How To Make A Home Budget : దేశ ప్రస్తుత ఆర్థిక స్థితిని, భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఇది ఎన్నికల సంవత్సరం కనుక కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని, మనమూ ఇంటి బడ్జెట్‌ను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా మన ఇంటి అవసరాలు, భవిష్యత్ అవసరాలు, లక్ష్యాల కోసం సరైన బడ్జెట్ తయారుచేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు మన కుటుంబం కోసం మంచి బడ్జెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం.
ఆదాయ మార్గాలు
బడ్జెట్ అంటే కేవలం ఆదాయ, వ్యయాల ప్రణాళికే కాదు. ఒక్కో లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధుల కేటాయింపులు, వాటిని సమీకరించే మార్గాలు ఇలా అనేకం ఉంటాయి. ఓ వైపు ఆదాయాన్ని పెంచుకుంటూ, మరోవైపు అభివృద్ధిని సాధించే దిశగా ప్రయత్నాలూ ఉంటాయి. మన ఇంటి బడ్జెట్ సైతం ఆ విధంగానే ఉండాలి. మీకు నెలవారీగా వచ్చే ఆదాయంపై, మీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా వ్యాపారం, వ్యవసాయం ఇలా ఏం చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నామన్నది ముందు తెలుసుకోవాలి. నెలవారీ వచ్చే జీతభత్యాలు, మధ్యలో వచ్చే బోనస్‌లు, ఇతర ఆదాయాలు తదితరాలు ఏటా ఎంత వరకు వస్తున్నాయి అనేది చూసుకోవాలి. కొందరికి నగదు రూపంలో ప్రయోజనాలు అందుతాయి. మరికొందరికి షేర్ల రూపంలో రాబడి వస్తుంది. డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్ల నుంచి వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. డివిడెండ్లు, మూలధన లాభాలు, స్థిరాస్తుల నుంచి వచ్చే రెంట్లు, ఇలా ప్రతి రూపాయినీ మీ ఆదాయంలో భాగంగా పరిగణనలోకి తీసుకోవాలి.
కొన్నిసార్లు మనం అనుకున్నంత ఆదాయం రాకపోవచ్చు. ఉద్యోగం కోల్పోవడంలాంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడవచ్చు. అద్దె ద్వారా వస్తున్న ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా, తట్టుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి. అందుకే భవిష్యత్ ఆర్థిక అత్యవసరాలకు తగిన విధంగా ఇప్పుడే ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే మీ ఆదాయంపై మీకు సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది.
ఖర్చుల మాటేమిటి?
- పన్నులు: సంపాదిస్తున్న ఆదాయం మొత్తం మనం ఉపయోగించుకోలేం. ఆదాయపు పన్ను, మూలధన లాభాలపై పన్ను, ఇంటి నుంచి వచ్చే ఆదాయం సహా, ఇతర ఆదాయాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటాయి. మీరు ఉపయోగించే వస్తు, సేవలపై జీఎస్‌టీ లాంటివి చెల్లించాలి. కనుక, ఏడాదికి ఎంత ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందో, ముందే ఒక స్పష్టమైన అంచనాకు రావాలి. దానికి తగ్గట్టుగా సిద్ధం కావాలి.
- వడ్డీలు : ఇల్లు, వాహనం కొనేందుకు రుణం తీసుకుంటాం. పిల్లల చదువుల కోసం విద్యా రుణం, పర్సనల్ లోన్ లాంటివీ తీసుకుంటాం. ఈ రుణాలన్నింటికీ చెల్లించే వడ్డీని ఖర్చు కిందే లెక్కించాలి. ఈఎంఐలో ఎంత భాగం వడ్డీకి వెళ్తుందో లెక్కకట్టుకోవాలి. మీ మొత్తం ఆదాయంలో, ఎంత మేరకు వడ్డీ చెల్లింపులకు కేటాయించాలో లెక్కించుకోవాలి. వీలైనంత త్వరగా అప్పులు తీర్చేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే, అధిక వడ్డీల భారం ఉంటే ఆర్థిక ప్రణాళికలు ముందుకు సాగవు.
తప్పనిసరి అవసరాలు
ప్రభుత్వానికి రోజూ ఎన్నో ఖర్చులుంటాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అనేక ఇతర బాధ్యతలు ఉంటాయి. మనకు కూడా ఇలాంటి తప్పనిసరి ఖర్చులు చాలానే ఉంటాయి. ఇంటి అద్దె చెల్లించడం, నిత్యావసర సరుకుల కొనుగోలు, బిల్లుల చెల్లింపులు, ఇంటి నిర్వహణ ఖర్చుల్లాంటివి ఉంటాయి. పిల్లల ఫీజులు, ప్రయాణ ఖర్చులు, వైద్యం, దుస్తులు, ఇతర ఖర్చులన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి. కనీసం రెండు, మూడు నెలల సగటు ఖర్చులను లెక్కించాలి. అప్పుడే మీకు తప్పనిసరి ఖర్చుల గురించి ఎంత కేటాయించాలో తెలుస్తుంది.
మూలధన వ్యయాలు
మీ పిల్లలకు ల్యాప్‌టాప్ కొనుగోలు, ఇంటికి అవసరమైన గృహోపకరణాలు, కొత్త కారు కొనడం లాంటి మూలధన వ్యయాలనూ లెక్కలోకి తీసుకోవాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకూ కొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యయాలన్నింటినీ అంచనా వేసుకోవాలి. గత రెండు, మూడేళ్లుగా మీ క్రెడిట్ కార్డు బిల్లులను, బ్యాంకు స్టేట్‌మెంట్లను జాగ్రత్తగా గమనించాలి.
ద్రవ్యోల్బణానికి అనుగుణంగా
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, వినియోగ ద్రవ్యోల్బణం 6% వరకూ ఉందని అనుకుంటే, మీ ఖర్చులు భవిష్యత్తులో ఏటా 6 శాతం మేరకు పెరుగుతాయని అర్థం. అదే సమయంలో జీవన శైలి ద్రవ్యోల్బణం ఇంతకన్నా అధికంగా ఉండొచ్చు. కనుక వీటికి తగినట్లు మీ ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించాలి. పొదుపు, మదుపు చేసి, భవిష్యత్ ఆర్థిక అవసరాలను తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
రుణాల జోలికి పోకుండా
ప్రభుత్వానికి ఆదాయం, వ్యయాల మధ్య లోటు ఉంటే, వెంటనే అప్పులు చేయడం, లేదా పన్నులు పెంచడం లాంటి వివిధ మార్గాల ద్వారా ఆ అంతరాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మన సంగతి అలా కాదు. వచ్చిన ఆదాయానికీ, ఖర్చులకూ మధ్య పొంతన ఉండేలా సరైన బడ్జెట్‌ను తయారు చేసుకోవాలి. లోటు ఉన్నప్పుడల్లా రుణాలు తీసుకుంటే, తరువాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇంటి బడ్జెట్‌ను సమర్థవంతంగా రూపొందించుకొని, దాన్ని వంద శాతం ఆచరణలో పెట్టినప్పుడే ఆర్థిక విజయం సాధించడం సాధ్యమవుతుంది.
ఇల్లు లేదా ఫ్లాట్ కొంటున్నారా? ఈ 8 అంశాలను కచ్చితంగా చెక్ చేసుకోండి!
ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్ - KYC గడువు పెంపు - కొత్త తేదీ ఇదే!