Mass Layoffs In IT Companies : మనదేశ ఐటీ రంగాన్ని మరోసారి మందగమనం ఛాయలు ఆవరించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లలో దూకుడును తగ్గించాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోవడాన్ని తగ్గించేశాయి. తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో భారతీయ ఐటీ కంపెనీలు 32 శాతం తక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.30 లక్షల మందిని ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోగా 2023-24లో ఆ సంఖ్య కాస్త తగ్గిపోయి 1.55 లక్షలకు చేరింది. కాస్త వెనక్కి వెళ్తే 2023-24లో దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 10,669 తగ్గింది. ఇన్ఫోసిస్ కంపెనీలో అత్యధికంగా 24,182 మంది సంఖ్య తగ్గగా విప్రోలో 18,510 మంది, హెచ్‌సీఎల్ టెక్‌లో 2,486 మంది ఉద్యోగులు తగ్గారు. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీలు దాదాపు 55వేల మందికిపైగా ఉద్యోగులకు గుడ్ బై చెప్పాయి.
ఉద్యోగ కోతల వెనుక కారణాలు
దేశంలోని నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఇంత భారీగా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి కేవలం ఉద్యోగ కోతలు ఒక్కటే కారణం కాదు. మరెన్నో అంశాలు కూడా ఈ పరిణామానికి దారితీశాయి. కొంతమంది ఉద్యోగులు మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ స్వతహాగా కంపెనీలు మారగా ఇంకొంతమందికి ఇతర కంపెనీల నుంచి ఆకర్షణీయమైన ఆఫర్స్ వచ్చాయి. మరికొందరు ఐటీ ఎంప్లాయీస్ ఇంక్రిమెంట్లు సరిగ్గా లేవనే కారణంతో ఇతర కంపెనీల్లోకి జంప్ అయ్యారు. కొత్త రిక్రూట్‌మెంట్‌ను ఆపేయడం వల్ల ప్రముఖ ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగుల సంఖ్యలో పెరుగుదల నమోదు కాలేదు.
హెచ్‌సీఎల్ టెక్, విప్రోలు ఏం చెప్పాయంటే
తాము శాలరీ హైక్ ప్రకటించి చాలామంది ఉద్యోగులు వలస వెళ్లకుండా ఆపగలిగామని హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ తెలిపారు. కంపెనీ నుంచి వలస వెళ్లిన వారిలో ఉన్నత స్థాయి ఉద్యోగులు చాలా తక్కువ మందే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 2023 డిసెంబరు నాటికి హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో 224,756 మంది ఉద్యోగులు ఉన్నారు. గతేడాది అక్టోబరు - డిసెంబరు మధ్యకాలంలో తాము 3,818 మంది ఫ్రెషర్లను చేర్చుకున్నామని ఈ కంపెనీ తెలిపింది.
2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మొత్తం 9వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్నామని పేర్కొంది. ఇక ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్లను ప్రస్తుతం తగ్గించడంపై విప్రో చీఫ్ హెచ్‌ఆర్ సౌరభ్ గోవిల్ స్పందిస్తూ, కంపెనీలో ఇప్పుడు సరిపడా మ్యాన్ పవర్ ఉందన్నారు. అయితే ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారిని రిక్రూట్ చేయడాన్ని కంటిన్యూ చేస్తామని వెల్లడించారు.
నాటి నుంచి నేటి దాకా
ఇంతకీ మన దేశ ఐటీ కంపెనీలను సంక్షోభ ఛాయలు ఎందుకు ఆవరించాయి? అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే- కరోనా కాలం నుంచి మొదలుకొని ఛాట్ జీపీటీ ఆవిష్కరణ దాకా ప్రతీ పరిణామాన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. 2019 సంవత్సరం నుంచే ఐటీ కంపెనీలు ఒక రకమైన ఒత్తిడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. కరోనా దెబ్బకు భారత ఐటీ కంపెనీలకు కాసులు కురిపించే అమెరికా, ఐరోపా మార్కెట్ దివాలా తీసింది. దీంతో మన దేశ ఐటీ కంపెనీల ఆర్థిక మూలాలు బలహీనపడ్డాయి. ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికిగానూ అనివార్య పరిస్థితుల్లో గత ఐదేళ్లలో చాలాసార్లు దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగ కోతలు చేశాయి. ఇప్పుడు పశ్చిమాసియాను ఆవరించిన యుద్ధ మేఘాలు మరోసారి ఐటీ కంపెనీల కార్యకలాపాలకు కొత్త సవాల్ విసురుతున్నాయి.