Nvidia Employees Late Night Work : ఎన్విడియా- మూడు ట్రిలియన్ డాలర్ల కంపెనీ. ఇందులో పనిచేసే ఉద్యోగులంతా కోటీశ్వరులే! రిటైర్ అయి శేషజీవితం సునాయాసంగా గడిపే అంత సంపద!! ఇవన్నీ ఉన్నా ఆ కంపెనీ ఉద్యోగులు వారానికి ఏడు రోజుల పాటు, నిత్యం రాత్రి 2.00 గంటల వరకు పనిచేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో మీటింగులకు హాజరవుతూ, బాస్‌లు పెట్టే చివాట్లు భరిస్తున్నారు. పని ప్రదేశంలో పరిస్థితులు అనుకూలంగా లేకున్నా, ఆ సంస్థను మాత్రం వీడటం లేదు ఉద్యోగులు. వీరంతా ఎందుకిలా చేస్తున్నారు? ఇబ్బంది ఉన్నా ఆ కంపెనీ నుంచి ఎందుకు బయటకు వెళ్లడం లేదు? అనే వివరాలతో బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది. అందులో కొందరు ఉద్యోగులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఎన్విడియాలో ఉద్యోగ వాతావరణం ప్రెషర్ కుక్కర్‌లా ఉంటుందని తెలిపారు.
'ప్రెషర్ కుక్కర్లో పనిచేస్తున్నాం!'
బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం- ఎన్విడియాలో ఉన్న సుదీర్ఘ పనిగంటలు, మీటింగ్‌ల్లో ఉద్యోగులకు మేనేజర్లు చివాట్లు పెట్టడం, వాగ్వాదాలు ఉంటాయని కొందమంది సంస్థ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు వెల్లడించారు. ఇంతకుముందు ఎన్విడియాలో టెక్ సపోర్ట్ రోల్లో పని చేసిన ఓ వ్యక్తి, తాను వీకెండ్స్‌తో సహా ప్రతిరోజు రాత్రి 1-2 గంటల వరకు పనిచేసేవాడినని చెప్పాడు. ఇక తన ఇంజినీర్ సహోద్యోగులు ఇంకా ఎక్కువ సేపు పనిచేసేవారని వెల్లడించాడు. మరికొందరు ఉద్యోగులు మాట్లాడుతూ, తాము ప్రతిరోజు కనీసం 7 మీటింగ్‌లకు హాజరయ్యేవారమని తెలిపారు. అంతేకాకుండా నిబంధనల కంటే తక్కువ సమయం పని చేసిన ఉద్యోగులను కంపెనీ-వైడ్ మీటింగ్‌లకు పిలిచేవారట.
అయితే, ఎన్విడియాలో పని వాతావరణం గురించి కథనాలు వస్తున్నా- ఆ ప్రభావం ఈ చిప్ మేకర్‌పై పడలేదు. ఉగ్యోగులు సంస్థను వీడటం లేదు. ఈ సంస్థ 2024 వార్షిక సుస్థిరత నివేదిక ప్రకారం- ఉద్యోగులు కంపెనీని వీడే రేటు ఐటీ ఇండస్ట్రీలో సగటున 17.7శాతం ఉంటే, ఎన్విడియాలో 2.7శాతం మాత్రమే.
అందుకే ఉద్యోగులు సంస్థను వీడటం లేదు!
అయితే, ఎన్విడియాలో ఈ రేటు తక్కువగా ఉండటానికి కారణం, ఉద్యోగులకు నాలుగేళ్ల కాల వ్యవధితో కంపెనీ ఇచ్చే స్టాక్ గ్రాంట్స్. అంటే ఉద్యోగులకు జీతానికి సమానమైన స్టాక్ ప్యాకేజీ ఇస్తారు. 2019లో నుంచి ఎన్విడియా స్టాక్స్ వ్యాల్యూ 3,776శాతం పెరిగింది. దీంతో గత ఐదేళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా దాదాపు కోటీశ్వరులు అయి ఉంటారని బ్లూమ్‌బర్గ్ కథనం తెలిపింది. ఇక ఈ కంపెనీ పార్కింగ్ స్పేస్‌లో పోర్షే, కార్వెట్స్, లాంబోర్గినీ వంటి హైఎండ్ కార్లే ఉన్నాయట. చాలా మంది ఉద్యోగులు రూ.కోట్ల విలువైన ఇళ్లు కొనడానికి వారి ఆదాయంలో 40 నుంచి 60శాతం ఖర్చు చేస్తున్నారట. ఈ కంపెనీలో పదేళ్ల నుంచి పనిచేస్తున్నవారికి రిటైర్మెంట్కు కావాల్సినన్ని డబ్బులు ఉన్నప్పటికీ, తర్వాత వచ్చే స్టాక్స్ గ్రాంట్స్ కోసం పనిచేస్తూనే ఉన్నారట. ఇక కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతిక పెరుగుతుండటం, చాట్‌జీపీటీ వంటి ఏఐ సంస్థలకు ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్స్‌ను సరఫరా చేస్తుండటం వల్ల, భవిష్యత్తులో కూడా ఈ కంపెనీ స్టాక్స్‌కు అడ్డుండదని భావిస్తున్నారు. ఈ కారణంతోనే పని వాతావరణం ప్రేషర్ కుక్కర్‌లా ఉన్నా, ఉద్యోగులు కంపెనీని వీడటం లేదు.