణాలు మంజూరు!
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అధికంగా రుణాలు ఇచ్చి, ఈ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామి ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందని, దానిని విశ్లేషించి రుణ ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా ప్రారంభించిన ఈ డిజిటల్ బిజినెస్ లోన్స్ విధానం వల్ల సంప్రదాయంగా వస్తున్న క్రెడిట్ అండర్ రైటింగ్, సుదీర్ఘమైన పరిశీలన మొదలైన సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల లోన్ ప్రక్రియ చాలా సరళతరం అవుతుంది. ఫలితంగా చిన్న పరిశ్రమలకు వేగంగా లోన్స్ మంజూరు చేయడానికి వీలవుతుంది.
కేవలం 10 సెకెన్లలోనే లోన్!
డేటా ఆధారిత రుణ మంజూరు సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు ఎస్‌బీఐ తెలిపింది. దీని ద్వారా కేవలం 10 సెకెన్లలోపే రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్నులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు మొదలైనవాటితో పాటు, అవసరమైన వివరాలను సమర్పిస్తే చాలు. కేవలం 10 సెకన్లలోపే రుణం మంజూరు చేయాలా? వద్దా? అనేది సిస్టమ్ నిర్ణయిస్తుంది. ఈ విధంగా వేగంగా లోన్ మంజూరు చేయడానికి వీలవుతుంది.
ప్రస్తుతానికి రూ.50 లక్షల లోపు రుణాలకు ఎలాంటి ఆర్థిక నివేదికల అవసరం లేదని, కేవలం జీఎస్‌టీ రిటర్నులు సమర్పిస్తే చాలని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
'ఎస్బీఐతో అనుబంధం ఉన్న సంస్థలతో పాటు, కొత్తవి కూడా 45 నిమిషాల్లోనే సూత్రప్రాయంగా రుణ అనుమతి పొందేలా డిజిటల్ బిజినెస్ లోన్స్ విభాగం తోడ్పడుతుంది' అని ఎస్‌బీఐ రిటైల్ బ్యాంకింగ్, ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వినయ్ టోన్సే వెల్లడించారు.
రూ.20 వేల కోట్లు సమీకరణ!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.25,000 కోట్లు (3 బిలియన్ డాలర్లు) సమీకరించాలని ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు అనుమతి కూడా లభించినట్లు మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ ఆఫర్, సెక్యూరిటీ లేని రుణపత్రాల జారీ ద్వారా సమీకరించనున్నట్లు తెలిపింది. అమెరికా డాలర్ లేదా ఇతర దేశాల కరెన్సీ రూపాల్లో ఈ రుణ పత్రాలు ఉంటాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
హోమ్ లోన్ త్వరగా తీర్చేయాలా? ఈ టాప్-5 టిప్స్ మీ కోసమే! - How to pay home loan faster