Lpg Gas Cylinder Price Increase : కేంద్రం బడ్జెట్‌కు ముందు చమురు సంస్థలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. 19కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను గురువారం రూ.14 మేర పెంచాయి ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు. గృహ అవసరాల వంటగ్యాస్ ధరను మాత్రం యథాతథంగా ఉంచాయి. ప్రస్తుతం 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉంది.
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను హోటల్స్, రెస్టారెంట్లు లాంటి వాటిల్లో వాడతారు. తాజాగా పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు గురువారమే అమల్లోకి వచ్చాయి. దీంతో దిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.1755.50 నుంచి 1769.50కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1769.50, ముంబయిలో రూ.1887, చెన్నైలో రూ.1937కు చేరుకుంది.
గత నెల(జనవరి 1న) నూతన సంవత్సరం వేళ 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూపాయిన్నర తగ్గించాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. గృహ అవసరాల వంటగ్యాస్ ధరను మాత్రం యథాతథంగా ఉంచాయి.
ప్రతినెలా ఒకటో తేదీన
ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లు ప్రతి నెల 1వ తేదీన వంటగ్యాస్, ఏటీఎఫ్ ధరలను సవరిస్తూ ఉంటాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం
Petrol Diesel Price Today : ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రికార్డు స్థాయిలో గత 22 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగానే ఉంచుతున్నాయి. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ఎల్పీజీ సిలిండర్ ధరలను ఎలా, ఎక్కడ చెక్ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్సైట్లో ఎల్పీజీ ధరలతోపాటు, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.