Retirement Planning : రిటైర్మెంట్ అనేది జీవితంలో ఎవరికైనా ఒక ముఖ్యమైన మైలురాయి. కానీ, చాలామందికి పదవీ విరమణ తర్వాత ఖర్చులను తట్టుకోవడానికి తగిన ప్రణాళిక ఉండదు. భారత్‌లో మెజారిటీ ప్రజలకు రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేయాలో ఇప్పటికి తెలియదట. ఇటీవల ఓ ప్రైవేటు బీమా సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం, నలుగురిలో ముగ్గురు భారతీయులు తమ పదవీ విరమణ కోసం పొదుపు చేయడంలో విఫలమవుతున్నారట. ఇలాంటి వారు తమ చివరి అంకంలో పిల్లలపై ఆధారపడుతున్నట్లు తేలింది. ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే, పటిష్ఠమైన రిటైర్మెంట్ పెట్టుబడి ప్లాన్ ఉండాల్సిందే.
రిటైర్మెంట్ ప్లాన్
వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వం, ఇండిపెండెంట్‌గా ఉండటం కోసం రిటైర్మెంట్ ప్లాన్ చాలా కీలకం. పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం రావడం ఆగిపోతుంది కనుక ఏళ్ల తరబడి చేసిన పొదుపు మాత్రమే ఆదాయ వనరుగా మిగులుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ తర్వాత జీవితం కోసం బాగా ఆలోచించదగిన పదవీ విరమణ ప్లాన్‌ను కలిగి ఉండాలి. తద్వారా పదవీ విరమణ తర్వాత క్రమమైన ఆదాయం లేనప్పుడు, పాత జీవనశైలి ఏ మాత్రం తగ్గకుండా కొనసాగించడానికి వీలు కలుగుతుంది. పదవీ విరమణ జీవితంలో ఆరోగ్య సంరక్షణ, ప్రయాణాలు, విశ్రాంతి కార్యకలాపాలు వంటి ఖర్చులను కవర్ చేయడానికి గణనీయమైన పొదుపు అవసరం. రిటైర్మెంట్ ఫండ్‌ను నిర్ణయించేటప్పుడు మీ ప్రస్తుత జీవనశైలి, అభిరుచులు, ఆసక్తులు, పదవీ విరమణ తర్వాత మీ అవసరాలు, మీపై ఆధారపడిన వారి సంఖ్య మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఏడాది పెరిగే ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు.
ఆయుర్ధాయం
రిటైర్మెంట్ తర్వాత జీవించే కాలం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వైద్యరంగలో వచ్చిన పురోగతి వల్ల పురుషులు, మహిళలు అందరికీ ఆయుర్ధాయం పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ విధానాలు మెరుగవ్వడం వల్ల జనాభాలో సగానికి పైగా 78, అంతకంటే ఎక్కువ ఏళ్లు జీవిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో ఆయుర్ధాయంలో పెరుగుదల భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. దీంతో రిటైర్మెంట్ అయినవారు ఎంత ఎక్కువ కాలం జీవిస్తారో, అంత డబ్బు అవసరం అవుతుంది. సుదీర్ఘ జీవితకాలం కోసం సిద్ధం కావడానికి ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయాల్సి ఉంటుంది.
ఆరోగ్య
రిటైర్మెంట్ తర్వాత జీవన వ్యయాలలో వైద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు చాలా ముఖ్యమైన అంశం. ఆదాయంలో దాదాపు 15 నుంచి 20శాతం ఖర్చులు రూపంలో సాధారణ ఆరోగ్య సంరక్షణ కోసం అవుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతాయే గానీ తగ్గవు. ప్రతి రోజూ మందులు, ఆరోగ్య పరీక్షలు, ట్రీట్‌మెంట్స్, కొన్ని దశల్లో ఒక మెడికల్ అటెండెంట్‌ను కూడా నియమించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఖర్చులను ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలి. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం దాదాపు 14%. అందువల్ల పదవీ విరమణ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం ప్రత్యేక నిధిని కలిగి ఉండడం చాలా అవసరం.
