RBI asks NPCI To Help Paytm : పేటీఎం తన కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు సహకరించాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ను ఆర్‌బీఐ శుక్రవారం కోరింది. పేటీఎం యాప్‌లో యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా, ఎన్పీసీఐ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ హోదా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని అడిగింది. ఈ మేరకు పేటీఎం మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) అభ్యర్థించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో '@paytm' ఐడీతో యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్నవారు, ఇక ముందు పేటీఎం యాప్‌లో డిజిటల్ చెల్లింపులు కొనసాగించే అంశాన్ని పరిశీలించాలని NPCIని ఆర్‌బీఐ కోరింది. ఇందుకోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP) స్టేటస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలంది. ఒకవేళ ఈ హోదా లభిస్తే పేటీఎం మున్ముందూ యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేసే వీలుంటుంది. అలాగే, @paytmను ఇతర బ్యాంకులకు మార్చుకునేందుకు వీలుగా అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే సామర్థ్యం కలిగిన నాలుగైదు బ్యాంకులకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్‌పీసీఐకు వెసులుబాటు కల్పించింది.
నోడల్ ఖాతా మార్చిన పేటీఎం
ఈ నేపథ్యంలో క్యూ ఆర్ పేమెంట్లకు, సౌండ్ బాక్స్, కార్డ్ మిషన్ సేవలు మార్చి 15 తర్వాత కూడా కొనసాగేందుకు పేటీఎం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పేటీఎం తన నోడల్ ఖాతాను యాక్సిస్ బ్యాంక్‌కు మార్చింది. ఇలా చేయడం ద్వారా మర్చంట్ లావాదేవీలు సజావుగా సాగేందుకు అవకాశం ఏర్పడుతుంది' అని పేటీఎం తెలిపింది. పేటీఎం నోడల్ అకౌంట్ అనేది తన ఖాతాదారుల వ్యాపార లావాదేవీలు పరిష్కరించే ఒక మాస్టర్ ఖాతాలంటిది.
అంతకుముందు, ఎవరైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు (ఎన్సీఎమ్సీ) వాడుతున్నారో వారు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. అంతకుముందు ఈ ఫిబ్రవరి 29 వరకు గడువు విధించింది. తర్వాత దాన్ని మార్చి 15కు పొడగించింది.
2022 మార్చిలో సైతం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అమెరికాలో గూగుల్ పే బంద్! మరి భారత్ సంగతేంటి? మన డబ్బు భద్రమేనా?
బైజూస్ రవీంద్రన్‌కు షాక్- CEOగా తొలగిస్తూ షేర్ హోలర్డ నిర్ణయం