Mutual Fund SIP Calculator : మీరు భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? పదవీ విరమణ చేసే నాటికి పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. రోజుకు రూ.100 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే చాలు. పదవీ విరమణ నాటికి సుమారు రూ.5 కోట్లు సంపాదించే వీలుంది. మ్యూచువల్ ఫండ్స్ 'సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్' (SIP) విధానంలో పెట్టుబడి పెడితే, మీ ఆర్థిక లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. ఎలా అంటే?
కాంపౌండింగ్ ఎఫెక్ట్
మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ పని చేస్తుంది. అంటే పెట్టిన పెట్టుబడిపై చక్రవడ్డీ రూపంలో రాబడి వస్తూ ఉంటుంది. దీనిని అర్థం చేసుకునేందుకు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
ఒక వ్యక్తి మొదటి ఏడాది కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. ఏడాది చివరిలో అతనికి వడ్డీ రూపంలో కొంత ఆదాయం వచ్చింది. ఇలా వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం, అసలులో కలిసిపోయింది. మరుసటి సంవత్సరం ఈ మొత్తం డబ్బుపై మళ్లీ ఆదాయం వచ్చింది. ఇది కూడా అసలులో కలిసిపోయింది. ఈ విధంగా సంవత్సరాలు గడుస్తున్న కొలదీ, అతను పెట్టిన పెట్టుబడికి, అదనపు ఆదాయం జమ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో కనిపిస్తుంది. అందుకే మ్యూచవల్ ఫండ్స్‌లో ఎంత చిన్న వయస్సులో పెట్టుబడి పెడితే అంత మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే, చిన్న వయస్సులోనే పెట్టుబడులు ప్రారంభిస్తే, దీర్ఘకాలంపాటు వాటిని కొనసాగించడానికి వీలవుతుంది. భవిష్యత్‌లో పెద్ద మొత్తంలో రాబడి సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
రోజుకు రూ.100 పెట్టుబడితో రూ.5 కోట్ల నిధి!
ఉదాహరణకు, కొత్తగా ఉద్యోగంలో చేరిన 25 ఏళ్ల వ్యక్తి సిప్ విధానంలో రోజుకు రూ.100 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడని అనుకుందాం. అప్పుడు నెలకు అతను రూ.3000 వరకు పెట్టుబడి పెట్టినట్లు అవుతుంది. అతను 60 ఏళ్లకు రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఏటా 10 శాతం చొప్పున తన పెట్టుబడులను పెంచుకుంటూ, 35 ఏళ్ల వరకు పెట్టుబడి కొనసాగించాడు అనుకుంటే, అతను పదవీ విరమణ చేసే నాటికి భారీ మొత్తంలో ఆర్థిక నిధిని సమకూర్చుకునే వీలుంది. దీనిని సింపుల్‌గా అర్థం చేసుకునేందుకు, ఇప్పుడు ఒక సింపుల్ కాలిక్యులేషన్ చూద్దాం.
నోట్ : రీసెంట్ మార్కెట్ ట్రెండ్‌ను బట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో ఏడాదికి 12 శాతం వరకు రాబడి వస్తుందని అనుకుని, ఈ లెక్క కడదాం.
ప్రారంభ పెట్టుబడి = రోజుకు రూ.100 చొప్పున లెక్కవేస్తే నెలకు రూ.3000
పెట్టుబడి కాలం = 35 సంవత్సరాలు
యాన్యువల్ రిటర్న్ = 12%
మొత్తం పెట్టుబడి = రూ.3000 X 12 నెలలు X 35 సంవత్సరాలు = రూ.97,56,877
పెట్టుబడిపై వచ్చే రాబడి = రూ.4,35,43,942
∴ 35 ఏళ్ల తరువాత పెట్టుబడిదారుడికి అందే మొత్తం ఆర్థిక నిధి = రూ.5,33,00,819
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన విషయాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. కనుక ఇలాంటి పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
మీరు త్వరగా కోటీశ్వరులు కావాలా? 15x15x15 రూల్ ఫాలో అయిపోండి! - 15x15x15 Investing Rule