పెట్టుబడి ఎక్కడ
సాధారణంగా రిటైర్మెంట్ ప్లాన్స్‌కు అనువుగా రకరకాల పెట్టుబడి మార్గాలున్నాయి. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) వంటి స్థిర రాబడిని అందించే పన్ను ప్రయోజనాన్ని అందించే సంప్రదాయ పథకాలు కూడా ఉన్నాయి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్‌ఎస్‌ఎస్)లు అయితే ఎక్కువ రిస్క్‌తో కూడినప్పటికీ, దీర్ఘకాలికంగా అధిక రాబడి అందుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం కూడా ఎక్కువ పదవీ విరమణ నిధిని సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ఉదాహరణకు యాన్యుటీ రిటైర్మెంట్ ప్లాన్‌లో పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. వివిధ పథకాల మదుపు డిపాజిట్లు కాంపౌండింగ్ ప్రయోజనంతో పెట్టుబడులపై స్థిరమైన ఫలితాన్ని అందిస్తాయి. అయితే, రిస్క్‌ను తగ్గించడానికి, మంచి రాబడిని పెంచుకోవడానికి మీ పెట్టుబడులను వైవిధ్యపర్చడం ఎంతో కీలకం.
ముందుగానే మదుపు
రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తుకునే సమయంలో మీ ఇన్వెస్ట్మెంట్లను వ్యూహాత్మకంగా లెక్కించడం కూడా అవసరమే. మీ పదవీ విరమణ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, రిటైర్మెంట్ తర్వాత ఎంత డబ్బు అవసరమో లెక్కించడం, దీనికి పొదుపులను పెంచుకోవడానికి పెట్టుబడులు పెట్టడం లాంటివి ఈ ప్లాన్‌లో ఉండాలి. పదవీ విరమణ ప్రణాళికలో మదుపును క్రమశిక్షణతో ముందుగానే ప్రారంభించడం ద్వారా మనకు అధిక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. కాలక్రమేణా గణనీయమైన పదవీ విరమణ నిధిని కూడా మీరు సమకూర్చుకోవచ్చు. ఉపాధి పొందిన ప్రారంభంలోనే వీలైనంత త్వరగా పదవీ విరమణ వ్యూహాన్ని అమలు చేయడం కూడా ఎవరికైనా ఉత్తమమే.
ఉదాహరణకు 30వ ఏటనే ప్రతి నెలా రూ.10 వేలను మదుపు చేయడం ప్రారంభించి 60 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆ ముదుపును అలాగే కొనసాగిస్తే 12% రాబడితో దాదాపు రూ.3.53 కోట్లు మీరు ఈజీగా సమకూర్చుకోవచ్చు. అదే 40వ ఏటన రూ.10 వేలతో మదుపు ప్రారంభిస్తే అప్పుడు మీకు రూ.1 కోటి మాత్రమే సమకూర్చుకునే వీలుంటుంది. దీనివల్ల దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండానే పదవీ విరమణ పొందినవారు పలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా వారి జీవన నాణ్యతపై రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎమర్జెన్సీ ఫండ్
ఉద్యోగం చేసేటప్పుడే కాదు రిటైర్మెంట్ తర్వాత కూడా అత్యవసర నిధి అవసరం చాలా ఎక్కువగానే ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం సర్వసాధారణం. ఇక వారికి ఆరోగ్య బీమా ఉన్న కూడా పలు షరతులు, నియమ నిబంధనలు వర్తిస్తాయి. అందుకే ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తితే, తగిన చికిత్సను పొందటానికి ఎవరికైనా డబ్బు అవసరం కావచ్చు. సరైన రిటైర్మెంట్ ప్లాన్‌తో, ఊహించని పరిస్థితులను నిర్వహించడానికి అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి.
రుణ బకాయిలు
పదవీ విరమణ ప్రణాళిక వల్ల ఆర్థిక భద్రతతో పాటు అనేక ప్రయోజనాలూ చేకూరుతాయి. రిటైర్మెంట్ తర్వాత మన లైఫ్స్టైల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి చేయడానికి ప్రతి ఒక్కరూ 60 ఏళ్లు వచ్చేనాటికి రుణ రహితంగా పదవీ విరమణ చేయాలనే లక్ష్యంతో ఉండాలి. ముఖ్యంగా అధిక వడ్డీ వసూలు చేసే క్రెడిట్ కార్డు రుణాలు, కారు, తనఖా రుణాలు, పిల్లల విద్యా రుణాలు ఇటువంటివి లేకుండా చూసుకోవాలి. మీ రిటైర్మెంట్ తర్వాత అప్పులు లేకుండా చూసుకోవడమనేది మీకు ఎంతో ఆర్థిక భద్రతనిస్తుంది. దానివల్ల మనశ్శాంతి లభించడమే కాకుండా, అభిరుచులు, ఆసక్తులను చివరి వరకు కొనసాగించడానికి మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. మీ వారసులపై ఆర్థిక భారం పడకుండానూ ఇది చూసుకుంటుంది.
భవిష్యత్‌కు భరోసా కావాలా? ఈ టాప్-5 పెన్షన్ స్కీమ్స్‌పై ఓ లుక్కేయండి! - Top 5 Pension Plans In India