Multiple Pan Card Issues : మన దేశంలో ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా 'పర్మినెంట్ అకౌంట్ నెంబర్' (PAN) అవసరం. ఈ పాన్ కార్డును ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్ నంబర్ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. పన్ను ప్రయోజనాల కోసం ఐడెంటిఫికేషన్ నంబర్లా పాన్ కార్డు పనిచేస్తుంది. ఆదాయ పన్ను శాఖ ఈ పాన్ కార్డ్ ద్వారా, వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తుంది. పన్ను ఎగవేతలను గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుంది.
చట్ట విరుద్ధం!
మన దేశంలో ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. 1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ ప్రకారం, ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే సెక్షన్ 272బీ ప్రకారం జరిమానా విధిస్తారు. అందుకే మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే, ఆ ఎక్స్ట్రా పాన్ కార్డ్‌లను ఆదాయ పన్నుశాఖవారికి సరెండర్ చేయాలి. అది ఎలా అంటే?
How To Surrender Extra Pan Card Online :
- ముందుగా మీరు NSDL ఆన్లైన్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.
- పోర్టల్‌లో Application Type డ్రాప్‌డౌన్ మెనూలోకి వెళ్లి PAN Correction ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తరువాత మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి.
- స్కాన్ చేసిన ఫొటోలను అప్లోడ్ చేయండి.
- మీ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటున్న పాన్ నంబర్‌ను సెలెక్ట్ చేయండి.
- తరువాత మీరు సరెండర్ చేయాలని అనుకుంటున్న పాన్ కార్డుల వివరాలు నమోదు చేయండి.
- ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
- వీటికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, ఆన్లైన్లోనే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి.
- ఈ ప్రాసెసింగ్ ఫీజ్‌ను డిమాండ్ డ్రాఫ్ట్; క్రెడిట్, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
- ఫీజు చెల్లించిన తరువాత అక్నాలెడ్జ్మెంట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి. దీనికి మీ ఫొటో అంటించి NSDLకు పంపించండి.
How To Surrender Extra Pan Card Offline :
- పాన్ కరెక్షన్ ఫారమ్ తీసుకుని, దానిని పూరించి, సమీపంలోని NSDL కలక్షన్ కేంద్రంలో సమర్పించండి.
- మీ దగ్గర అదనంగా ఉన్న పాన్ కార్డుల వివరాలను తెలుపుతూ అసెసింగ్ అధికారికి ఒక లేఖ రాయండి. వాటిని రద్దు చేయమని కోరండి.
- అవసరమైతే అఫిడవిట్‌ను కూడా దాఖలు చేయండి. అంతే సింపుల్!
- ఈ విధంగా మీరు ఆఫ్‌లైన్‌లో కూడా అదనపు పాన్ కార్డులను సరెండర్ చేయవచ్చు.
ఈ విషయాలు తెలుసుకోండి!
ఆన్లైన్లో పాన్ సరెండర్ ఫారమ్ సబ్మిట్ చేశాక 15 రోజుల్లోగా అక్నాలెడ్జ్మెంట్ కార్డును NSDLకు పంపించాలి. ఆదాయ పన్ను శాఖ వారు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. అందుకే పాన్ సరెండర్‌కు సంబంధించిన అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అదనపు పాన్ కార్డులను రద్దు చేయడానికి కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. కనుక ఓపికగా ఉండాలి. అవసరమైతే నేరుగా అసెసింగ్ అధికారిని కలిసి మీ సందేహాలను తీర్చుకోవాలి.
EPF అకౌంట్ బ్లాక్ అయిందా? ఇలా చేస్తే అంతా సెట్! - How To Unblock EPF Account