Investment Portfolio By Age : పెట్టుబడి, సంపద సృష్టి అనేక సంవత్సరాల పాటు కొనసాగే ప్రక్రియ. ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు అందరికీ ఒకేలా ఉండవు. మీ లక్ష్యాలు ఇతరులకు భిన్నంగా ఉన్నప్పటికీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని అంశాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఆర్థిక భద్రత కొరకు ప్రతీ ఒక్కరూ ఆర్థిక వ్యవహారాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మీరు వివిధ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే అనేక పద్ధతుల్లో పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. వయసు ఆధారంగా కూడా పెట్టుబడులను మార్చుకోవడం చేయాలి.
20-30 వయసు మధ్య!
డబ్బును పెంచుకోవడానికి పెట్టుబడి ఒక్కటే మార్గమని మనందరికీ తెలుసు. కానీ, దానికి ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. యుక్త వయసులో ఉన్నవారికి పెట్టుబడి పెట్టేందుకు చాలా కాలవ్యవధి ఉంటుంది. 20-30 ఏళ్లలో సంపాదన మొదలైతే, అధిక రిస్క్ ఉన్నా మంచి రాబడి వచ్చే పథకాల్లో మదుపు చేయడం మంచిది. అయితే మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ నిష్పత్తి అత్యధికంగా ఉండేలా చూడాలి. ఈ వయసులో ఉన్నవారికి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ, ఖర్చులు, బాధ్యతలు కూడా తక్కువగా ఉంటాయి. అందకే రిస్క్ చేయొచ్చు. అందుచేత వీరు తమ పెట్టుబడుల్లో 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించడం మంచిది. ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటి ప్రభుత్వ మద్దతు ఉన్న పొదుపు పథకాలకు 15% కేటాయించాలి. 5 శాతాన్ని అత్యవసర నిధిగా బ్యాంకు పొదుపు ఖాతాలో ఉంచాలి. అంతేకాకుండా విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యా రుణం తీసుకుంటే, దాన్ని తిరిగి చెల్లించడానికి తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి.
30-40 మధ్య!
ఈ వయసు వారు ఈక్విటీల నిష్పత్తిని 60-70 శాతం వరకు నిర్వహించొచ్చు. పదవీ విరమణ ప్రణాళికను ప్రారంభించడానికి 30-40 వయసు వారికి మంచి సమయం. దీనికి ఎన్పీఎస్ పరిశీలించొచ్చు. ఇంకా, ఈ వయసులో చాలా మంది తమ సొంత ఇంటిని నిర్మించాలనుకుంటారు. బ్యాంకు వద్ద రుణం తీసుకుని ఇంటిపై పెట్టుబడి పెట్టడం కూడా మంచిదే. ఈ వయసులో 20 శాతం డౌన్‌పేమెంట్ చెల్లించి, 20 ఏళ్ల పాటు ఈఎంఐ చెల్లించే విధంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. మీ ఆదాయంలో ఎక్కువ మొత్తం ఇంటి ఈఎంఐకు వెళ్తుంది.
40-50 వయసు మధ్య!
ఇక 40 ఏఏళ్లకు వచ్చేసరికి జీవనశైలిలో అనేక మార్పులుంటాయి. ఈ వయసు వారు తమ వృత్తి జీవితంలో బాగానే సంపాదిస్తుంటారు. అయితే, ఈ వయసు వారికి తల్లిదండ్రుల సంరక్షణ, పిల్లల చదువుకు నిధులు సమకూర్చడం లాంటి బాధ్యతలు కీలకంగా మారతాయి. దీని వల్ల ఖర్చులు పెరుగుతాయి.
అందుకే ఈ వయసులోని వారు పెట్టుబడి పెట్టేవారు తక్కువ రిస్క్‌తో ఉన్న బాండ్లు, స్థిర పెట్టుబడులకు ఎంచుకోవటం మంచిది. వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 40% ఈక్విటీ, 40% డెట్ ఫండ్లను కలిగి ఉన్న బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉండేందుకు ప్రయత్నం చేయాలి. తమ ఆదాయంలో 5 శాతం అత్యవసర నిధిగా బ్యాంకులో తప్పనిసరిగా ఉంచాలి.
50-60 వయసు మధ్య!
పదవీ విరమణకు ముందు కాలం పెట్టుబడిదారులకు చాలా కీలకమైంది. ఈ వయసులోవారు తమ పిల్లలను స్వదేశంలో లేదా విదేశీల్లో ఉన్నత విద్య కోసం తగినంతగా నిధులు ఉండాలని కోరుకుంటారు. అందకే గతంలో పెట్టిన పెట్టుబడుల రాబడులను, వాటి స్థితిగతులను విశ్లేషిస్తూ ఉండాలి. ఈ వయసు వారు ముఖ్యంగా తమ జీవనశైలి, భవిష్యత్తు లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వీరు 60 ఏళ్ళ వయసుకు దగ్గరగా వచ్చినప్పుడు ఈక్విటీ ఎక్స్‌ఫోజర్‌ను బాగా తగ్గించుకోవాలి. అధిక రాబడి లభించే బాండ్లు వంటి పెట్టుబడి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. 60 ఏళ్ల తరువాత కూడా పని చేస్తూ ఉండాలని ప్లాన్ చేస్తుంటే, 40% ఈక్విటీ, 60% బాండ్ల ఎక్స్‌పోజర్‌తో పోర్ట్‌ఫోలియో కొనసాగించాలి.
60-70 వయసు మధ్య!
ఈ వయసులో దాదాపుగా అందరు హాయిగా పదవీ విరమణ తీసుకుని ఉంటారు. మీ దగ్గర ఉన్న పదవీ విరమణ నిధి మొత్తాన్ని అధిక హామి ఉండే బ్యాంకు ఎఫ్‌డీల్లో గానీ, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పీఎంవీవీవై వంటి హామి పథకాల్లో మదుపు చేయడం మంచిది.