How To Reduce Debts By Snowball Method : చాలా మంది దొరికినంత వరకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారు స్నోబాల్ వ్యూహాన్ని అనుసరించి రుణాల బెడద నుంచి సులువుగా బయటపడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
What Is The Debt Snowball Strategy : మీరు ఒక పెద్ద మంచుతో చేసిన బంతి(స్నోబాల్)ని ఒక వాలుతలంపై విడిచిపెట్టారనుకోండి. అది క్రమంగా కరిగి చిన్నదై, చివరికి పూర్తిగా కరిగిపోతుంది. మీరు కూడా ఇదే స్నోబాల్ స్ట్రాటజీని ఉపయోగించి, మీ రుణాలను క్రమంగా తగ్గించుకోవచ్చు. దీని గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం.
ముందుగా మీరు చేసిన అప్పుల జాబితాను సిద్ధం చేసుకోవాలి. వాటిని చిన్న రుణం నుంచి పెద్ద రుణం వరకు ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. అన్నింటి కంటే అతి చిన్న రుణాన్ని త్వరగా తీర్చేయాలి. పెద్ద పెద్ద రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే ప్రయత్నం చేయాలి. ఒక చిన్న రుణాన్ని పూర్తిగా తీర్చేసిన తరువాత, మరో చిన్న రుణాన్ని తీర్చేందుకు సిద్ధం కావాలి. ఇలా చేయడం వల్ల చిన్నచిన్న అప్పులు అన్నీ త్వరగా తీరిపోతాయి. పెద్ద రుణాలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తాయి. ఈ వ్యూహాన్ని పాటించడం వల్ల మీపై ఉన్న ఆర్థిక భారం క్రమంగా తగ్గుతూ వస్తుంది. మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. పెద్ద అప్పుల విషయంలో కనీస బకాయిలు చెల్లించడం వల్ల, మీ క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా పెరుగుతుంది.
కొత్త రుణాల జోలికి వెళ్లొద్దు!
స్నోబాల్ వ్యూహం పాటిస్తున్నప్పుడు కొత్త అప్పులు చేయకూడదు. రుణ బకాయిలను కూడా వాయిదా వేయకూడదు. ఒక వేళ కొత్త రుణాలు చేసినా, బకాయిలు కట్టకుండా ఉన్నా, స్నోబాల్ వ్యూహం పూర్తిగా విఫలమవుతుంది. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీరు ముందుగానే సంసిద్ధం కావాలి. జీవిత, ఆరోగ్య బీమాలను తీసుకోవాలి. అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవాలి. అలాగే లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్లను చేయాలి. అప్పుడే మీకు కావాల్సినప్పుడు డబ్బులు చేతికి అందుతాయి.
మానసిక దృఢత్వం ముఖ్యం!
స్నోబాల్ వ్యూహం పాటించాలంటే, చాలా మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. రుణాలు తీర్చేయాలనే సంకల్పాన్ని విడవకూడదు. అయితే ఈ స్నోబాల్ వ్యూహంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అవసరాలు వస్తాయో చెప్పలేము. అందువల్ల కొత్త అప్పులు చేయకుండా ఉండలేని పరిస్థితి రావచ్చు. కొన్ని చిన్న అప్పుల కంటే, పెద్ద అప్పులే త్వరగా తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. పైగా ఈ స్నోబాల్ వ్యూహం వల్ల మీరు అధిక వడ్డీలను కూడా చెల్లించాల్సి రావచ్చు. అందువల్ల మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సరైన ప్రణాళికలు వేసుకోవాలి. వ్యూహాలను రచించుకోవాలి. అవసరమైతే సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. అప్పుడే మీరు రుణాల ఊబిలోంచి బయటపడతారు.
ఎన్పీఎస్ నయా రూల్ - ఇకపై ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి! - NPS New Login Rules
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలా? సరైన ITR ఫారాన్ని ఎంచుకోండిలా! - How To Choose Right ITR Form